తెలంగాణలో నూతన రాజకీయ సమీకరణలు
తెరపైకి మరో ప్రాంతీయ పార్టీకేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ ఒక్కతాటిపైకి ?అవమానించబడ్డవారు, అవకాశాలు రానివారూ కూటమికేంద్రబిందువుగా మారిన ఈటెల రాజేందర్ హైదరాబాద్, వివిధ ప్రతినిధి: తెలంగాణలో రాజకీయ శక్తుల పునరేకీకరణకు రంగం సిద్ధం అవుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వ్యతిరేకిస్తున్న శక్తులందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయని రాజకీయ పరిశీలకుడొకరు చెప్పారు. టీఆరెస్ రెండోసారి అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్నాయి. జమిలి ఎన్నికల వంటి ప్రయోగాలేవీ చేయకపోతే 2023 డిసెంబరులో అసెంబ్లీకి తదుపరి ఎన్నికలు జరుగుతాయి. అంటే 2023 […]

తెరపైకి మరో ప్రాంతీయ పార్టీ
కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ ఒక్కతాటిపైకి ?
అవమానించబడ్డవారు, అవకాశాలు రానివారూ కూటమి
కేంద్రబిందువుగా మారిన ఈటెల రాజేందర్
హైదరాబాద్, వివిధ ప్రతినిధి: తెలంగాణలో రాజకీయ శక్తుల పునరేకీకరణకు రంగం సిద్ధం అవుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వ్యతిరేకిస్తున్న శక్తులందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయని రాజకీయ పరిశీలకుడొకరు చెప్పారు. టీఆరెస్ రెండోసారి అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్నాయి. జమిలి ఎన్నికల వంటి ప్రయోగాలేవీ చేయకపోతే 2023 డిసెంబరులో అసెంబ్లీకి తదుపరి ఎన్నికలు జరుగుతాయి. అంటే 2023 అంతా ఎన్నికల సంవత్సరమే. ఇక మిగిలింది 19 మాసాల కాలమే. ఈ వ్యవధిలోనే రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తులు పురుడు పోసుకునే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది.
కేంద్ర బిందువుగా మాజీ మంత్రి ఈటెల
తెలంగాణ మంత్రివర్గం నుంచి తొలగించబడిన ఈటెల రాజేందర్ ఈ రాజకీయ పునరేకీకరణకు కేంద్రబిందువుగా వ్యవహరిస్తారని కేసీఆర్ వ్యతిరేక వర్గాలు చెబుతున్నారు. వేర్వేరు సందర్భాలలో కేసీఆర్ చేత అవమానించబడి వివిధ పార్టీలలోకి వెళ్లపోయినవారంతా ఇప్పుడు ఈ పునరేకీకరణవైపు చూస్తున్నారని ఆ వర్గాలు తెలిపాయి. వీరిలో చాలా మంది బీజేపీలో ఉన్నారు. మాజీ ఎంపీలు వివేక్, జితేందర్‌రెడ్డిలు కూడా కేసీఆర్‌పై బాగా కోపంతో ఉన్నారు. చివరి నిమిషందాకా టికెట్ ఇస్తామని నమ్మించి మోసపూరితంగా టికెట్ నిరాకరించారని వారు ఆగ్రహంతో ఉన్నారు. కేసీఆర్ బీజేపీకి దగ్గరయితే వీరు కొత్త రాజకీయ సమీకరణాలవైపు చూడడానికి వెనుకాడరని వారి సన్నిహితులు చెబుతున్నారు. నాగం జనార్దన్‌రెడ్డి, డికె అరుణ వంటివారు కూడా కేసీఆర్ ఎదిరించే బలమైన శక్తికోసమే బీజేపీలో చేరారు. బీజేపీ టీఆరెస్ ఒక్కటైతే వారు కూడా ఆ పార్టీలో ఉండలేరని తెలుస్తున్నది. వీరే కాక కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, తీన్మార్ మల్లన్న, తెలంగాణ జనసమితి, యువ తెలంగాణ పార్టీ, చెరుకు సుధాకర్‌లతోపాటు ముందు నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉండి వివిధ కారణాలచేత తెరవెనుకకు వెళ్లిపోయినవారంతా ఏకమవుతారని ఆ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఒక బలమైన ప్రాంతీయ పార్టీ ఏర్పడాల్సిన అవసరం ఉందని వీరందరూ ఏకీభావంతో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఢీకొనడానికి ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని కూడా ఆ వర్గాలు భావిస్తున్నాయి. కొత్త ప్రాంతీయ పార్టీ, కాంగ్రెస్, వామపక్షాలు, బీఎస్‌పీ వంటి రాజకీయ శక్తులన్నీ ఏకమైతే కేసీఆర్‌ను ఎదుర్కోవడం తేలిక అని ఆ వర్గాలు గణాంకాలతో సహా వివరిస్తున్నాయి.
