మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి

మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి
  • ఫేక్‌న్యూస్‌ కట్టడికి చర్యలు
  • జర్నలిస్టుల రక్షణకు గట్టి చట్టాలు
  • మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి
  • ఐజేయూ సెమినార్‌ డిమాండ్‌


న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో మీడియా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఇండియన్‌ జర్నలిస్టుల సంఘం డిమాండ్‌ చేసింది. ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా.. చట్టబద్ధంగా శక్తిమంతమైనదే కానీ.. దానికి కమిషన్‌ను ఏర్పాటు చేసే అధికారం లేదని పేర్కొన్నది. ఢిల్లీలో ఐజేయూ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి సెమినార్‌ను నిర్వహించారు. వృత్తి రీత్యా నిజాయతీగా పనిచేసే జర్నలిస్టుల పూర్తి రక్షణకు గట్టి చట్టాలు వుండాలని సెమినార్ డిమాండ్ చేసింది. ఫేక్ వార్తలను ప్రచారం చేసే వారిపై వేటుపడాలని డిమాండ్ చేశారు.



సెమినార్ కో-ఆర్డినేటర్, ఆల్ ఇండియా జర్నలిస్టుల యూనియన్ మాజీ అధ్యక్షుడు ఎస్ ఎన్ సిన్హా ఆదివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. మూడు గంటల పాటు కొనసాగిన ఈ సెమినార్‌లో జర్నలిజం ఎదుర్కొంటున్న కఠిన సవాళ్లపై కూలంషంగా చర్చించారు. ఎస్ ఎన్ సిన్హా మాట్లాడుతూ ఇండియన్ జర్నలిస్టుల యూనియన్‌కు సంబంధించిన దాదాపు పన్నెండు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుండి ప్రతినిధులు ఈ సెమినార్ లో పాల్గొన్నారని తెలిపారు.

జర్నలిస్టులకు ఎదురవుతున్న బెదిరింపులు, హింసను ప్రభుత్వం అడ్డుకోవాలని సెమినార్‌లో పాల్గొన్న ప్రింట్, ఎలక్ట్రానిక్‌, సామాజిక రంగాల నిపుణులు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సంక్షేమం, వారి ఆర్ధిక పరిస్థితుల మెరుగుదల కొరకు ప్రభుత్వం కృషిచేయాలని వారు కోరారు.



ఐజేయూ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ పరిస్థితులు, పాలసీలు మీడియా కమిషన్‌ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ పి.బి.సావంత్ మీడియా కమిషన్ కు సంబంధించిన మోడల్ రూల్స్, రెగ్యులేషన్స్ క్రమబధ్ధీకరించి ప్రభుత్వం ముందు వుంచారనీ, కానీ ప్రభుత్వం ఈ రోజు వరకు దానిపై ఎటువంటి యాక్షన్ ను తీసుకోలేదనీ శ్రీనివాసరెడ్డి విచారాన్ని వ్యక్తం జేశారు.


సుప్రీం కోర్టు న్యాయవాది రాకేశ్ ఖన్నా, సామాజిక కార్యకర్తగా మారిన ఐపీఎస్ అధికారి అమోద్ కాంత్ ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ ముందుకు తెస్తున్న జర్నలిస్టుల రక్షణ చట్టం, మీడియా కమిషన్‌ను గట్టిగా సమర్థిస్తున్నారని శ్రీనివాసరెడ్డి తెలిపారు.



ఈ సందర్భంగా కాంత్ మాట్లాడుతూ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాలు ఇప్పటికే జర్నలిస్టుల రక్షణకొరకు చట్టాలు చేశాయని, కేంద్ర ప్రభుత్వం వాటినుండి నేర్చుకోవాలని కోరారు. పాకిస్తాన్ కూడా తమ దేశంలో జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకు వచ్చిందని తెలిపారు.