ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయం

- బీఆరెస్ తోడు దొంగల పాలనను సాగనంపుదాం
- కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రకాష్ రాథోడ్
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: తెలంగాణలో బీఆరెస్ తోడు దొంగల పాలనను సాగనంపేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని, ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్లమెంటరీ ఇన్‌చార్జి, కర్ణాటక ఎమ్మెల్సీ ప్రకాష్ రాథోడ్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని తిరుమల క్లాసిక్ గార్డెన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రకాష్ రాథోడ్ మాట్లాడారు.
అందరూ ఏకతాటిపైకి వచ్చి గ్యారంటీ హామీలపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేయాలని కోరారు. డిసెంబర్ 3న బీజేపీ, బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతు కాబోతున్నాయన్నారు. కార్యకర్తల సమూహం, ఉత్సాహం చూస్తుంటే ఎమ్మెల్యే అభ్యర్థి 50 వేల మెజార్టీతో గెలవడం ఖాయంగా కన్పిస్తోందని అన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిన ఘన చరిత్ర కాంగ్రెస్‌దేనని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీని బీఆర్ఎస్ మోసం చేసిందన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు సమయం ఆసన్నమైందని, తోడుదొంగల పాలనకు అంతం పలుకుదామని పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న, పాయల శంకర్ ఇద్దరూ ఒక్కటేనని, బీఆర్ఎస్, బీజేపీకి ఓటువేస్తే అవి చెత్తబుట్టలో పడ్డట్టేనని అన్నారు.
ఈ కార్యక్రమంలో నాందేడ్ మాజీ కార్పొరేటర్, ఏఐసీసీ మెంబర్ అబ్బాస్, కిసాన్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ముడుపు దామోదర్‌రెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్, మున్సిపల్ మాజీ చైర్మన్ దిగంబర్‌రావు పాటిల్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చరణ్‌గౌడ్, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు మునిగెల నర్సింగ్, ఎస్టీ సెల్ చైర్మస్ షెడ్మకి ఆనంద్‌రావు, బేల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాందాస్ నాక్లే, సీనియర్ నాయకులు భరత్ వాగ్మారే, వక్ప్‌బోర్డు మాజీ జిల్లా అధ్యక్షుడు సైద్‌ఖాన్, సీనియర్ నాయకులు భరత్ వాగ్మారే, ఐనేని సంతోష్‌రావు పాల్గొన్నారు.