MLC కవిత స్ట్రాటజీ ఏంటి?.. ఎందుకు తిరుగుబాటు చేస్తోంది!
సొంత క్యాడర్ ను ఏర్పాటు చేసుకొనే దిశగానే కవిత దూకుడు పెంచిందన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతున్నది. పార్టీలో తండ్రి తర్వాత తనకే ప్రాధాన్యం ఉండాలని కవిత బలంగా కోరుకుంటున్నట్ట కనిపిస్తున్నది.

Mlc Kavitha| Brs
హైదరాబాద్, (విధాత): కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కయ్యానికి సై అంటున్నట్టు కనిపిస్తున్నది. తన దారి తాను చూసుకుంటున్నట్టే కనిపిస్తున్నది. సొంతంగానే జిల్లాల పర్యటనలు చేస్తుండటం.. చిట్ చాట్ లు నిర్వహిస్తూ ఘాటు విమర్శలు గుప్పిస్తుండటంతో ఆమె సొంతకుంపటి దిశగానే ముందుకు సాగుతున్నట్టు రాజకీయవిశ్లేషకులు భావిస్తున్నారు. సొంత క్యాడర్ ను ఏర్పాటు చేసుకొనే దిశగానే కవిత దూకుడు పెంచిందన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతున్నది.
పార్టీలో తండ్రి తర్వాత తనకే ప్రాధాన్యం ఉండాలని కవిత బలంగా కోరుకుంటున్నట్ట కనిపిస్తున్నది. రాజకీయ ప్రాధాతన్య కల్పించడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నది. పార్టీకి కాబోయే లీడర్ కేటీఆరే అన్నట్టుగా కేసీఆర్ వ్యవహరిస్తుండటం కవితకు నచ్చడం లేదని సమాచారం. అందుకే ఆమె బహిరంగంగానే పార్టీ మీద విమర్శలు గుప్పిస్తున్నది. పార్టీలో కేసీఆర్ ను మినహా మరొకరిని నాయకుడిగా తాను అంగీకరించనని స్పష్టం చేశారు. ఈ ప్రకటన చేయడం ద్వారా కేటీఆర్‌ను నాయకుడిగా అంగీకరించే ప్రసక్తే లేదని కవిత పరోక్షంగా సంకేతాలు పంపించింది.
తండ్రి మీద అసంతృప్తి
లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కవిత.. పార్టీ అధినేత, తండ్రి కేసీఆర్‌పై అసంతృప్తితోనే ఉన్నట్లు సమాచారం. జైలు నుంచి వచ్చాక ఆమెను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచిన విషయం తెలిసిందే. దీంతో తనకు పార్టీలో అవమానం జరుగుతోందని.. రాజకీయాలకు దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానాలతో కవిత స్వయంగా జాగృతి పేరుతో కార్యక్రమాలు చేపట్టిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
అలాగే వరంగల్ బహిరంగసభలో వేదికపైన కేసీఆర్‌తో పాటు ఒక్క కేటీఆర్ ఫోటోను మాత్రమే పెట్టడాన్ని తప్పు పట్టినట్టు సమాచారం. వరంగల్ సభ తర్వాత కవిత తండ్రికి రాసిన లేఖ ఇటీవల బహిర్గతం అయిన విషయం అందరికి తెలిసిందే. ఈ లేఖలో తన తండ్రి కేసీఆర్ బీజేపీని విమర్శించలేదని ఆరోపించారు. లేఖ వెలుగులోకి వచ్చిన తర్వాత కవిత తన అసంతృప్తని బహాటంగానే వ్యక్తం చేశారు. దేవుడి లాంటి తన తండ్రి చుట్టూ దయ్యాలున్నాయని ఆరోపించారు. తన లేఖను బయటకు లీక్ చేసిన వారెవరో తేలాలని పట్టుబడుతున్నారు.
రోజురోజుకు స్వరం పెంచుతున్న కవిత
ఎమ్మెల్సీ కవిత తన స్వరాన్ని రోజురోజుకు పెంచుతున్నారని. బీఆరెస్‌ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఇక కవిత స్వతహాగా తన క్యాడర్‌ను పెంచుకోవడానికి జనంలో సానుభూతిని పొందడానికి క్షేత్ర స్థాయిలో జిల్లాల పర్యటనలకు బయలుదేరారు. మే 29న మేడ్చల్ జిల్లాలో పర్యటించిన శుక్రవారం మంచిర్యాల జిల్లా పర్యటనకు వెళ్లారు. అక్కడ కూడా మాటల డోస్‌ను పెంచారు. కేసీఆర్ నాయకత్వాన్ని తప్ప మరొకరి నాయకత్వాన్ని ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దని డిమాండ్ చేశారు. దేశంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగు పడలేదని చెప్పారు.
కేటీఆర్ నే టార్గెట్ చేశారా?
పార్టీ నాయకులు, కేసీఆర్ కుటుంబ శ్రేయోభిలాషుల ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో కవిత లేరని ఈ పరిణామాలను సునిశితంగా పరిశీలిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ ఒకరు అన్నారు. ఎంపీ దీవకొండ దామోదరావు ఆమె ఇంటికి వెళ్లి మాట్లాడిన తరువాత కవిత ఎక్కడా తగ్గినట్లు కనిపించడం లేదన్నారు. పైపెచ్చు తన మాటల ఘాటున రోజుకింత పెంచుతూనే ఉందని అంటున్నారు. కవిత అడుగులు, మాటల తీరు, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించే విధానం, ఎక్కడా పార్టీ జెండా లేకుండా చేస్తున్న పర్యటనలను యూస్తున్న రాజకీయ పరిశీలకులు సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవడాని కంటే కయ్యానికే కాలుదువ్వుతుందా? అన్న సందేహాలు వెలువడున్నాయని అంటున్నారు. కవిత తిరుగుబాటు అంటూ జరిగితే అన్న కేటీఆర్ మీదనే అన్నట్లు కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు.
కవిత పర్యటనలకు వెళ్లొద్దు.. కేసీఆర్ ఆదేశం
అయితే పార్టీలో జరుగుతున్న పరిణామాలు, కవిత వ్యవహార శైలిపై బీఆరెస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నిశితంగా పరిశీలిస్తున్నారు. ముందుగా కాళేశ్వరంపై వచ్చిన నోటీసులకు ఏవిధంగా సమాధానం ఇవ్వాలన్నదానిపైనే కేంద్రీకరించారని సీనియర్ నేతలు అంటున్నారు. కాళేశ్వరం నోటీసులపై వరుసగా కేసీఆర్ హరీశ్‌రావును తన ఫాంహౌస్ కు పిలిపించుకొని మాట్లాడుతున్నారు. అలాగే నిపుణులతో చర్చిస్తున్నారు. కవిత అంశంపై ప్రస్తుతానికి కేసీఆర్ ఎవరినీ ఏమీ మాట్లాడొద్దని చెప్పినట్లు తెలుస్తున్నది. అయితే కవిత జిల్లాల పర్యటనల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడకుండా ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.