పరకాల సీటుపై కాంగ్రెస్‌లో పీఠముడి
పరకాల ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ పార్టీలో పీటముడి నెలకొంది. ఇప్పటికే ముగ్గురు పోటీ పడుతుండగా అదనంగా మాజీ ఎమ్మెల్యే రేవూరి వచ్చి చేరారు

– పోటీ పడుతున్న నలుగురు నేతలు
– రాహుల్ సమక్షంలో పార్టీలో చేరిన రేవూరి
– పరకాల టికెట్ పై హామీ ఇచ్చారంటూ ప్రచారం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పరకాల ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ పార్టీలో పీటముడి నెలకొంది. ఇప్పటికే ముగ్గురు పోటీ పడుతుండగా అదనంగా మాజీ ఎమ్మెల్యే రేవూరి వచ్చి చేరారు. పరకాల టికెట్ హామీ మేరకే ఆ పార్టీలో చేరుతున్నట్టు ఇప్పటికే ఆయన స్పష్టం చేశారు. ఈ దశలో టికెట్ ఎవరికి వస్తుందనేది కాంగ్రెస్ లో ఉత్కంఠ గా మారింది.
కాంగ్రెస్ లో రేవూరి చేరిక
బీజేపీ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. విజయభేరి యాత్రలో పాల్గొంటున్న రాహుల్ గాంధీ సమక్షంలో గురువారం భూపాలపల్లిలో రేవూరి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే గా ఉన్న రేవూరి ప్రకాశ్ రెడ్డి కొద్దికాలం క్రితం టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నర్సంపేట నుంచి పోటీ చేస్తారని అందరూ భావించారు. కానీ ఆపార్టీ అభ్యర్థులను రేపో మాపో ప్రకటిస్తారని భావిస్తున్న సమయంలో రేవూరి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో సమావేశమై పార్టీ మార్పుపై చర్చించారు. ఈ సమావేశంలో రేవంత్ తో పాటు కాంగ్రెస్ నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలోనే రేవూరి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు వార్తలు వెలుపడ్డాయి. రెండు రోజుల క్రితం రేవూరి మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తనకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు చెప్పారు. రేవూరి ములుగు సభలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని భావించినప్పటికీ గురువారం భూపాలపల్లి లో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో రేవూరి ప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్, టీడీపీ కూటమిలో భాగంగా వరంగల్ పశ్చిమ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈసారి పరకాల టికెట్ ఆశించడం విశేషం.
పరకాల సీటుపై పీఠముడి
పరకాల టికెట్ తనకు కేటాయిస్తారనే హామీ మేరకే కాంగ్రెస్ లో చేరుతున్నట్లు రేవూరి ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి పరకాల టికెట్ ఆశించే వారి సంఖ్య నాలుగు కు చేరింది. ఇప్పటికే ముగ్గురు పోటీ పడుతుండగా వారికి రేవూరి తోడై సంఖ్య నాలుగు చేరింది. వాస్తవానికి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత నియోజకవర్గ ఇన్చార్జి ఇనుగాల వెంకటరామిరెడ్డి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తరువాత 2018 ఎన్నికల్లో తాను నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నప్పటికీ వరంగల్ తూర్పును కాదని కొండా సురేఖ పరకాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత కూడా ఆమె పరకాలను పట్టించుకోలేదు. దీంతో తిరిగి పార్టీని ఇనుగాల తన భుజాలపై మోశారు. తనకే టికెట్ వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ఈ దశలో తనకు కూడా టికెట్ కేటాయించాలని సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి దరఖాస్తు చేసుకున్నారు. ఇద్దరి మధ్య పోటీ నడుస్తుండగా మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్ ఇటీవల కాంగ్రెస్ లో చేరారు.
ఆయన కూడా పరకాల టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ముగ్గురయ్యారు. తాజాగా తనకు టికెట్ కేటాయిస్తారనే హామీతోటే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు రేవూరి ప్రకటించడంతో ఇనుగాల వర్గం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇనగాలకు మద్దతుగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు అధిష్టానానికి విన్నవిస్తున్నారు. ఇనుగాలకు టికెట్ కేటాయించాలని కోరారు. ఈ స్థితిలో రేవూరి ముందుకు రావడంతో రానున్న రోజుల్లో పరకాల టికెట్ వ్యవహారం ఏమలుపు తీసుకుంటుందో అనే చర్చ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో సాగుతోంది. బలమైన హామీ లేకుండా రేవూరి చేరే అవకాశం లేదని ఆయన అనుచరులు చెబుతున్నారు.