Khairatabad Mahaganapati | ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహ నమూనా విడుదల
వినాయక నవరాత్రి ఉత్సవాల కోసం ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నమూనాను ఉత్సవ నిర్వాహకులు విడుదల చేశారు

ఈ ఏడాది 70అడుగుల శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి
విధాత, హైదరాబాద్: వినాయక నవరాత్రి ఉత్సవాల కోసం ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నమూనాను ఉత్సవ నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ఏడాదితో ఖైరతాబాద్ గణపతి నవరాత్రోత్సవాలకు 70వ వార్షికోత్సవం పురస్కరించుకుని 70 అడుగులు ఎత్తులో, 28అడుగుల వెడల్పులో శ్రీ సప్తముఖ మహా శక్తి గణపతిగా ఖైరతాబాద్ గణేషుడు భక్తులకు దర్శనమివ్వనున్నారు .నిల్చున్న అకృతిలో ఉండి గణపతి తలకు ఇరువైపులా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, మహంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలు, రెండు వైపులా 14 చేతులు, కుడివైపు చేతుల్లో చక్రం, అంకుశం, పుస్తకం, త్రిశూలం, కమలం, శంఖం, ఎడమ వైపు రుద్రాక్ష, ఆసనం, పుస్తకం, వీణ, కమలం, గద ఉంటాయి. మహాగణపతి పక్కన కుడివైపు పది అడుగుల ఎత్తులో ప్రత్యేకంగా బాల రాముడి విగ్రహం, ఎడమవైపు రాహుకేతువుల విగ్రహాలను 9 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయనున్నారు. వినాయకుడి పాదాల చెంత 3 అడుగుల మేర మూషిక వాహనం ఉంటుంది. మహాగణపతి కుడివైపు 14 అడుగుల ఎత్తులో శ్రీనివాస కల్యాణం, ఎడమవైపు శివపార్వతుల కల్యాణం విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తెలిపారు.