కేసీఆర్‌ను రక్షించేందుకే సీబీఐ వాదన
మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ముసుగులో చేసిన అవినీతి నుంచి ఆయనను కాపాడేందుకే కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సీబీఐ ఎంక్వయిరీ వాదన వినిపిస్తున్నారని మంత్రి పొన్నం

- మాజీ ముఖ్యమంత్రికి కిషన్‌రెడ్డి బినామీ
- ఎంఐఎం, బీజేపీ, బీఆరెస్‌లు ఒక్కటే
- కిషన్‌రెడ్డిపై మంత్రి పొన్నం ఫైర్
విధాత : మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ముసుగులో చేసిన అవినీతి నుంచి ఆయనను కాపాడేందుకే కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సీబీఐ ఎంక్వయిరీ వాదన వినిపిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కిషన్ రెడ్డి కోరుతున్నట్లుగా సీబీఐ దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సీబీఐ అనేది కేంద్ర సంస్థ ఆధ్వర్యంలో పని చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినా రాయకపోయినా కేంద్ర మంత్రి హోదాలో కేంద్ర పెద్దలకు లేఖ రాసి సీబీఐ దర్యాప్తును చేయించవచ్చని గుర్తు చేశారు. కేంద్రంలో బీజేపీనే అధికారంలో ఉన్నప్పటికీ ఎంక్వయిరీకి తామే అడ్డుపడుతున్నట్లు కిషన్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. సీబీఐ దర్యాప్తుతో ఏం జరుగుతుందో అందరికీ తెలుసని అన్నారు. సీబీఐ దర్యాప్తు చేస్తున్న లిక్కర్ స్కాం, సహారా స్కామ్ కేసులతో పాటు ఇతర అనేక స్కామ్‌లలో ఎంత మందికి శిక్ష పడిందని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడిషియల్ ఎంక్వయిరీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కిషన్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తన కేంద్ర మంత్రి పరపతిని ఉపయోగించి సిట్టింగ్ జడ్జిని కేటాయించే ప్రయత్నం చేయాలన్నారు. కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి బినామీ అని, ఎంఐఎం, బీజేపీ, బీఆరెస్‌లు ఒక్కటేనని విమర్శించారు. కేసీఆర్‌కు కిషన్ రెడ్డి బినామీ అని, బండి సంజయ్‌ని తప్పించి కేసీఆర్‌కు కిషన్ రెడ్డి నీడలా వ్యవహరిస్తున్నారని పొన్నం ఆరోపించారు. కేసీఆర్ ప్రతిపాదిత బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అనేక చిలక పలుకులు పలుకుతున్నారని అన్నారు. కేసీఆర్ రాసిచ్చిన స్ర్కిప్టునే కిషన్ రెడ్డి చదివి వినిపించారని ఎద్దేవా చేశారు. దీని ద్వారా రాబోయే ఎంపీ ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందనే ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. కానీ అటువంటిదేమీ జరగదన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. అనవసర రాజకీయం కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చేందుకు కిషన్ రెడ్డి ఎలాంటి సహకారం ఇస్తారో చెప్పాలన్నారు. కేంద్రం తీసుకున్న న్యాయ సంహిత 2023 చట్టంపై దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు అందోళన చేస్తుంటే కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి దీనిపై స్పందించడం లేదన్నారు.
కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసి డ్రైవర్లతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేపట్టి నెల రోజులు కూడా కాకముందే బీఆరెస్ నేతలు అత్యుత్సాహంతో విమర్శలు గుప్పిస్తున్నారన్నారు. ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని, అధికారం ఎవరికి శాశ్వతం కాదని, ఉన్నప్పుడు మంచి పనులు చేస్తేనే ప్రజలు గుర్తిస్తారన్నారు. ప్రజాపాలన దరఖాస్తులకు పొడగింపు లేదని, అర్హులంతా జనవరి 6వ తేదీలోపే దరఖాస్తులు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.