త్వరలో కాంగ్రెస్ లోకి బండారు.. రహస్యంగా కోమటిరెడ్డి వర్గం మంతనాలు?

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: నల్గొండ జిల్లాలో రాజకీయాలు రోజురోజుకూ కొత్త రంగులు పులుముకుంటున్నాయి. పార్టీల్లో మార్పులు, చేర్పులతో పాటు రాజకీయ వలసలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా నల్గొండ నియోజకవర్గంలో ఇప్పటికే అధికార బీఆర్ఎస్ నుంచి పెద్దఎత్తున కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక ఎమ్మెల్యేపై ఉన్న అసంతృప్తితో పార్టీలోనే కేడర్ అంతా బీఆరెస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారు.
ఇదే క్రమంలో బీజేపీకి చెందిన మాజీ పట్టణ అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ నాగేశ్వరరావు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటు మరికొంతమంది కౌన్సిలర్లకు బీజేపీ నేతలు గాలం వేస్తున్నారు. తాజాగా నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే కోమటిరెడ్డి వర్గంతో టచ్ లోకి వెళ్లిన ఆయన రహస్యంగా మంతనాలు చేస్తున్నట్లు తెలిసింది.
కోమటిరెడ్డికి నమ్మిన బంటుగా ముద్ర
భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకునిగా, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా ఉన్న బండారు ప్రసాద్ మొదటి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నమ్మిన బంటుగా ఆయనకు ముద్రపడింది. పార్టీలు వేరైనప్పటికీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట బండారు ప్రసాద్ జవదాటడనే ప్రచారమూ ఉంది. గత మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా మద్దతు ఇచ్చినట్లు అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పార్టీ ఫిరాయింపులు జోరందుకున్నాయి.
ఇందులో భాగంగానే బండారు ప్రసాద్ తో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు మంతనాలు జరిపినట్లు ప్రచారం సాగుతోంది. ఒకటి, రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేందుకు బండారు ప్రసాద్ సిద్ధమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. బండారు ప్రసాద్ బీజేపీని వీడితే ఆపార్టీలో ఉన్న అనేకమంది కార్యకర్తలు, నాయకులు కూడా ఆ పార్టీకి దూరమవ్వనున్నారు.