పార్లమెంటు ఎన్నికల తర్వాతా బీఆరెస్ గల్లంతే
పార్లమెంటు ఎన్నికల తర్వాతా బీఆరెస్ పార్టీ కనుమరుగు కావడం ఖాయమని, ఇప్పటికే ఆ పార్టీ ఖాళీ అవుతుందని, ఎవరి పార్టీ గల్లంతవుతుందో మరో మూడు నెలల్లో తేలిపోతుందని

- పార్టీని కాపాడుకునేందుకే కాంగ్రెస్ హామీలపై అసత్య ప్రచారాలు
- కేటీఆర్, హరీశ్‌లపై మంత్రి జూపల్లి మండిపాటు
విధాత : పార్లమెంటు ఎన్నికల తర్వాతా బీఆరెస్ పార్టీ కనుమరుగు కావడం ఖాయమని, ఇప్పటికే ఆ పార్టీ ఖాళీ అవుతుందని, ఎవరి పార్టీ గల్లంతవుతుందో మరో మూడు నెలల్లో తేలిపోతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఆరునెలల్లో తిరుగబడతారని, ప్రజా వ్యతిరేకతలో కాంగ్రెస్ గల్లంతవుతుందంటూ బీఆరెస్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు చేసిన వ్యాఖ్యలపై జూపల్లి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆరు గ్యారంటీల్లో రెండింటిని అమలు చేసిందని, మిగతా హామీలన్ని అమలు చేస్తే బీఆరెస్ పూర్తిగా తుడిచిపెట్టుకపోతుందన్న ఆందోళనలతో కాంగ్రెస్ పార్టీ గల్లంతవుందంటూ కేటీఆర్, హరీశ్‌రావులు అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.
మేము ప్రతిపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తాం, కాంగ్రెస్ పార్టీకి సహకారం అందిస్తాం చెప్పిన బీఆరెస్ నాయకులు మరి పట్టుమని రెండు నెలల కూడా కాకముందే ఎందుకు అంత ఉలికి పడుతున్నారంటూ జూపల్లి ఎద్దేవా చేశారు. పథకాలు అమలైతే బీఆరెస్ పార్టీ మూత పడనుందని, ఆ పార్టీలో కేసీఆర్ కుటుంబ సభ్యులు మినహా ఎవరు మిగలరన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావద్దని బీఆరెస్ నేతలు గట్టిగా కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ హామీలు అమలు కావంటూ బీఆరెస్ నేతలు పగటి కలలు కంటున్నారని, ఆరు గ్యారంటీలు అమలు కావడం గ్యారంటీ అని, బీఆరెస్ తెలంగాణలో కనుమరుగు కావడం గ్యారంటీ అన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో బీఆరెస్ కుమ్మక్కు యత్నం
వచ్చే లోకసభ ఎన్నికల్లో బీఆరెస్‌కు పార్టీకి డిపాజిట్లు కూడా రావన్నారు. అందుకే పార్టీని బతికించుకోవడానికి బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి బీఆరెస్ నేతలు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారని, దీనిపై మంతనాలు కొనసాగుతున్నాయని జూపల్లి ఆరోపించారు. గత పదేండ్లలో బీజేపీతో అంటకాగారని, ఇప్పుడు కూడా బీజేపీతో పొత్తుకు బీఆరెస్ నేతలు సిద్ధమవుతున్నారని విమర్శించారు.
ఎవరు ఎన్ని చేసినా పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకోబోతుందన్నారు. తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగానే పారిశ్రామికవేత్త అదానీని సీఎం రేవంత్ రెడ్డి కలిశారన్నారు. నియోజకవర్గాల బీఆరెస్ సమీక్షల పేరుతో సమావేశాలు పెట్టి కేటీఆర్, హరీశ్‌రావులు రాజకీయ విమర్శలు చేస్తున్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆరెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు భయపడుతున్నారని, ఎవరు ముందుకు రావడం లేదని ఎద్దేవా చేశారు. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆరెస్‌కు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారని, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఆ పార్టీని వీడుతున్నారన్నారు. అందుకే బీఆరెస్ క్యాడర్ ను కాపాడుకునేందుకు కేటీఆర్, హరీశ్‌రావులు ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ అమలు చేయదని మైండ్ గేమ్ ఆడుతున్నారు. మీరు ఎంత చేసిన తెలంగాణలో బీఆరెస్ ఖాళీ అవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ హామీల అమలుపై బీఆరెస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని, అయితే ప్రజలు వాటిని నమ్మరన్నారు.
