కాంగ్రెస్ గూటికి ఎమ్మెల్యే రేఖా నాయక్: రాహుల్ సమక్షంలో చేరిక

కాంగ్రెస్ గూటికి ఎమ్మెల్యే రేఖా నాయక్: రాహుల్ సమక్షంలో చేరిక

– ఖానాపూర్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమంటూ ప్రకటన

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ బీఆరెస్‌ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్‌ గూటికి చేరారు. శుక్రవారం రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. పదేళ్లుగా గులాబీ పార్టీలో రేఖానాయక్‌ కొనసాగారు.

పార్టీ, ప్రభుత్వంలోనూ పలు పదవులు అనుభవించారు. ఆపార్టీ తరుపున రేఖా నాయక్ ఖానాపూర్ ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలుపొందారు. తాజా ఎన్నికల్లో మూడోసారి ఆమెకు కేసీఆర్‌ టికెట్‌ నిరాకరించారు. ఆమె స్థానంలో మంత్రి కేటీఆర్ స్నేహితుడైన జాన్సన్ నాయక్ ను అభ్యర్థిగా తొలిజాబితాలోనే ప్రకటించారు.

అప్పటి నుంచి అసంతృప్తితో రగిలిపోయిన ఆమె, పలు సందర్బాల్లో బీఆరెస్‌, సీఎం కేసీఆర్‌ పై నేరుగా విమర్శనాస్త్రాలు సంధించారు.

ఈ క్రమంలో ఆమె భర్త కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలతో ములాఖత్‌ కావడాన్ని బీఆరెస్‌ అధిష్టానానికి మింగుడు పడలేదు. తదనంతర పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ టికెట్ రేఖా నాయక్ కే వస్తుందని నియోజకవర్గంలో ప్రచారం కొనసాగుతుంది. రాహుల్ గాంధీ తెలంగాణ విజయభేరి యాత్రలో భాగంగా ఆర్మూర్ కాంగ్రెస్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో కారు దిగి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జాన్సన్ నాయక్ ను ఓడించి ఖానాపూర్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి తన సత్తా ఏమిటో చూపిస్తానని రేఖ నాయక్ పేర్కొన్నారు.