కుంటి, ముసలి గుర్రాలతో ఉపయోగం లేదు: మంత్రి జగదీశ్ రెడ్డి

- ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లంతు
- హుజూర్ నగర్ లో ఎన్నికల ప్రచారం షురూ
- ప్రారంభించిన మంత్రి జగదీశ్ రెడ్డి, అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి
విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: దశాబ్దాలుగా ఉమ్మడి నల్గొండ జిల్లాను సర్వనాశనం చేసిన కుంటి, ముసలి గుర్రాలతో ఎలాంటి ఉపయోగం లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. స్వల్ప కాలంలోనే నియోజకవర్గాల్లో వేలాది కోట్లతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఉమ్మడి జిల్లాలో రాబోయే శాసనసభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రచారాన్ని షురూ చేసింది.
సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం మండలం బుగ్గ మాదారం గ్రామంలో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయనున్న సిటింగ్ ఎమ్మెల్యే, బీఆరెస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక రామచంద్రస్వామి ఆలయంలో మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో ప్రత్యేక పూజలు చేసి, ప్రచార కార్యక్రమానికి తెరలేపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ చేయని అభివృద్ధిని, ఉమ్మడి నల్లగొండ జిల్లా లో తొమ్మిదేళ్ల కాలంలోనే కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని తెలిపారు. నాలుగేళ్లలో సైదిరెడ్డి రూ.3500 కోట్లు నిధులు తేవడం అంటే అది చరిత్రనే అన్నారు. హుజూర్నగర్ ను 20 ఏళ్లు ఏలిన కాంగ్రెస్ నాయకునితో జరిగిన అభివృద్ధి శూన్యం అన్నారు.
ప్రజల ఆశీర్వాదంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గులాబీ జెండాను మరోసారి ఎగరేస్తామన్నారు. గత పాలకులు తమ హయాంలో సాగర్ ఎడమ కాలువ సాగునీటి విషయంలో ఆంధ్ర పాలకులు చేస్తున్న అన్యాయాన్ని ఎండ కట్టడంలో పూర్తిగా విఫలమయ్యారని తెలిపారు. సాగర్ ఆయకట్టు చరిత్రలోనే వరుసగా పదారు పంటలకు నీరిచ్చిన ఘనత బీఆర్ఎస్ దే అన్నారు.
ప్రకృతి కనికరించకున్నా, పంటలను కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు కూడా సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేశామన్నారు. చనువు, చొరవ ఉన్న నాయకుడు కాబట్టే నియోజకవర్గంలో పుట్టిన బిడ్డగా ప్రజల రుణం తీర్చుకోవడానికి సైదిరెడ్డి అహర్నిశలు కష్టపడుతున్నారని తెలిపారు. యువకుడైన సైదిరెడ్డికి మరోసారి అండగా ఉండి, అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.