తెలంగాణలో కాంగ్రెస్ గాలి: రాహుల్ గాంధీ

తెలంగాణలో కాంగ్రెస్ గాలి: రాహుల్ గాంధీ
  • ఉత్సాహం చూస్తే కేసీఆర్ ఓటమి ఖాయం
  • బీజేపీ, బీఆరెస్‌, ఎంఐఎం కుమ్మక్కు
  • ముగురూ కలిసి కాంగ్రెస్‌పై యుద్ధం
  • తెలంగాణతో మాది ఆత్మీయ బంధం
  • బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై సిద్ధాంతపోరు
  • నా డీఎన్ఏలోనే ఆ స్వభావం ఉంది
  • కాంగ్రెస్ గెలిస్తే దేశ‌వ్యాప్తంగా కుల‌గ‌ణ‌న‌
  • విజయభేరీ యాత్రలో రాహుల్ గాంధీ


విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తోందని, మీ ఉత్సాహం చూస్తుంటే ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి ఖాయమని అర్థ‌మ‌వుతున్న‌ద‌ని కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ విశ్వాసం వ్య‌క్తం చేశారు. గత పదేళ్ళుగా ప్రజలకు కేసీఆర్ దూరమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్‌పై మూడు పార్టీలు.. బీజేపీ, బీఆరెస్‌, ఎంఐఎం కుమ్మక్కై యుద్ధం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పార్టీ మరో పార్టీకి సహకరిస్తూ కాంగ్రెస్ పై కత్తికట్టాయని మండిపడ్డారు.


బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ల‌తో తమది సిద్ధాంత పోరాటమని రాహుల్ స్పష్టం చేశారు. ఈ డీఎన్ఏ తన రక్తంలోనే ఉందని అన్నారు. కాంగ్రెస్ విజయభేరి యాత్ర సందర్భంగా రెండవ రోజు గురువారం భూపాలపల్లి, కాటారం, మంథని ప్రాంతాల్లో రాహుల్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కార్నర్ స‌మావేశాల్లో ప్రసంగించారు. దీనికి ముందు సింగరేణి కార్మికులు, నిరుద్యోగ ప్రతినిధులు, రైతు ప్రతినిధులతో వేరువేరుగా సమావేశం అయ్యారు. పార్టీ ముఖ్య నేతలతో భవిష్యత్తు కార్యాచరణ పై చర్చించారు.


మోదీ ముందు కేసీఆర్ చేతులు కట్టుకుంటారు


పొద్దున లేవగానే బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు తనను ఎంత టార్గెట్ చేస్తే తన కర్తవ్యాన్ని ఆ స్థాయిలో నిర్వహిస్తున్నానని సంతృప్తి చెందుతానని రాహుల్ గాంధీ చెప్పారు. ఆ పార్టీతో రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అదే కేసీఆర్.. మోదీ ముందు చేతులు కట్టుకుంటారని అన్నారు. తాను మోదీని క‌లిసేందుకు ప్రాధాన్యం ఇవ్వ‌న‌ని స్ప‌ష్టం చేశారు. మీ తరుపున పోరాడే వాడు రాహుల్ అంటూ చెప్పారు.

కేసీఆర్ తనకు తాను రాజుగా భావిస్తున్నాడని రాహుల్ విమ‌ర్శించారు. ఆయన మాదిరి ఇచ్చిన హామీలు తుంగలో తొక్కేది లేదని, అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.


మూడు పార్టీలు కుమ్మక్కు


బీజేపీ, బీఆరెస్‌, ఎంఐఎం కుమ్మక్కై కాంగ్రెస్ పై యుద్ధం చేస్తున్నాయని రాహుల్ విమర్శించారు. బీఆరెస్‌ కుటుంబ పాలన చేస్తున్న‌ద‌ని అన్నారు. తాము ఆర్ఎస్ఎస్, బీజేపీలతో పోరాటం చేస్తుంటే అదే బీజేపీతో కేసీఆర్ మిలాఖతయ్యారని విమర్శించారు. బీజేపీతో ఎంఐఎంకు లాభం, ఎంఐఎంతో బీజేపీకి, ఈ రెండింటితో బీఆరెస్‌కు లాభం చేకూరే విధంగా పనిచేస్తున్నారని విమర్శించారు. ఈ మూడు పక్షాల కుమ్మక్కు వల్ల తెలంగాణకు, ఇక్కడి ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని అన్నారు. బీజేపీకి పార్లమెంట్ లో బీఆర్ఎస్ కు పూర్తి సహకరిస్తుందన్నారు.



కాంగ్రెస్ కులగణన చేపడుతోంది


కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కులగణన చేపడుతోందని రాహుల్ గాంధీ స్పష్టంగా ప్రకటించారు. ప్రస్తుతం తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్నారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ కులగణన చేపట్టేందుకు వ్యతిరేకంగా ఉన్నాయని మండిపడ్డారు. కుల గణన చేపట్టడం వల్ల దేశంలో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మహిళలు, మైనార్టీలు, ఇతరులు ఎవరెంత మంది ఉన్నారో తేలిపోతుందని అన్నారు.


దీని వల్ల ఆయా పీడిత,తాడిత, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. కేంద్రంలో 90 మంది కార్యదర్శులుంటే అందులో ఓబీసీలు ముగ్గురు మాత్రమేనని, వీరు కంట్రల్ చేసే బడ్జెట్ కేవలం 5శాతమని చెప్పారు. ఈ విషయాన్ని పార్లమెంట్ లో ప్రశ్నించానని చెప్పారు. దీని వల్ల తెలంగాణలో కేసీఆర్ చేసిన దోపిడి బహిరంగమవుతోందన్నారు.


తెలంగాణతో మాది ఆత్మీయసంబంధం


తెలంగాణతో తమకుటుంబానిది, మోదీ, కేసీఆర్ మాదిరి రాజకీయ సంబంధం కాదని, ఆత్మీయ సంబంధం ఉందని రాహుల్ గాంధీ అన్నారు. మా నాయనమ్మ ఇందిరమ్మకాలం, దానికి ముందు నెహ్రూతో ఆ తర్వాత సోనియాతో, ఇప్పుడు నాతో ఇదే సంబంధం ఉందన్నారు. అందుకే తన సోదరి ప్రియాంకను తీసుకొచ్చానని తెలిపారు. మీ పక్షాన ఢిల్లీలో సైనికునిగా పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.


ఈ సందర్భంగా భూపాలపల్లిలో నిరుద్యోగులు, సింగరేణి కార్మికుల భారీ టూ వీలర్ ర్యాలీ నిర్వహించగా ఇందులో రాహుల్ పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల నుద్దేశించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి, మంథని,ములుగు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు గండ్ర సత్యనారాయణ, శ్రీధర్ బాబు, ధనసరి సీతక్క, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క, ఎంపీ కొమటి రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.