ఈ ఎన్నికలు రాహుల్ గాంధీ వర్సెస్ రైతన్న: ఎమ్మెల్సీ కవిత

ఈ ఎన్నికలు రాహుల్ గాంధీ వర్సెస్ రైతన్న: ఎమ్మెల్సీ కవిత
  • నాలుగు ఓట్ల కోసం ప్రజల కడుపు కొడతారా?
  • నీచమైన దుర్మార్గానికి తెరలేపిన కాంగ్రెస్
  • ఈసీకి రైతు బంధు ఫిర్యాదుపై ఎమ్మెల్సీ కవిత ఫైర్


విధాత ప్రతినిధి, నిజామాబాద్: ‘రైతన్నలకు రైతుబంధు మాత్రమే ఆపాలా? నాలుగు ఓట్ల కోసం ప్రజల కడుపు కొడతారా? కాంగ్రెస్ పార్టీ నీచమైన దుర్మార్గానికి తెరలేపింది. ఈ ఎన్నికలు రాహుల్ గాంధీ వర్సెస్ రైతన్నకు మధ్య జరుగుతున్నాయి’ అని బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం కవిత మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. రైతు బంధుపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేయడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.


పేదింటికి రేషన్ బియ్యం, ముసలవ్వలకు ఆసరా పెన్షన్, అక్కలకు బీడీ పెన్షన్, ఇంటింటికి మిషన్ భగీరథ తాగునీరు, ఇండ్లకి, పరిశ్రమలకు 24 గంటల కరెంటు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి… ఇలా అన్నీ ఎన్నికల కోడ్ పేరు చెప్పి ఆపే కుట్రను కూడా కాంగ్రెస్ చేస్తుందా? రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని ఆమె ప్రశ్నించారు. నాలుగు ఓట్ల కోసం ప్రజల కడుపు కొట్టె నీచమైన దుర్మార్గానికి కాంగ్రెస్ తెరలేపిందన్నారు.


బీఆర్ఎస్ రాజకీయ సుస్థిరత సాధించిందని, రాజకీయ సుస్థిరత లోపిస్తే మన అవకాశాలు ఎత్తుకుపోయే అవకాశం ఉంటుందన్నారు. బెంగుళూరులోని ఐటీని క్రాస్ చేస్తూ తెలంగాణకు ఐటీ హబ్ లు వచ్చాయి, ఇండస్ట్రియల్ జోన్స్ కూడా వస్తాయని తెలిపారు. తెలంగాణను పట్టణీకరణ చేస్తున్నాం, కాంగ్రెస్ ఆరోపణలు చూస్తే వాళ్ళ అభద్రతా భావం కనిపిస్తున్నదని, సంక్షేమ పథకాలు ఆపే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఆఫీసర్లను మార్చాలని, రైతు బంధు, దళిత బంధు ఆపాలని కాంగ్రెస్ అంటుందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాతనే కరెంట్ వచ్చింది కదా అని, బీజేపీ లాగ పేర్లు మార్చి పథకాలు పెట్టడం లేదన్నారు.


యూపీఎస్సీ తరహా జాబ్ క్యాలెండర్ అనే కాంగ్రెస్ హామీ… ఎన్నికల హామీ మాత్రమే కాకపోతే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. గాంధీలకే గ్యారంటీ లేదు, అధ్యక్షుడు లేకుండా హామీ ఇస్తారు… అవి ఎలా నమ్మాలంటూ ప్రశ్నించారు. బీసీలకు అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ అని, 2010లో ప్రవేశపెట్టిన మహిళా బిల్లులో బీసీలను చేర్చకుండా అన్యాయం చేసింది అంటూ విమర్శించారు. అరవింద్ ను కోరుట్లలో ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ కామారెడ్డికి వచ్చిన, ఈటల గజ్వేల్ లో పోటీ చేసిన బీఆరెస్ కు వచ్చిన నష్టం ఏమీ లేదని కవిత అన్నారు.