‘కుంచె’దాటిన అభిమానం.. ప్రతిభకు ముగ్ధుడై అభినందించిన మంత్రి

- సూర్యాపేట అభివృద్ధిని చిత్రాలుగా గీసి..
- మంత్రి జగదీశ్ రెడ్డికి బహూకరించిన బాల చిత్రకారుడు
విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: సూర్యాపేట శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డిపై తమ గుండెల్లో దాచుకున్న అభిమానాన్ని తన కుంచెతో ఆవిష్కరించారు దివ్యాంగ యువకుడు, ఓ పాఠశాల విద్యార్థి. సూర్యాపేటలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల సందర్భంగా తాము గీసిన చిత్రాలను అభిమాన అభివృద్ధి ప్రదాత జగదీశ్ రెడ్డికి అందజేశారు.
సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి బోనగిరి నాగేందర్ సూర్యాపేటలో మంత్రి చేసిన ప్రగతిని చిత్రాలకు ప్రాణం పోశారు. అద్భుతమైన చిత్రాలుగా తన కుంచెతో ఆవిష్కరిస్తూ వేసిన చిత్రాలను మంత్రికి బహుమతిగా అందజేశారు.
ఇక రాత్రి, దివ్యాంగుల సంక్షేమ భవన్ ప్రారంభించిన సందర్భంగా కరోనా సమయంలో ప్రజలను కంటికి రెప్పలా కాపాడిన మంత్రికి కృతజ్ఞతలు చెప్పాలన్న సంకల్పంతో ప్రజల మధ్యనే ఉంటూ… నేనున్నానంటూ భరోసా కల్పించి అభయమిస్తూ ప్రజల మధ్య గడిపిన సన్నివేశాలను గుర్తు చేసే చిత్రాలను గీసి మంత్రికి అందజేశారు.
ఈ ఇద్దరి కుంచె నుండి జాలువారిన చిత్రపటాలకు అబ్బురపడిన మంత్రి వారిని మనసారా అభినందించారు. వారి కుటుంబ నేపథ్యం వివరాలు తెలుసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఆత్మవిశ్వాసంతో మరింతగా చిత్రకళలో రాణించాలని, తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని వారిని ప్రోత్సహించారు.
కేసీఆర్.. కుల వృత్తులకు జీవంపోశారు..
అచేతనంగా మారిన కుల సంఘాలు, వ్యాపార వృత్తులకు జీవం పోసింది సీఎం కేసీఆరేనని, ఆయన పాలనతో తెలంగాణలో స్వర్ణ యుగం వచ్చిందని మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేటలోని కెసారం సమీపంలో బట్రాజు సంఘ కమ్యూనిటీ హాల్, మేదరి సంఘం, రజక సంఘ కమ్యూనిటీ హాల్, మొబైల్ షాప్స్ అసోసియేషన్ భవన్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని కులాలకు, మతాలకు సమన్యాయం కల్పిస్తున్న కేసీఆర్, ఆయా కులాలు, వృత్తిదారుల్లో ఆత్మగౌరవం పెంచేందుకు సంక్షేమ భవనాలు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. కుల వృత్తిదారులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు.
కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగంగానే వృత్తిదారులకు లక్ష రూపాయల చొప్పున ఆర్థికసాయం అందిస్తుందని చెప్పారు. అందరి బాగు కోరే కేసీఆర్‌ను మరో మారు ఆశీర్వదించి, జరుగుతున్న అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.