ఎన్నికల్లో ఓడినా జ్ఞానోదయం కాలేదు
ఎన్నికల్లో ఓడినా బీఆరెస్ నాయకులకు ఇంకా జ్ఞానోదయం కావడం లేదన్నారు. బీఆరెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలను మోసం చేశారు కాబట్టే గత అసెంబ్లీ ఎన్నికల్లో మీకు కర్రు కాల్చి వాత పెట్టారన్నారు. బీఆరెస్ నాయకుల ఆహాంకార దోరణి, కుటుంబ పాలన వల్ల ప్రజలు విసిగి, వేసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్నారు. మీరు పదేండ్లు అధికారంలో ఉండి దళితులకు మూడు ఎకరాల భూమి, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు, కేజీ టూ పీజీ ఉచిత విద్య, డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇలా మీరిచ్చిన హామీలను తుంగలో తొక్కారన్నారు.
తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగానే పారిశ్రామికవేత్త అదానీని సీఎం రేవంత్ రెడ్డి కలిశారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాష్ట్రం బంగారుపళ్లెం కాదు.. అప్పుల కుప్పగా మార్చారని, రూ.7 లక్షల కోట్ల అప్పు చేశారని, రూ. 40 వేల కోట్లు వడ్డీలకే పోతోందన్నారు. 2018 ఎన్నికలప్పుడు బీఆరెస్ చాలా హామీలు ఇచ్చి అమలు చేయలేదని, గతంలో విపక్షాలు బీఆరెస్‌ను రెండేళ్ల తర్వాత విమర్శిస్తే పసికందును విమర్శిస్తున్నారా? అని వాపోయారన్నారు. మరి బీఆరెస్ నేతలు 2 నెలలు కూడా ఎందుకు ఆగలేకపోతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండింటిని అమలు చేసిందన్నారు. మిగతా గ్యారంటీల అమలు కోసమే ‘ప్రజాపాలన’ నిర్వహించామని, దరఖాస్తుల పరిశీలన పూర్తి కాగానే మిగతావి అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చి తీరుతుందన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రేవంత్ రెడ్డి రెండు హామీలను నెరవేర్చారన్నారు. మహిళలకు ఫ్రీ బస్ సేవలు అమలు చేయడంతో వారి నుంచి అనూహ్య స్పందన వస్తుందని, రెండు హామీలను అమలు చేస్తేనే బీఆరెస్ నాయకులు భయపడుతున్నారన్నారు.
అప్పులు..అవినీతి..అక్రమాల మయం బీఆరెస్ పదేళ్ల పాలన
పదేళ్ల బీఆరెస్ పాలన అప్పులు, అవినీతి, అక్రమాలమయమని,, కాళేశ్వరంతో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులు పేరుతో కమిషన్ల కోసం ప్రజా ధనాన్ని దోచుకున్నారని, నిధులను దుర్వినియోగం చేశారని జూపల్లి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో వేల కోట్ల రూపాయాల ప్రజా ధనం నీళ్ల పాలు అయిందని కాగ్ నివేదికలే చెబుతున్నాయన్నారు. మిషన్ భగీరథ పథకంలో కూడా పెద్ద కుంభకోణం జరిగిందని, పదేండ్ల బీఆరెస్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపిస్తామన్నారు.
ప్రతీ పైసాకు వారు లెక్క చెప్పాల్సిందేనన్నారు. గత రెండేళ్లలో కృష్ణా బేసిన్లో నిండుగా నీరు ఉన్నప్పటికీ సాగుకు ఇవ్వలేదని, ఈ ఏడాది వర్షాలు లేక నాగార్జునసాగర్ లో జలాలు అడుగంటిపోయాయని, కృష్ణా బేసిన్లో నీరు లేనప్పుడు రెండో పంటకు ఇవ్వడం ఎలా సాధ్యమన్నారు. రాజకీయాల కోసం ప్రజలను సాగునీటి సమస్యలపై తప్పుదోవ పట్టించే స్థాయికి బీఆరెస్ దిగజారిందని విమర్శించారు.