పురుగుల మందు డబ్బాతో మోత్కుపల్లి హల్‌చల్‌

పురుగుల మందు డబ్బాతో మోత్కుపల్లి హల్‌చల్‌
  • దళిత బంధు అమలు తీరుపై నిరసన
  • బాబును చంపేందుకు మూడు పార్టీల కుట్ర
  • సెటిలర్ల దూరంతో బీఆరెస్‌కు 30సీట్లలో ఓటమి
  • వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే


విధాత : మాజీ మంత్రి, బీఆరెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు శనివారం ట్యాంకు బండ్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద మీడియా ముందు పురుగుల మందు డబ్బా చేతిలో పట్టుకుని హల్ చల్ చేశారు. దళిత బంధు పథకం సక్రమంగా అమలు కావడం లేదని, అవినీతి కారణంగా దళితులకు పథకం డబ్బులు అందడం లేదని మోత్కుపల్లి ఈ సందర్భంగా ఆరోపించారు. ‘దళితబంధు అమలు కాకుంటే చస్తానని గతంలో చెప్పాను. దళితబంధు అమలు కావటం లేదు… నన్ను చనిపోమని దళిత యువత నాకు మెసేజ్‌లు చేస్తున్నారన్నారు.


యాదగిరిగుట్ట దగ్గర చెప్పిన మాటను నిలబెట్టుకోమని దళిత యువత కోరుతోందన్నారు. కేసీఆర్ ముహూర్తం పెడితే గడ్డి మందు తాగి చనిపోతానని, దళితులకు అన్యాయం జరిగితే గడ్డి మందు తాగి చచ్చిపోతానన్నారు. కేసీఆర్ గట్టిగా ఉన్నాడని, ఆయన ఎలాగూ చావడని, నేనైనా చచ్చిపోతానంటూ వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల నాయకులు దళిత బంధు పథకంలో సగానికిపైగా తినేస్తున్నారని ఆరోపించారు. స్వయంగా సీఎం కేసీఆర్ దళిత బంధు పథకంలో అవినీతిపై ఎమ్మెల్యేలకు హెచ్చరికలు చేశారని, అయితే టికెట్లు మాత్రం అటువంటి వారికే ఇచ్చారన్నారు.


పథకాన్ని సక్రమంగా అమలు చేస్తే దళిత జాతి బాగుపడుతుందన్న ఆశలకు అవినీతి గండి కొట్టిందన్నారు. అలాగే దళిత బంధు పథకం ఎన్నికల పథకంగానే మారిపోయిందని ఆవేధన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ను సమర్థించి తప్పుచేశానని మోత్కుపల్లి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. మా ఇద్దరకీ మాటలు లేకున్నా.. దళితబంధు పెడ్తున్నాను రావాలని స్వయంగా కేసీఆర్ పిలిస్తే వెళ్లాను. దళితబంధుతో దళిత జాతికి మేలు జరుగుతోందని కేసీఆర్‌ను సమర్థించాను. మాదిగ కులానికి కేసీఆర్ మంత్రి పదవి కూడా ఇవ్వలేదు.’’ అని మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు.


మోసాలకు కేరాఫ్ అడ్రస్ సీఎం కేసీఆర్ అంటూ విమర్శించారు. అంతకుముందు ఆయన ఎన్టీఆర్ ఘాట్ వద్ధ తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును చంపేందుకు వైసీపీ, బీఆరెస్‌, బీజేపీలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. చంద్రబాబును జైల్లో హింసించి బాధపెడుతున్నారని, ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీసి చంపాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.


బాబుకు ఏమైనా అయితే అందుకు జగన్‌, కేసీఆర్‌, బీజేపీలే బాధ్యత వహించాలన్నారు. బాబుకు బెయిల్ రాకుండా జగన్ అడ్డుకుంటున్నారని, మళ్లీ జగన్ డబ్బులు పంచి గెలువాలని చూస్తున్నారని, రాజధాని లేకుండా పాలన సాగిస్తున్న ఏకైక సీఎం జగన్ అంటూ దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో ఏపీలో జగన్‌కు డిపాజిట్లు కూడా రావని, చంద్రబాబు అరెస్ట్‌తో కేసీఆర్‌పై సెటిలర్లు రగిలిపోతున్నారని, చంద్రబాబుపై జరుగుతోన్న కుట్రకు నిరసనగా దసరా పండగకు జరుపుకోకూడదని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.


తెలంగాణ గ్రూప్ 2 విద్యార్థిని ప్రవళిక ఆత్మహత్యకు కేసీఆరే ప్రభుత్వమే కారణమన్నారు. తెలంగాణలో ఇప్పటికే బీఆరెస్ ఓడిపోయిందని, చంద్రబాబు అరెస్ట్‌తో గ్రేటర్ చుట్టూ బీఆరెస్‌ 30 సీట్లు కోల్పోనుందన్నారు. సోనియా తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ నష్టపోయిందని, కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని మోత్కుపల్లి కోరారు. ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారన్నారు.


కానీ సీనియర్లు కలిసి పనిచేయకుంటే నష్టం తప్పదన్నారు. రేవంత్ రెడ్డి అందరి ఇళ్ళకు పోతున్నాడని, దళితుడైన నా ఇంటికి మాత్రం రావటం లేదన్నారు. దళితుల ఓట్లు పడకపోతే ఏ పార్టీ అధికారంలోకి రాదన్నారు. తుంగతుర్తి సీటు నాకివ్వపోతే కాంగ్రెస్‌కు నష్టమేనన్నారు. బలహీన అభ్యర్థిని పెడితే సీటు బీఆరెస్‌ గెలుచుకుపోతుందని, నేను మద్దతు ఇస్తానంటే కాంగ్రెస్ పెద్దలు తీసుకోవటం లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ మాత్రమే బీఆరెస్‌ను ఓడించగలదని ప్రజలు నమ్ముతున్నారన్నారు.