పులి బయటకొచ్చాకనే అసలు ఆట మొదలు: మాజీ మంత్రి మల్లారెడ్డి

అతి త్వరలో పులి(కేసీఆర్) బయటకు వస్తుందని..అసలు ఆట మొదలు పెడుతుందని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చాలకూర మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

పులి బయటకొచ్చాకనే అసలు ఆట మొదలు: మాజీ మంత్రి మల్లారెడ్డి

విధాత : అతి త్వరలో పులి(కేసీఆర్) బయటకు వస్తుందని..అసలు ఆట మొదలు పెడుతుందని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చాలకూర మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగిన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆరెస్‌ను 100మీటర్ల గొయ్యిలో పాతిపెడుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని, అసలు కాంగ్రెస్ పార్టీనే వాళ్లిచ్చిన హామీల కారణంగా ఇప్పటికే 1000మీటర్ల గొయ్యి లోపల ఉందని మల్లారెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉందని ఎద్దేవా చేశారు. మల్కాజ్‌గిరి బీఆరెస్‌ అడ్డా అన్నారు. మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో పార్టీ ఎమ్మెల్యేలను నేనే గెలిపించానన్నారు. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేలంతా తనతో పాటు అంతా యువకులేనన్నారు. ఎంపీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో బీఆరెస్ గెలవబోతుందన్నారు. తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అన్నారు. రాష్ట్రంలో మెజార్టీ సీట్లు బీఆరెస్ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. పదేళ్ల తర్వాత ప్రజలు ఒక చాన్స్ ఇచ్చినా కాంగ్రెస్ నేతలు నిలుపుకోలేకపోయారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మర్చిపోయి కాంగ్రెస్‌కు ఓటేశారని, కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో అలా జరుగబోదన్నారు.


కాంగ్రెస్ పార్టీ పనితీరు ఏంటో ప్రజలకు అప్పుడే తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు. జవహర్‌నగర్ కార్పోరేషన్ మేయర్‌పై అవిశ్వాసం నోటీసులపై స్పందించిన మంత్రి మల్లారెడ్డి అవిశ్వాస నోటీసుల కారణంగానే ప్రజాప్రతినిధులతో కలిసి దుబాయ్, గోవా వెళ్ళానని, వాళ్లని కూల్ చేస్తున్నానని, గోవాలో మూడు బీచ్‌లున్నాయని, కాశీలో ఏమున్నాయన్నారు. అవిశ్వాస తీర్మానం నోటీసులు కొత్త ఏమీ కాదని, సమస్యలు ఎక్కడైనా ఉంటాయన్నారు.