తెలంగాణకు ఎవరేం ఇచ్చారో తేల్చుకుందామా?: కేటీఆర్ కు ఎంపీ బండి సంజయ్ సవాల్

తెలంగాణకు ఎవరేం ఇచ్చారో తేల్చుకుందామా?: కేటీఆర్ కు ఎంపీ బండి సంజయ్ సవాల్
  • భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద బహిరంగ చర్చకు సిద్ధమా?
  • కేటీఆర్ కు ఎంపీ బండి సంజయ్ కుమార్ సవాల్

విధాత బ్యూరో, కరీంనగర్: ‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణకు ఎందుకు రాకూడదు? కేంద్రం 9 ఏళ్లలో రూ.9 లక్షల కోట్లు ఇచ్చింది. మరి బీఆరెస్ ప్రభుత్వం ఏం చేసింది? ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు? అంతెందుకు? తెలంగాణకు ఎవరేం చేశారో బహిరంగ చర్చకు సిద్ధమా? డేట్, టైం ఫిక్స్ చేయండి. పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారి వద్దకు కిషన్ రెడ్డిని ఒప్పించి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా… నువ్వో లేక మీ అయ్యో బహిరంగ చర్చకు సిద్ధమా? ఇదే ఎన్నికల రెఫరెండంగా తీసుకుందాం.


నిజంగా కేసీఆర్ కొడుకువే అయితే.. నీలో తెలంగాణ రక్తమే ప్రవహిస్తే నా సవాల్ ను స్వీకరించాలి’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు. బుధవారం ఆయన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ లోని కోతిరాంపూర్ చౌరస్తా వద్ద విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బాపూజీ సేవలను స్మరించుకున్నారు.


అదే సమయంలో కేసీఆర్, కేటీఆర్లపై నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని 6 లక్షల కోట్ల రూపాయల అప్పులపాలు చేసిన కేసీఆర్.. ఇచ్చిన హామీలెందుకు నెరవేర్చలేదని నిలదీశారు. పాలమూరును దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించి వంచించిన మూర్ఖుడు అంటూ దుయ్యబట్టారు. క్రిష్ణా నది ద్వారా తెలంగాణకు 575 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉంటే…. అప్పటి ఏపీ ముఖ్యమంత్రితో కుమ్మక్కై 299 టీఎంసీలకు అంగీకరిస్తూ సంతకం చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు.


‘పాలమూరు ప్రాజెక్టు కోసం డీపీఆర్ ఇవ్వకుండా జాతీయ హోదా ఎట్లా సాధ్యం? ఈ ప్రాజెక్టుకు ఒక్క మోటార్ ప్రారంభించి, 10 లక్షల ఎకరాలకు నీళ్లిస్తారట… అంతటి అద్బుతాలు సృష్టించడానికే కేసీఆర్ పుట్టినట్టుంది.. నేను సవాల్ చేస్తున్నా… తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చిందో చర్చకు సిద్ధం.


మరి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలెన్ని? ఎన్ని అమలు చేసినవ్? రాష్ట్రాన్ని 6 లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్పగా ఎందుకు మార్చినవ్. కుల వృత్తులతో సహా అన్ని వర్గాలను ఎందుకు మోసం చేసినవో బహిరంగంగా చర్చించేందుకు సిద్ధమా? నువ్వు నిజంగా కేసీఆర్ కొడుకువైతే… నీలో తెలంగాణ రక్తమే ప్రవహిస్తే భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్దకు వచ్చి చర్చించేందుకు సిద్దమా? అని సవాల్ విసిరారు.