కార్పొరేట్ స్థాయిలో స‌బ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌లు..20న గ‌చ్చిబౌలిలో సీఎం శంకుస్దాప‌న‌ : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యాల‌కు వ‌చ్చే ప్రజ‌ల‌కు అత్యుత్తమ సేవ‌లు అందించ‌డానికి స్టాంప్ప్ అండ్ రిజిస్ట్రేష‌న్ల శాఖ‌లో విప్లవాత్మక‌మైన సంస్కర‌ణ‌లు చేపట్టామని మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలకు సీఎం రేవంత్ రెడ్డి ఈ భ‌వ‌నానికి ఈనెల 20వ తేదీన శంకుస్ధాప‌న చేయ‌నున్నారని తెలిపారు

కార్పొరేట్ స్థాయిలో స‌బ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌లు..20న గ‌చ్చిబౌలిలో సీఎం శంకుస్దాప‌న‌ : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  • కార్పొరేట్ స్థాయిలో స‌బ్‌రిజిస్ట్రార్ ఆఫీస్‌లు
  • 20న గ‌చ్చిబౌలిలో సీఎం శంకుస్దాప‌న‌
  • ఇప్ప‌టివ‌ర‌కు 3 ల‌క్ష‌ల స్లాట్ బుకింగ్‌లు
  • ప్ర‌యోగాత్మ‌కంగా ఆర్మూర్‌, కూసుమంచి ఎస్‌‌ఆర్‌‌వో కార్యాల‌యాల్లో ఈ-ఆధార్ సంత‌కం
  • మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్, ఆగస్ట్ 18 (విధాత) : రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యాల‌కు వ‌చ్చే ప్రజ‌ల‌కు అత్యుత్తమ సేవ‌లు అందించ‌డానికి స్టాంప్ప్ అండ్ రిజిస్ట్రేష‌న్ల శాఖ‌లో విప్లవాత్మక‌మైన సంస్కర‌ణ‌లు చేపట్టామని మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కార్యాలయాలకు సీఎం రేవంత్ రెడ్డి ఈ భ‌వ‌నానికి ఈనెల 20వ తేదీన శంకుస్ధాప‌న చేయ‌నున్నారని తెలిపారు. శంకుస్థాప‌న‌కు సంబంధించిన ఏర్పాట్ల‌పై సోమ‌వారం అధికారుల‌తో మంత్రి స‌మీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సంస్క‌ర‌ణ‌ల వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఇప్ప‌టికే ప‌లు మెరుగైన‌ సేవ‌లు అందుతున్నాయ‌న్నారు. భ‌విష్య‌త్తులో అత్యుత్త‌మ‌ సేవ‌లు అందించ‌డానికి వీలుగా ప్రజ‌ల‌కు సౌక‌ర్యవంతంగా ఉండేలా ప‌రిపాల‌న‌కు ఇబ్బంది లేకుండా అవసరమైన చోట సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాల పునర్వ్యవస్థీకరించి ఇంటిగ్రేటెడ్ కార్యాల‌యాల‌ను నిర్మించబోతున్నామని వెల్లడించారు. మొద‌టి ద‌శ‌లో హైద‌రాబాద్, రంగారెడ్డి, మేడ్చ‌ల్, సంగారెడ్డి నాలుగు జిల్లాల్లోని 39 స‌బ్‌ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌ను 11 స‌మీకృత భ‌వ‌నాల ప‌రిధిలోకి తీసుకురాబోతున్నామ‌ని తెలిపారు. రంగారెడ్డి ఆర్వో ఆఫీస్, గండిపేట, షేర్‌లింగంప‌ల్లి, రాజేంద్ర‌న‌గ‌ర్ నాలుగు ఆఫీసుల‌ను గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ (తాలిమ్) కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంగా నిర్మిస్తున్నామన్నారు.

ప్రజ‌ల స‌మ‌యాన్ని ఆదా చేసే విధంగా పార‌ద‌ర్శకంగా, అవినీతి ర‌హితంగా సేవ‌లు అందించేలా రాష్ట్రంలోని అన్ని స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో తీసుకువచ్చిన స్లాట్ బుకింగ్ విధానం విజయవంతంగా అమలవుతుందన్నారు. రాష్ట్రంలోని 144 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో ఏప్రిల్ 10వ తేదీ నుంచి ద‌శ‌ల వారీగా జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్లాట్ బుకింగ్ విధానాన్ని అమ‌లు చేస్తున్నామ‌ని ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు మూడు ల‌క్ష‌ల స్లాట్ బుకింగ్‌లు న‌మోద‌య్యాయ‌ని తెలిపారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ శాఖ‌ను త‌మ ప్ర‌భుత్వం ఒక ఆదాయ వ‌న‌రుగా చూడ‌డం లేద‌న్నారు. ప్ర‌జ‌ల‌కు అత్యుత్తమ సేవ‌లు అందించ‌డానికి అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. స్లాట్ బుకింగ్ ద్వారా ప్ర‌జ‌ల స‌మ‌యాన్ని ఎంతో ఆదాచేశామ‌ని , మ‌రింత వేగ‌వంతంగా రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ జ‌రిగేలా ఈ- ఆధార్ విధానాన్ని తీసుకురాబోతున్నామ‌ని ఇప్ప‌టికే ఈ విధానాన్ని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌, ఖ‌మ్మం జిల్లా కూసుమంచి స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో అమ‌లవుతుంద‌ని త్వ‌ర‌లో అన్ని కార్యాల‌యాల్లో అమ‌లు చేస్తామ‌ని మంత్రి పొంగులేటి వివ‌రించారు.