కాంగ్రెస్ తోనే దేశ అభివృద్ధి సాధ్యం: మంత్రి సీతక్క

కాంగ్రెస్ పార్టీతోనే ఈ దేశ అభివృద్ధి సాధ్యమని బీజేపీ పదేళ్ల పాలనతో మరోసారి రుజువైందని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క అన్నారు

కాంగ్రెస్ తోనే దేశ అభివృద్ధి సాధ్యం: మంత్రి సీతక్క
  • పదేళ్ల మోదీ పాలనతో తేటతెల్లం
  • మోడీ దేవుడి గుళ్లను నమ్ముకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్ముకుంది
  • బలరాం నాయక్‌ను గెలిపించాలి
  • రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క

విధాత, వరంగల్ ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీతోనే ఈ దేశ అభివృద్ధి సాధ్యమని బీజేపీ పదేళ్ల పాలనతో మరోసారి రుజువైందని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క అన్నారు. జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలు పేదల కోసం పొట్లాడే రాహుల్ గాంధీకి, బడా వ్యాపారులకు ప్రజా ధనాన్ని దోచిపెట్టే నరేంద్ర మోడీకి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా ఆమె అభివర్ణించారు. ములుగు జిల్లా కేంద్రంలో బిజెపి, బిఆర్ఎస్ పార్టీలకు చెందిన కాయిత మొగిలి,కాయిత రాజు, రానబోయిన నారాయణ స్వామి,మాజీ ఉప సర్పంచులు కాయిత రాజయ్య,వైనాల రమేష్,పులి భద్రయ్య చిలుక సురేష్ లతో పాటు 50 మంది మంగళవారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్ముకొని రాజకీయాలు చేస్తుంటే మోదీ మాత్రం దేవుళ్ళను గుడులను నమ్ముకుని ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్య క్తం చేశారు. లక్షల కోట్ల రూపాయలు పేదల దగ్గర పన్నుల పేరుతో వసూలు చేసి కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేసిన మోడీకి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ కావాల‌నుకుంటే యూపీఏ ప‌దేళ్ల కాలంలోనే ప్రధానమంత్రి అయ్యేవార‌ని, కానీ ఏనాడూ ఆయ‌న ప‌ద‌వి కోసం పాకులాడలేదని అన్నారు. ప్రజ‌ల‌ను ప్రేమించ‌డం, ప్రజ‌లంద‌రిని క‌లిపి ఉంచ‌డ‌మే ఆయ‌న లక్ష్యమన్నారు. కావున ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, యువకులు, విద్యార్థులు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్‌కు ఓటు వేసి రాహుల్ గాంధీకి తోడుగా పార్లమెంట్‌కు పంపాలని సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల, గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.