మీ ఆడబిడ్డకు ఒక్క అవకాశమివ్వండి: కంకణాల నివేదితారెడ్డి
సాగర్ ఆడబిడ్డగా ఒక్క అవకాశమివ్వాలని నాగార్జున సాగర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంకణాల నివేదితారెడ్డి కోరారు.

విధాత: సాగర్ ఆడబిడ్డగా ఒక్క అవకాశమివ్వాలని నాగార్జున సాగర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంకణాల నివేదితారెడ్డి కోరారు. ఆదివారం బీజేపీ వెల్లడించిన తొలి జాబితాలోనే ఆమె టికెట్ పొందారు. ఆపార్టీ అధిష్టానం తెలంగాణ వ్యాప్తంగా తాజా జాబితాలో మహిళలకు 12 సీట్లు కేటాయించింది.అందులో నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి కంకణాల నివేదితా రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఆరెస్సెస్ సభ్యురాలైన నివేదితను సేవాభావం గుర్తించిన అధిష్టానం ప్రత్యక్ష రాజకీయాల వైపు మళ్లించింది.
ఈ క్రమంలో 2014 నుంచి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేస్తూ, నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నారు. ప్రజలకు ఏదైనా సమస్య వచ్చిందంటే వెంటనే అక్కడికి వెళ్లి తనవంతు సాయం చేస్తోంది. పార్టీ పట్ల అంకితభావంతో ఉంటూ బీజేపీని అన్ని గ్రామాల్లో బలోపేతం చేసేందుకు కృషి చేశారు. ఈ నేపథ్యంలోనే స్పిన్నింగ్ ఫ్యాక్టరీని నిర్మించి, దాదాపు వెయ్యి మందికి పైగా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మహిళలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ చేయూతనిస్తోంది. నియోజకవర్గంలో ఎవరైనా పేదవారు చనిపోతే అక్కడ ఇంటి ఆడపడుచుగా చేయాల్సిన పనులు అన్నీ తానై నిర్వహిస్తూ, వచ్చిన బంధువులకు భోజనాలు ఏర్పాటు చేస్తోంది.
అలాగే వారి కుటుంబాలకు ఆర్థిక సాయం కూడా చేస్తోంది. గతంలో నాగార్జున సాగర్‌లో బీజేపీ ప్రభావం ఏమాత్రం లేకపోయినా, తను నియోజకవర్గ ఇంచార్జిగా బాధ్యతలు తీసుకున్నాక బీజేపీని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లారు. 2018 ఎన్నికల్లో రాజకీయ సమీకరణల మూలంగా అధిష్టానం టికెట్ ఆమెకు కేటాయించకుండా, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ రవి నాయక్‌కు కేటాయించింది. ఆ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవ్వగా, ఈసారి నివేదితకే అవకాశం ఇచ్చింది. ఇన్నాళ్లుగా కాంగ్రెస్, బీఆరెస్ పాలనలో నాగార్జున సాగర్‌కు జరిగిన అభివృద్ధి శూన్యమని, ఈసారి ఖచ్చితంగా ప్రజలు బీజేపీని గెలిపించడం ఖాయమంటున్నారు. దాదాపు 30 ఏళ్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ నేత జానారెడ్డి ప్రజలకు చేసిందేం లేదన్నారు.
అలాగే గత 2018లో గెలిచిన నోముల నర్సింహయ్య, ఆ తరువాత ఉప ఎన్నికల్లో గెలిచిన తన కుమారుడు భగత్ కూడా అభివృద్ధి చేయక పోగా, ప్రజలను లూటీ చేసిందే ఎక్కువని విమర్శించారు. గత పాలకులు ప్రజలకు ఏం చేయకపోగా, ఇప్పడు వారి వారసులను కూడా పదవుల్లోకి తీసుకురావాలని తాపత్రయపడుతున్నారని మండిపడ్డారు. ఇక్కడ ఇన్నాళ్లు పాలించిన వారు తమ సొంత ప్రయోజనాలకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రజలకు ఏనాడు ఇవ్వలేదన్నారు.
తాజాగా ప్రజలతో సంబంధం లేకుండా నియోజకవర్గంలో సమస్యలపై ఏమాత్రం అవగాహన లేకుండా తమ తండ్రుల పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వస్తున్న నాయకులను నమ్మవద్దన్నారు. నిత్యం జనాల్లో ఉంటున్న తనకు ఒక్క అవకాశమిచ్చి గెలిపించాలన్నారు. తనను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానంటున్నారు. అలాగే నాగార్జున సాగర్ పర్యాటక కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెండుగా కల్పిస్తానన్నారు.