30సీట్లు వస్తే సీఎం నేనే..12మందితో ప్రజాశాంతి తొలి జాబితా వెల్లడి

- 12మందితో ప్రజాశాంతి తొలి జాబితా వెల్లడి
- అధ్యక్షుడు కేఏ పాల్
విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసేందుకు 12మంది అభ్యర్థులతో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తొలి జాబితాను సోమవారం ప్రకటించారు. అమీర్‌పేట్ ప్రజాశాంతి కార్యాలయంలో తొలి జాబితా విడుదల చేసిన సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న పార్టీలన్ని అవినీతిమయయ్యాని, తాను ఒక్కడినే క్లీన్ ఇమేజ్‌తో ఉన్న నాయకుడినని, అందుకే ప్రజలు ఈ ఎన్నికల్లో నన్ను ఒకసారి గెలిపించాలని కోరారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రజాశాంతి టికెట్ కోసం 344 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. రెండో జాబితా కూడా త్వరలోనే విడుదల చేస్తామన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి పోటీ చేస్తామని ప్రకటించారు.
తన దగ్గరకు టికెట్ల కోసం వచ్చి పలువురు వైఎస్సార్టీపీ నేతలు షర్మిలను నమ్ముకుని మోసపోయామని వాపోయారన్నారు. ఆమె పార్టీ అసలు రాజకీయ పార్టీ కాదని, నేను షర్మిల లాగా ప్యాకేజ్ స్టార్ కాదని సెటైర్ వేశారు. రేవంత్ రెడ్డికి నేను మద్దతు ఇవ్వనని, ఉచిత విద్య, లక్షల కోట్లు తెచ్చి ఉద్యోగాలు కల్పిస్తానని, ఈ హామీలే నన్ను గెలిపిస్తాయని, మోదీ గవర్నమెంట్ ని అదుకున్నది నేను అని చెప్పుకున్నారు. రాహుల్ గాంధీ నాతో రెగ్యులర్ గా మాట్లాడుతున్నారని, నాకు 30 సీట్లు వచ్చినా అధికారం నాదేనని, తెలంగాణలో నేనే సీఎం అవుతానన్నారు. గతంలో సీఎం కేసీఆర్, కేటీఆర్ తనపై దాడులు చేశారని అన్నారు. అనిల్ తో కొట్టించారని, నా పార్టీలో చేరినవారికి నరకం చూపించారని పాల్ ఆరోపించారు. గద్దర్ అన్నను కూడా చిత్రహింసలు పెట్టారు. రేవంత్ రెడ్డి కూడా గద్దర్ అన్న మీద పార్టీలో చేరాలని ఒత్తిడి తెచ్చారన్నారు.
కామారెడ్డిలో నేను పోటీ చేస్తా అని అనౌన్స్ చేయండంతో రైతులను చిత్రహింసలు చేశారని, కేసీఆర్, కాంగ్రెస్, మీద పోరాటానికి తెగించిన వారు మా పార్టీలో చేరుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ఎన్నికల కోసం ఒక్కో నియోజకవర్గంలో రూ.100 కోట్ల నుంచి రూ.1000 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖ పట్నం నుంచి పోటీ చేస్తానన్నారు. రేవంత్ రెడ్డికి షర్మిలా రెడ్డి మద్దతు ఇస్తారని నేను ముందే చెప్పానని, కాంగ్రెస్‌కు, రేవంత్‌రెడ్డికి మద్దతునివ్వాలని అమెరికా నుండి వందల కొద్ది కాల్స్ నాకు వస్తున్నాయన్నారు. లక్షల కోట్లు ఇస్తామని కొన్ని రాజకీయ పార్టీల వారు ఆఫర్ ఇస్తున్నారని, అందుకోసం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ముగ్గురు పెద్ద మనుషులు నాతో మాట్లాడి ఒప్పించాలని ప్రయత్నిస్తున్నారన్నారు.
నా అకౌంట్లు ఓపెన్ చేస్తే 50 లక్షల కోట్లు డొనేట్ చేస్తానని, ప్రపంచంలోనే చందా తీసుకోని ఏకైక వ్యక్తిని నేను అన్నారు. ప్రజల అభివృద్ధి కోసం 5 లక్షల కోట్లు పంచాననని, 40 లక్షల వితంతువులను ఆదుకున్న ఘనత నాదన్నారు. కులగజ్జి ఉండవద్దు అని, దళిత అమ్మాయిని పెండ్లి చేసుకున్నానని, షర్మిలకు ఓటు బ్యాంక్ ఉందా, కోదండ రామ్ పార్టీకి ఓటర్స్ ఉన్నారా? కోదండరాం లాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే దేశం ఏం కావాలని ప్రశ్నించారు. భారత్ శ్రీలంక కావద్దు అనే ఉదేశ్యంతో నేను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఒకప్పుడు నన్ను దేవుడు అన్న వారు ఇప్పుడు దెయ్యం అంటున్నారు.
12 మంది ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు వీళ్లే
ప్రజాశాంతి ప్రకటించిన తొలి జాబితాలో చెన్నూరు స్థానానికి అభ్యర్థిగా మొయ్య రాంబాబు, జుక్కల్ కర్రోళ్ల మోహన్, రామగుండం బంగారు కనకరాజు, వేములవాడ అజ్మీరా రమేష్ బాబు, నరసాపురం సిరిపురం బాబు, జహీరాబాద్ బేగరి దశరథ్, గజ్వేల్ పాండు, ఉప్పల్ కందుకూరు అనిల్ కుమార్, కల్వకుర్తి కట్టా జంగయ్య, నకిరేకల్ కిరణ్ కుమార్, మధిర కొప్పుల శ్రీనివాసరావులను అభ్యర్థులుగా ప్రకటించారు.