బీజేపీ చేతిలో బీఆరెస్‌ రిమోట్: రాహుల్‌గాంధీ

బీఆరెస్ రిమోట్ కంట్రోల్ బీజేపీ, ప్ర‌ధాని నరేంద్ర‌మోదీ చేతిలో ఉన్న‌ద‌ని కాంగ్రెస్ ప్ర‌ధాన నేత‌లు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ నిప్పులు చెరిగారు

బీజేపీ చేతిలో బీఆరెస్‌ రిమోట్: రాహుల్‌గాంధీ
  • తెలంగాణలో గెలిచేది కాంగ్రెస్ పార్టీ
  • ఇక్క‌డ‌ బీఆర్ఎస్.. బీజేపీకి బీ టీమ్
  • కాంగ్రెస్ ఓట‌మికి 3 పక్షాలు మిలాఖత్
  • బీజేపీకి అవ‌స‌ర‌మొస్తే బీఆర్ఎస్ అండ
  • బీజేపీతో కాంగ్రెస్ రాజీపడే ప్ర‌స‌క్తే లేదు
  • కాంగ్రెస్‌పై, నాపై అనేక అక్రమ కేసులు
  • ములుగు బహిరంగసభలో రాహుల్‌గాంధీ

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: బీఆరెస్ రిమోట్ కంట్రోల్ బీజేపీ, ప్ర‌ధాని నరేంద్ర‌మోదీ చేతిలో ఉన్న‌ద‌ని కాంగ్రెస్ ప్ర‌ధాన నేత‌లు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ నిప్పులు చెరిగారు. బీఆరెస్‌ మొదటి నుంచీ బీజేపీకి బీ టీమ్ గా వ్యవహరిస్తున్న‌ద‌ని మండిపడ్డారు. బీజేపీ ప్రయోజనాలకు ఎప్పుడు అవ‌స‌రం ఎదురైతే అప్పుడు సీఎం కేసీఆర్ మద్ధతిస్తారని విమ‌ర్శించారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని గట్టి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార శంఖరావాన్ని ములుగు రామప్ప సాక్షిగా రాహుల్ బుధవారం పూరించారు. ఈ సందర్భంగా చేపట్టిన బస్సు యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ములుగు సమీపంలోని రామానుజాపురంలో జరిగిన భారీ బహిరంగసభలో రాహుల్, ప్రియాంక గాంధీ ప్రసంగించారు. బీజేపీతో తమకు తొలి నుంచి సిద్ధాంత పోరు కొనసాగుతున్న‌ద‌ని, ఆ పార్టీతో తాము రాజీపడేదిలేదని రాహుల్‌గాంధీ తేల్చిచెప్పారు. అందుకే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీపై బీజేపీ యుద్ధం ప్రకటించి, తమ నేతలపై అనేక అక్రమ కేసులు బనాయించింద‌ని విమ‌ర్శించారు. ఆఖరికి తన పై 24 కేసులు పెట్టారని, తన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేశారని, తన ఇళ్ళు గుంజుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే కేసీఆర్ పై సీబీఐ, ఈడీ, ఇన్‌కం ట్యాక్స్ అధికారుల సోదాలు, విచార‌ణ‌లు ఉండ‌వ‌ని గుర్తు చేశారు. దీనికి భిన్నంగా దేశవ్యాప్తంగా అన్ని విపక్ష పార్టీలపై ఈ సంస్థలతో త‌నిఖీలు నిర్వ‌హించార‌ని వివరించారు. అందుకే బీఆరెస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని అన్నారు. పార్లమెంట్‌లో బీజేపీకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు బీఆరెస్ మ‌ద్ద‌తు ఇచ్చింద‌ని గుర్తు చేశారు. మూడు న‌ల్ల‌ వ్యవసాయ చట్టాలు, జీఎస్టీకి బీఆరెస్‌ మద్ధతు ప‌లికింద‌న్నారు. బీఆరెస్ అంటే బీజేపీ రిష్తేదార్ స‌మితి అని ఆయ‌న ఎద్దేవా చేశారు.