కేసీఆర్ 2018 ఎన్నికల తర్వాత
కేసీఆర్ 2018 ఎన్నికల తర్వాత చాలా చెడ్డపేరు సంపాదించుకున్నారని, వచ్చే ఎన్నికల్లో అనేక సామాజిక వర్గాలు ఆయనకు వ్యతిరేకంగా ఒక్కటయ్యే అవకాశాలు ఉన్నాయని ఆ వర్గాలు చెబుతున్నాయి. సింగరేణి కార్మికులు గత ఎన్నికల్లోనే టీఆరెస్‌ను ఘోరంగా ఓడించారు. ఆసిఫాబాద్, మంచిర్యాల, రామగుండం, మంథని, భూపాలపల్లి, ములుగు, ఇల్లందు నుంచి కొత్తగూడెం, సత్తుపల్లిదాకా ప్రతిపక్ష అభ్యర్థులే గెలిచారు. ఈ సారి కూడా పరిస్థితుల్లో మార్పు ఉండబోదని చెబుతున్నారు.
మున్నూరు, ముదిరాజ్, రెడ్డి కులాల సమీకరణ
గత రెండళ్లలో ప్రభుత్వోద్యోగులు, టీచర్లు, ఆర్టీసీ కార్మికులు, యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు… ఇలా అనేక వర్గాలను ప్రభుత్వం వివిధ కారణాలతో దూరం చేసుకుంది. సామాజికంగా కూడా టీఆరెస్ ప్రభుత్వం మున్నూరు కాపులను, ముదిరాజ్‌లను రాజకీయంగా దెబ్బతీసిందన్న ప్రచారం జరుగుతున్నది. రెడ్డి సామాజిక వర్గానికి వ్యతిరేకంగా టీవీలలో చర్చపెట్టించడం, రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారి కాలేజీలు మూతవేయిండం, తెలంగాణ కంట్రాక్టర్‌లకు ఒక్కరికి కూడా ప్రాజెక్టుల పనులు ఇవ్వకపోవడం, తెలంగాణ ప్రాంత సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఏ పనీ ఇవ్వకుండా మూలన కూర్చోబెట్టడం వంటి పరిణామాలు రెడ్డి సామాజికవర్గంలో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. తెలంగాణలో ఏడు శాతానికిపైగా ఉన్న రెడ్డి సామాజికవర్గాన్ని చిన్నబుచ్చేందుకే వారెంత? వారి బలమెంత? అని దేశపతి శ్రీనివాస్, వి.ప్రకాశ్ వంటి వ్యక్తులతో వి6 ఛానల్లో ఉపన్యాసం ఇప్పించారని అప్పట్లో దుమారం చెలరేగింది. తెలంగాణ సమాజంలో కేవలం 0.4 శాతం మంది మాత్రమే ఉన్న ఒక సామాజిక వర్గానికి అనుకూలంగా దేశపతి, ప్రకాశ్‌లు ఈ టీవీ చర్చా కార్యక్రమంలో మాట్లాడారని అప్పట్లో ఎన్ఆర్ఐ మేధావులు సామాజిక మాధ్యమాల్లో బాహాటంగానే విరుచుకుపడ్డారు.
మూడోసారి కేసీఆర్ పాచిక పారుతుందా?
గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లే టీఆరెస్‌కు పీక్. టీఆరెస్ నినాదాలు, కేసీఆర్ ఉపన్యాసాలు రెండూ కూడా మూడో ఎన్నికకు పెద్దగా ఉపయోగపడవని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మార్పు రావాలన్న భావన సమాజంలో బలంగా వినిపిస్తున్నదని వారు చెబుతున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధి విషయంలో చాలా పనులు జరిగినప్పటికీ ప్రభుత్వం, రాజకీయాలు నడుస్తున్నతీరు చాలా మందికి నచ్చడం లేదని వారు చెబుతున్నారు. ఈ పరిస్థితులన్నీ కలగలిపి కొత్త రాజకీయ శక్తుల ఆవిర్భావానికి పునాదులు వేసే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.