ఖుల్లం ఖుల్లం.. సామాన్యుడు చెప్పిన సత్యాన్ని చెప్పిన కేటీఆర్

విధాత: రాష్ట్రంలో ఎన్నికలు సమీస్తుండటంతో రాజకీయ నాయకుల వ్యక్తిగత దూషణలతో రాజకీయ వాతావరణం వేడుక్కుతున్నది. మరీ ముఖ్యంగా ప్రతి పక్షాల ఆరోపణలు శ్రుతిమించుతున్నాయి. హద్దులు మీరి వ్యక్తిత్వ విమర్శలకు సైతం దిగజారుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లక్ష కోట్ల అవినీతి అని ఒకరు, బీఆర్‌ఎస్ బీజేపీకి బీ టీం అని మరొకరు, కుటుంబ పాలన అని ఇంకొకరు.. మరో పార్టీ ఇంకో అడుగు ముందుకేసి గెలిచేది మేమే డిసెంబర్ 9న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని ప్రకటనలు చేస్తున్నారు. పొద్దు లేస్తున్న టీవీలు, సామాజిక మాధ్యమాల వేదికగా హోరెత్తిస్తున్నారు.
అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమేనని, సామాన్యుడి మనసులో మాట మరోలా ఉందని మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన వికలాంగుల పెన్షన్ లబ్ధిదారుల కృతజ్ఞత సభలో కుండబద్ధలు కొట్టినట్లు విస్పష్టంగా చెప్పారు.
సిరిసిల్లలో శంకరయ్య అని ఓ పెద్ద మనిషి ఉంటడు. ఆయనను మొన్న అడిగిన.. ఎట్లున్నది సర్.. ఎలక్షన్లు వచ్చినవి కదా అని అడిగిన. ఆయన నవ్వుకుంటూ ఇట్ల చెప్పిండు. మీరు ఏం అనుకోరు కదా నేను చెప్తే అన్నడు.. నేనేం అనుకోననని చెప్పిన. సర్ నిజంగా చెప్తున్నా.. పైన కేసీఆర్ మంచిగనే ఉన్నడు.. కింద ప్రజలు మంచిగనే ఉన్నరు. ఆయనకు, వాళ్లకు లింకుంది. మధ్యల మీ తెల్ల అంగిలు వేసుకున్నోళ్లతోనే సమస్య ఉంది సర్ అని చెప్పిండు. రాజకీయ నాయకులతోనే, మధ్యల ఉన్నోళ్లతోనే సమస్య ఉంది సర్ అని చెప్పిండు.
అలుగుడు గులుగుడు ఏమన్న ఉంటే మీ దగ్గర్నే ఉన్నది తప్ప.. ప్రజల్లో ఏం లేదు సర్.. ప్రజలంతా మంచిగనే ఉన్నరు. ప్రజలు సుభిక్షంగా ఉన్నరు. రైతులు, మహిళలు, దివ్యాంగులు సంతోషంగా ఉన్నరు. కేసీఆర్ పరిపాలనలో అందరూ సంతోషంగా ఉన్నరు. ఏమన్న పంచాయితీ ఉంటే రాజకీయ నాయకుల్లోనే ఉంది. నాకు పదవి రాకపాయే అంటే, నాకు టికెట్ రాకపాయే అనే బాధ తప్ప వేరేది మాత్రం ఏం లేదు సర్ అని చెప్పిండు అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక కేటీఆర్ మాటలు విని.. పక్కనే ఉన్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నవ్వారు.
ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే.. రాజకీయాలు, ఎన్నికలు వస్తయ్ పోతయ్.. కానీ శతాబ్దానికి ఒకడు వస్తడు కేసీఆర్ లాంటి నాయకుడు. అలాంటి నాయకుడిని పొరపాటున కూడా వదులుకోవద్దు. మంచి చేసే ప్రభుత్వాన్ని పొగొట్టుకుంటే.. జేబులో ఉన్న కడక్ వంద రూపాయాల నోటును పారేసి, రోడ్డు మీదున్న చిల్లర ఏరుకునే బుద్ధి తక్కువ పని అయితది. జేబుల ఉన్న కడక్ వంద నోటును ఎవడైనా పారేసుకుంటారా..? కానీ కింద చిల్లర ఉందని ఏరుకుంటే ఏమైతది. ఇది, అది పోతది.. ఎటు కాకుండా నాశనమైతది అని కేటీఆర్ అన్నారు.