 

తెలంగాణలో కాంగ్రెస్ దే గెలుపు

తెలంగాణలో గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనని రాహుల్ గాంధీ తేల్చిచెప్పారు. కర్ణాటక, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఇప్ప‌టికే అధికారంలోకి వ‌చ్చామ‌ని, రాబోయే ఎన్నిక‌ల్లో రాజ‌స్థాన్‌లో మ‌ళ్లీ గెల‌వ‌డంతోపాటు.. మధ్యప్రదేశ్, మిజోరం, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, తెలంగాణలో అధికారంలోకి వస్తున్నామంటూ భరోసా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నందునే ఇక్కడ మూడు పార్టీలు.. బీజేపీ, బీఆరెస్‌, ఎంఐఎం ఒక్కటయ్యాయని మండిపడ్డారు. రాష్ట్రంలో బీఆరెస్‌, కాంగ్రెస్ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని, బీజేపీ ఎప్పుడో ఓడిపోయిందని అన్నారు. అందుకే బీఆరెస్‌ గెలువాలని బీజేపీ ప్రయత్నిస్తున్న‌ద‌ని, అందుకే రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. వీరికి ఎంఐఎం జతకూడిందన్నారు. దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా రాహుల్ అభివర్ణించారు.

రాజకీయ ప్రయోజనం లేకుండా తెలంగాణ ఇచ్చాం

2004లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామ‌ని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని రాహుల్ చెప్పారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నద‌ని అన్నారు. రాష్ట్రం ఇచ్చే ముందు తమ రాజకీయ ప్రయోజనం పక్కనబెట్టి, ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు ప్రాధాన్యం ఇచ్చామ‌న్నారు. సీఎం కేసీఆర్ మాత్రం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. దళిత, గిరిజనులకు మూడెకల భూమి ఇస్తానన్నారు.. ఇచ్చారా? ఇంటికో ఉద్యోగమన్నారు.. ఇచ్చారా? అంటూ ప్రశ్నించారు. నీతివంతమైన పాలన అన్నారు.. అవినీతి మయం చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ధరణి పోర్టల్ పేరుతో ప్ర‌జ‌ల భూములు గుంజుకున్నారని విమర్శించారు. మీకు ఇండ్లు కట్టించారా? లక్ష రూపాయల రుణమాఫీ ఎవరికి చేశారు? అని ప్రశ్నించారు. ఇందులో ఒక్క హామీనీ నిలబెట్టుకోలేద‌ని చెప్పారు. అదే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాట‌క‌, రాజస్థాన్, హిమాచల్, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ల‌లో హామీలు అమలు చేశామ‌న్నారు. రాజస్థాన్ లో ఉచిత వైద్యం, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో రుణమాఫీ, క‌ర్ణాట‌క‌లో ఐదు గ్యారంటీలు అమలు చేశామన్నారు. కాంగ్రెస్ మాటిస్తే నిలబెట్టుకుంటుంద‌ని స్పష్టం చేశారు. ఆదివాసీ ప్రాంతాల్లో భూమి మీద ఆదివాసీల‌కే హక్కు కల్పిస్తుందని చెప్పారు. పోడు, అసైన్ మెంట్ భూముల హక్కులు జల్, జంగిల్, జమీన్‌పై హక్కులు కల్పిస్తుందన్నారు. కాంగ్రెస్‌ ఏం చెప్తుందో అదే చేస్తుందన్నారు. కేంద్రంలో అధికారంలోకి రాగానే మేడారం జాతరను జాతీయ పండుగగా ప్ర‌క‌టించి, కుంభమేళా స్థాయిలో నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

 

ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. మ‌హాల‌క్ష్మి ద్వారా మహిళలకు నెలకు రూ.2500, గ్యాస్ సిలిండర్ రూ.500లకు ఇస్తామన్నారు. రైతు భరోసా కింద ఎకరానికి రూ.15వేలు ఇస్తామ‌ని, రైతుకూలీలకు ఏడాదికి రూ.12వేలు ఇస్తామని ప్రకటించారు. 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తామని, ఇందిరమ్మ ఇండ్ల కింద రూ.5 లక్షలు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు 250 గజాల భూమి ఇస్తామ‌ని తెలిపారు. చేయూత కింద రూ.4వేల పెన్షన్, యువ వికాసం కింద రూ.5 లక్షల సహాయం, రూ.4వేల నిరుద్యోగ భృతి అందిస్తామని ప్రకటించారు.