ఎమ్మెల్యే సీతక్కకు సచివాలయం పోలీసుల ఝలక్.. లోపలికి నో ఎంట్రీ

ఎమ్మెల్యే సీతక్కకు సచివాలయం పోలీసుల ఝలక్.. లోపలికి నో ఎంట్రీ

విధాత, హైద్రాబాద్‌ : రాష్ట్ర సచివాలయం పోలీసుల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు చేదు అనుభవం ఎదురైంది. ముందస్తు అనుమతి లేకుండా సచివాలయం లోనికి అనుమతించేది లేదంటూ సీతక్క వాహనాన్ని మెయిన్ గేటు వద్దనే పోలీసులు నిలిపివేశారు.



సెట్ లో చెప్పించుకుంటేనే లోపలికి పంపుతామంటూ పోలీసులు ఆమె వాహనాన్ని అడ్డగించారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే సీతక్క అసహనం వ్యక్తం చేసి వారితో వాగ్వివాదానికి దిగింది. చివరకు వాహనాన్ని అక్కడే వదిలేసిన సీతక్క నడుచుకుంటూ సచివాలయంలోనికి వెళ్లింది.



ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఎమ్మెల్యేనైనా నాకు ముందస్తు అనుమతి ఎందుకని ప్రశ్నించింది. అధికారులు, సచివాలయం ఉన్నది ప్రజల కోసమేనన్నారు. ముందస్తు అనుమతి పేరుతో సచివాలయంలోకి ప్రజలను, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, నాయకులను రాకుండా అడ్డుకోవడం అప్రజాస్వామికంగా నియంతృతంగా ఉందన్నారు. ఇదేమి రాచరిక వ్యవస్థ కాదని, ప్రజాస్వామ్యంలో రాష్ట్ర పరిపాలన కేంద్రంగా ఉన్న సచివాలయంకు ప్రజలెవరైన వెళ్లేందుకు అవకాశం లేకపోవడం దురదృష్టకరమన్నారు.



సెక్రటేరియట్ నిర్మాణం గొప్పగా చూపిస్తున్న ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎందుకు అనుమతించడం లేదన్నారు. ఇది చాలా అవమానం, రచ్చ చేయాలనుకుంటే చేయగలను, కాని ప్రజల సమస్యలపై వచ్చానన్నారు. సచివాల‌యం కేవ‌లం బీఆరెస్‌పార్టీ వారికేనా అని ప్ర‌శ్నించారు. ప్రతిపక్షాలు, ప్రశ్నించే గొంతుకలు రావొద్దని బోర్డ్ పెట్టండని మండిప‌డ్డారు. ఈ పరిస్థితులను గమనించి ప్రజలు బీఆరెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు.



హోం మంత్రి క్ష‌మాప‌ణ చెప్పాలి


ఇటీవలే హోమ్ మంత్రి మ‌హ‌మూద్ అలీ తన అంగ‌ర‌క్ష‌కుడిపై చేయిచోసుకోవ‌డం ప‌ట్ల సీత‌క్క స్పందించారు. హోమ్ మంత్రి అసహనంగా ఉన్నారు, వెంట‌నే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మేము ప్రజల్లో తిరుగుతుంటే కుటుంబ సభ్యుల్లా మమ్మల్ని గన్ మెన్ లు చూసుకుంటారు, అలాంటి వారిపై దాడులు చేయ‌డం స‌రైంది కాద‌న్నారు. పోలీసులు అంటే మాకు అభిమానం, గౌరవం ఉందని ఎమ్మ‌ల్యే సీత‌క్క వెల్ల‌డించారు.