రేపు మెదక్ జిల్లాకు ఖర్గే, డీకేసీ రాక

– సంగారెడ్డి, నర్సాపూర్ లో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్స్
– సాయంత్రం మెదక్ లో పాదయాత్ర
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ ఉమ్మడి జిల్లాలో ఏఐసీసీ అగ్రనాయకులు ఆదివారం పర్యటించనున్నారు. మలివిడత ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు సభలకు హాజరుకానున్నారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంగారెడ్డి, మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో నిర్వహించే కార్నర్ మీటింగ్స్ లో ప్రసంగించనున్నారు.
మెదక్ లో సాయంత్రం 6 గంటలకు పాదయాత్ర చేపట్టనున్నట్లు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, నర్సాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు రాష్ట్ర సీనియర్ నాయకులు తరలిరానున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, జగ్గారెడ్డి, మైనంపల్లి హన్మంతరావు పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.