ఎన్‌ఎస్పీ స్థలాలు కృష్ణార్పణం

కృష్ణా నది తీరాన నాగార్జునసాగర్ నడిబొడ్డున ఎంతో విలువైన ఎన్‌ఎస్పీ స్థలాలను అధికారులు అప్పనంగా స్వచ్ఛంద, ధార్మిక సంస్థలకు కట్టబెడుతున్న తీరు వివాదస్పదమవుతుంది

ఎన్‌ఎస్పీ స్థలాలు కృష్ణార్పణం
  • అప్పనంగా స్థలాల కేటాయింపులు
  • పర్యాటక అభివృద్ధికి భూములేవి?

విధాత : కృష్ణా నది తీరాన నాగార్జునసాగర్ నడిబొడ్డున ఎంతో విలువైన ఎన్‌ఎస్పీ (నాగార్జున సాగర్ ప్రాజెక్టు) స్థలాలను అధికారులు అప్పనంగా స్వచ్ఛంద, ధార్మిక సంస్థలకు కట్టబెడుతున్న తీరు వివాదస్పదమవుతున్నది. నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని కృష్ణానది తీరాన నెహ్రూ పార్క్ ఎదురుగా ఉన్న విలువైన స్థలాన్ని రామచంద్ర మిషన్‌కు తాజాగా అప్పగించారు. ప్రభుత్వ నిర్ణయంతో ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా, బౌద్ధక్షేత్రంగా ఉన్న నాగార్జున సాగర్‌లో ప్రభుత్వ, అటవీ, ఎన్‌ఎస్పీ భూములను అడ్డగోలుగా కేటాయిస్తూ భవిష్యత్తులో పర్యాటక అభివృద్ధికి భూములు దొరకకుండా చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సాగర్‌లో ప్రముఖ ప్రాంతమైన విజయ విహార్‌ను ఆనుకొని ఉన్న విలువైన పది ఎకరాల భూమిలో గత కొన్ని సంవత్సరాల క్రితం గత ప్రభుత్వాలు కోటి రూపాయల ఖర్చుతో హిల్ కాలనీ వాసుల తాగునీటి సమస్యను పరిష్కరించడానికి ఫిల్టర్ హౌస్ నిర్మించారు. దానితోపాటు 20 లక్షల రూపాయల వ్యయంతో ఆ స్థలం చుట్టూ ప్రహరీ గోడను కూడా ఏర్పాటు చేశారు. ఫిల్టర్ హౌస్ నిర్మాణంలో ఇంజినీరింగ్ వైఫల్యాలు ఉన్నందున ఆ నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేశారు. సంబంధిత కాంట్రాక్టర్‌కు సైతం బిల్లులు చెల్లించకుండా నిలిపివేయడంతో నేటికీ ఆ విచారణ కొనసాగుతూనే ఉంది. ప్రధాన రహదారికి పక్కనే ఉన్న ఆ విలువైన స్థలంపై కొందరు రాజకీయ నాయకులు కన్నేసినప్పటికీ.. భవిష్యత్తులో సాగర్ వాసులకు, పర్యాటకులకు ఉపయోగపడే విధంగా నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరాల నేపథ్యంలో దాన్ని ఇంతకాలం అధికారులు కాపాడుతూ వచ్చారు. అదీగాక ఆ స్థలం కోర్టు కేసులో ఉందని అప్పట్లో సాగర్ డ్యాం ఉన్నత అధికారులు తేల్చి చెప్పడంతో ఆ విలువైన స్థలం అలాగే ఉండిపోయింది.



క్షేత్ర స్థాయి సర్వే లేకుండానే కేటాయింపు!

ప్రస్తుతం రామచంద్ర మిషన్ వారు తాము నాగార్జునసాగర్‌లో తమ మిషన్‌కు సంబంధించిన నిర్మాణాలు చేసుకుంటామని, స్థలం కావాలని ప్రభుత్వాన్ని కోరారు. వారికి కావలసిన స్థలం సాగర్‌లో కేటాయించటానికి సాధ్యాసాధ్యాలపై వివరణ ఇవ్వాలని నాగార్జున సాగర్ ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అయితే సాగర్ డ్యాం ఉన్నతాధికారులు రామచంద్ర మిషన్ నిర్వాహకులకు ఇవ్వవచ్చు అని లేఖ పూర్వకంగా తెలియజేశారు. ఎంతో విలువైన ఆ స్థలంలో ఐదు ఎకరాలను 10 సంవత్సరాలకు లీజుకు రామచంద్ర మిషన్‌కు నామమాత్రపు రేటుకు కేటాయించినట్లుగా తెలుస్తున్నది. ఇప్పుడు ఆ స్థలంలో ఆ సంస్థకు సంబంధించిన వారు భారీ యంత్రాలతో స్థలాన్ని చదును చేయడం ప్రారంభించారు. ప్రభుత్వ నిర్ణయంతో గతంలో ఫిల్టర్ హౌస్ నిర్మాణం చేపట్టి భవిష్యత్తులో స్థానిక ప్రజలకు, పర్యాటకులకు ఉపయోగపడే విలువైన భూమిని కోల్పోయినట్లేనన్న ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతున్నది. మిషన్‌కు కేటాయించిన స్థలం మొత్తం ఎంత ఉంది? ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఎంత స్థలం ఉందో సరిగ్గా క్షేత్ర స్థాయిలో సర్వేతో పరిశీలించకుండానే కేటాయించినట్లుగా విమర్శలు వస్తున్నాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని పలు ప్రాంతాలలో ప్రాజెక్టు భూములను స్వచ్ఛంద సంస్థలు, ధార్మిక సంస్థల పేరిట నామమాత్రం రేటుకు కట్టబెట్టడం సర్వసాధారణం అయిపోయింది. అదే పరంపరలో నాగార్జునసాగర్‌లో రామచంద్ర మిషన్ వారికి ఇవ్వటానికి వేరేచోట స్థలం ఉన్నా కూడా కృష్ణ నది తీరాన ఎంతో విలువైన స్థలాన్ని కేటాయించడంపై సాగర్ వాసులు అధికారులపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పటికే ఎన్‌ఎస్పీ క్వార్టర్స్ అన్ని క్రమబద్ధీకరణతో ప్రైవేటు పరమయ్యాయి.


స్థల కేటాయింపుపై అధికారుల దాటవేత

సాగర్ వాసుల తాగునీటి కష్టాలు తీర్చడం కోసం గత ప్రభుత్వాల హయాంలో అమృతపాణి పథకం కింద సుమారు 40 కోట్ల రూపాయలు కేటాయించి, దానికి సంబంధించిన నిర్మాణాలు చేపట్టడానికి ప్రతిపాదనలు చేయాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం రామచంద్ర మిషన్‌కు హిల్‌కాలనీ స్థలాన్ని రాజకీయ, అధికార ఒత్తిళ్ల కారణంగానే ఉన్నత అధికారులు సంబంధిత ధార్మిక సంస్థకు కేటాయించినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో నాగార్జునసాగర్ డ్యాం ఉన్నతాధికారులు సూపరింటెండెంట్ ఇంజినీర్ స్థాయి నుండి డీఈ స్థాయి వరకు ఒకరిపై మరొకరు చెబుతూ చేతులు దులుపుకొంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఉన్న నాగార్జున సాగర్‌లో ప్రభుత్వ భూములను ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలకు అప్పగించడం మాని, పర్యాటకులు, స్థానిక అవసరాలను తీర్చేలా, పర్యాటక రంగాన్ని ప్రొత్సహించేలా నిర్మాణాలు చేపట్టాలని స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు.