అంత పెద్ద ప్రాజెక్టులో నాసిర‌కం ప‌నులు ఏలా?

అంత పెద్ద ప్రాజెక్ట్‌లో నాసిర‌కం ప‌నులు ఎలా చేస్తార‌ని ఎల్ అండ్ టీ ప్ర‌తినిధుల‌పై సాగునీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు

అంత పెద్ద ప్రాజెక్టులో నాసిర‌కం ప‌నులు ఏలా?
  • ఎల్ అండ్ టీ ప్ర‌తినిధుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ మంత్రి ఉత్త‌మ్‌
  • స‌మ‌గ్ర నివేదిక ఇవ్వాల‌ని అధికారుల‌కు ఆదేశం

విధాత‌, హైద‌రాబాద్‌: అంత పెద్ద ప్రాజెక్ట్‌లో నాసిర‌కం ప‌నులు ఎలా చేస్తార‌ని ఎల్ అండ్ టీ ప్ర‌తినిధుల‌పై సాగునీటిపారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సోమ‌వారం స‌చివాల‌యంలో ఎల్ అండ్ టీ గ్రూప్ డైరెక్ట‌ర్ ఎస్వీ దేశాయ్‌తో పాటు సంస్థ ప్ర‌తినిధులు మంత్రి ఉత్త‌మ్ ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి వారితో స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశానికి సాగునీటి పారుద‌ల శాఖ అధికారులను కూడా పిలిపించారు. మేడిగ‌డ్డ బ్యారేజీ కుంగుబాటుపై సీరియ‌స్ అయ్యారు. ఇంత నాణ్యత లేకుండా ఎలా చేశార‌ని ఎల్ అండ్ టీ ప్ర‌తినిధుల‌ను మంత్రి ఉత్తమ్ నిలదీశారు. ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి మా ప్రమేయం లేదని తప్పించుకోవాలంటే ఊరుకోమని హెచ్చరించారు.


ప్రజా ధనాన్ని వృధా చేసి ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమైన ఎవ్వరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. ఈ ప్రాజెక్ట్ పై పూర్తి స్థాయి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అన్నారం, సిందిళ్ళ ప్రాజెక్టు ఏజెన్సీలను కూడా పిలిచి మాట్లాడాలని, తప్పు చేసిన వారు తపించుకోవాలని చూస్తే న్యాయ పరంగా, చట్ట పరంగా చర్యలు తప్పవని ఈ సంద‌ర్భంగా మంత్రి హెచ్చరించారు.

మేడిగ‌డ్డ బ్యారేజీ కుంగిన త‌రువాత అప్ప‌టి ప్ర‌భుత్వం ఇది చిన్న స‌మ‌స్య అని కొట్టి పారేసింది. ఎల్ అండ్ టీ సంస్థ కూడా దీనిని చాలా చిన్న స‌మ‌స్య‌గా పేర్కొని రిపేరు తామే చేసి పెడ‌తామ‌ని వెల్ల‌డించింది. అయితే వెయ్యేళ్ల కు పైగా ఉండే విధంగా అత్యంత నాణ్య‌త‌తో నిర్మించాల్సిన ప్రాజెక్ట్ నిర్మించిన మూడేళ్ల‌లోనే కుంగిపోవ‌డంపై యావ‌త్ స‌మాజమే విస్తుపోయింది. కొత్త‌గా ఏర్ప‌డిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం దీనిని సీరియ‌స్‌గా తీసుకున్న‌ది. అయితే తాజాగా ఎల్ అండ్ టీ సంస్థ తాము రిపేరు చే య‌మ‌ని, దీనికి అయ్యే ఖ‌ర్చును రాష్ట్ర ప్ర‌భుత్వం భ‌రించాల‌ని తెలిపింది.


దీంతో ఎ ల్ అండ్ టీపై స‌ర్కారు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. దీనిపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తుకు ఆదేశించింది. బాధ్యులు ఎంత‌టి వారినైనా వ‌దిలిపెట్టే స‌మ‌స్య లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ దిశ‌గా స‌ర్కారు వేగంగా అడుగులు వేస్తోంది. దీంతో తాజాగా త‌న‌ను క‌లిసిన‌ ఎల్ అండ్ ప్ర‌తినిధులకు కూడా మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు.