Komati Reddy Venkat Reddy | రుణమాఫీ సంబరాల్లో మంత్రి కోమటిరెడ్డి హంగామా… నల్లగొండలో ట్రాక్టర్ నడుపుతు భారీ ర్యాలీ
రైతు రుణమాఫీపై జిల్లా కేంద్రాలు, నియోజకవర్గం, మండల కేంద్రాల్లో గువారం కాంగ్రెస్ శ్రేణులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సంబరాలు నిర్వహించారు. ఆలేరులో ఎమ్మెల్యే బీర్ల అయియ్య, భువనగిరిలో ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి రైతు రుణమాఫీ సంబరాలు నిర్వసించారు.

విధాత : రైతు రుణమాఫీపై జిల్లా కేంద్రాలు, నియోజకవర్గం, మండల కేంద్రాల్లో గువారం కాంగ్రెస్ శ్రేణులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సంబరాలు నిర్వహించారు. ఆలేరులో ఎమ్మెల్యే బీర్ల అయియ్య, భువనగిరిలో ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి రైతు రుణమాఫీ సంబరాలు నిర్వసించారు. వలిగొండలో ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి సీఎం ఫెక్సీకి పాలాభిషేకం నిర్వహించారు. రైతు రుణమాఫీ సంబరాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన హంగామా ప్రత్యేకంగా నిలిచింది. నల్లగొండ జిల్లా కేంద్రంలో రైతు రుణమాఫీ సంబరాల సందర్భంగా గడియారం సెంటర్ నుంచి స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ భారీ ర్యాలీతో సాగి రుణమాఫీ కార్యక్రమం వద్ధకు చేరుకున్నారు. కార్యకర్తలు, రైతులతో నిర్వహించిన ర్యాలీ పట్టణ వాసులను ఆకట్టుకుంది. నల్లగొండ ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన రైతు రుణమాఫీ సంబరాల సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయం నుంచి రైతులతో మాట్లాడారు. రైతులు మాట్లాడుతున్న క్రమంలో మధ్యలో కోమటిరెడ్డి మైక్ అందుకుని రైతు రుణమాఫీని ప్రశంసిస్తూ, జిల్లా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలంటూ ఆగకుండా మాట్లాడారు. రైతులను మాట్లాడనివ్వమని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి సూచించగా ఆయన మాటలేవి వినిపించుకోకుండా వెంకట్‌రెడ్డి తన ప్రసంగం కొనసాగించడంతో వీడియో కాన్ఫెరెన్స్‌లో ఉన్న సీఎం, మంత్రులు పడిపడినవ్వుకున్నారు. వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రైతు రుణమాఫీ చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలని, ఈ రోజు నల్గొండ జిల్లాలో పండగ వాతావరణం ఉందని, రాష్ట్రంలో అత్యధికంగా నల్లగొండ జిల్లా రైతులే రైతు రుణమాఫీతో ఎక్కువ లబ్ధి పొందడం హర్షనీయమని చెప్పారు. రైతులంతా చాలా సంతోషంగా ఉన్నారన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ చెప్పిన మాటను నిజం చేసినందుకు ధన్యవాదాలన్నారు. రూ. 2 లక్షల రుణమాఫీ హామీ ఇచ్చినప్పుడు అనేకమంది సందేహాలు వ్యక్తం చేశారని.. కానీ మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని రైతుల గుండెల్లో నిలిచిపోయారని సీఎంను కొనియాడారు. మన ప్రభుత్వానికి రైతుల సహకారం ఉంటుందన్నారు. నల్గొండ నియోజకవర్గంలో 8,358 ఖాతాల ద్వారా 7,890 కుటుంబాలకు రుణమాఫీ జరిగిందని, ఇందుకోసం మన ప్రభుత్వం 46.16 కోట్ల రూపాయలు కేటాయించారని, నల్గొండ జిల్లాలో 83,121 ఖాతాల ద్వారా 78,757 కుటుంబాలు రుణమాఫీ పొందారని, ఇందుకోసం రూ. 481.63 కోట్ల రూపాయలు కేటాయించారని గుర్తు చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా లక్ష రూపాయల లోపు రుణాలు కలిగిన దాదాపు 11 కోట్ల కుటుంబాలకి 11.50 లక్షల ఖాతాల ద్వారా రూ.6,098 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసినందుకు ధన్యవాదాలన్నారు. మీ సహకారంతో ఇవ్వాల ఎస్ఎల్బీసీ సొరంగం, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు గ్రీన్ ఛానల్ లో పెట్టి ముందుకు తీసుకుపోయేందుకు సహకరించిన మీకు కృతజ్ఞతలన్నారు. మా జిల్లాకు రూ.481.63 కేటాయించినందుకు మా జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఆర్థిక మంత్రి భట్టికి ధన్యవాదాలు తెలిపారు.