కేసీఆర్ దోచింది ప్ర‌జ‌ల‌కే ఇస్తాం: రాహుల్‌గాంధీ

కేసీఆర్ దోచింది ప్ర‌జ‌ల‌కే ఇస్తాం: రాహుల్‌గాంధీ
  • ఆ కుటుంబ దోపిడీ ల‌క్ష‌ల కోట్లు
  • తెలంగాణ‌లో కేసీఆర్‌ రాచ‌రికం
  • కుటుంబ పాల‌న సాగుతున్న‌ది
  • ఈ ఎన్నిక‌ల్లో దొర‌ల తెలంగాణ‌కు,
  • ప్ర‌జ‌ల తెలంగాణ‌కు మ‌ధ్య పోటీ
  • బీఆరెస్‌, బీజేపీ, ఎంఐఎం ఒక్క‌టే
  • చక్కెర కర్మాగారాలు తెరిపిస్తాం
  • ప‌సుపు రైతుల‌కు మ‌ద్ద‌తు ధ‌ర‌
  • అధికారంలోకి రాగానే కుల గణ‌న‌
  • జ‌గిత్యాల‌, మోర్తాడ్‌, ఆర్మూరు స‌భ‌ల్లో
  • కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ



విధాత బ్యూరో, క‌రీంన‌గ‌ర్‌, నిజామాబాద్‌ ప్రతినిధి: ప్ర‌జాస్వామ్య తెలంగాణ ల‌క్ష్యంతో తాము ఆనాడు ప్ర‌త్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే.. అందుకు భిన్నంగా ఇక్క‌డ రాచరిక‌, కుటుంబ పాల‌న జ‌రుగుతున్న‌ద‌ని కాంగ్రెస్ అగ్ర నేత‌, ఎంపీ రాహుల్‌గాంధీ ఆరోపించారు. రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో బందీ అయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రస్తుత శాసనసభ ఎన్నికలు దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయని చెప్పారు. బీఆరెస్‌, బీజేపీ, ఎంఐఎం ఒక్క‌టేన‌న్న రాహుల్‌.. వారి ఆలోచ‌నంతా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా చూడ‌ట‌మేన‌ని విమ‌ర్శించారు. వాటికి ఓటు వేసి మీ ఓట్లు వృథా చేసుకోవద్దని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ముఖాముఖి పోటీ ఇచ్చే రాష్ట్రాల్లో బీజేపీకి మేలు చేసేందుకు ఎంఐఎం పోటీ చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా మూడో రోజు శుక్ర‌వారం జ‌గిత్యాల‌, మోర్తాడ్‌, ఆర్మూరులో జ‌రిగిన కార్న‌ర్ స‌మావేశాల్లో ఆయ‌న ప్ర‌సంగించారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ కుటుంబం లూటీ చేస్తున్న‌ద‌ని రాహుల్ ఆరోపించారు. భూములు, ఇసుక, మద్యం.. ఇలా ప్ర‌తి వ‌న‌రుల‌ను దోచేసి, కుంభ‌కోణాల‌తో లక్షల కోట్లు దోచుకుంటున్న‌ద‌ని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్ కుటుంబం దోచినదంతా రిక‌వ‌రీ చేసి, ప్రజలకే చెల్లిస్తామని ప్ర‌క‌టించారు. తెలంగాణ‌లో పర్యటిస్తున్న తనకు ఊరూరా బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌ దోపిడీ ప్రభుత్వాన్ని కూలదోసి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

అత్యంత అవినీతి సీఎం కేసీఆర్‌

దేశంలోనే అత్యంత అవినీతి సీఎం కేసీఆర్ అని రాహుల్‌ ఆరోపించారు. అయినా బీజేపీకి బీ-టీమ్‌గా ఉన్నందున కేసీఆర్‌పై ఒక్క విచార‌ణ కూడా జ‌రుగ‌లేద‌ని, ఒక్క కేసు కూడా పెట్ట‌లేద‌ని అన్నారు. విపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టించే ప్రధాని మోదీ, అమిత్ షా.. కేసీఆర్‌ను మాత్రం ఏమీ చేయరన్నారు. త‌న‌పై 44 కేసులు బీజేపీ పెట్టిందన్న రాహుల్‌.. తెలంగాణ ముఖ్యమంత్రిపై ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పాలని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీఆరెస్‌కు, కాంగ్రెస్‌కు మధ్యనే ప్రధాన పోటీ సాగుతుందన్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అందిస్తుందని, అధికారంలోకి రాగానే వాటి అమలుకు చర్యలు తీసుకుంటామని ప్ర‌క‌టించారు.

అధికారంలోకి రాగానే కుల‌గ‌ణ‌న‌

తాము తెలంగాణ‌లో అధికారంలోకి రాగానే మూడు నెల‌ల్లోనే ఓబీసీ గ‌ణ‌న‌కు స‌ర్వే నిర్వ‌హిస్తామ‌ని రాహుల్‌గాంధీ చెప్పారు. ప్రజా పాలనలో అత్యంత కీలకమైన ఐపీఎస్ అధికారులలో 90 శాతం అగ్రవర్ణాలకు చెందిన వారే ఉంటే, దేశంలో 60 శాతం జనాభా ఉన్న ఓబీసీలు కేవలం మూడు శాతం పదవులతో సరిపెట్టుకున్నారని అన్నారు. సంక్షేమ ఫలాలు పేద ప్రజల దరికి చేరేందుకు ఓబీసీ జన గ‌ణ‌న‌ను చేపట్టాలని తాను ప్రశ్నించానని తెలిపారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ జనగణన ఎందుకు చేయడం లేదని నిల‌దీశారు. 60 శాతం ఉన్న ఓబీసీలు వాస్తవాలను గ్రహించాలని రాహుల్ కోరారు. ఓబీసీ జ‌నాభా లెక్క‌లు తేల్చ‌క‌పోవ‌డం వ‌ల్లే రాజ్యాంగ ఫలాలు, ఆర్థిక వనరులు వారికి లభించడం లేదని అన్నారు. తాము అధికారంలోకి రాగానే ఓబీసీ గణన చేపట్టి వారికి రాజ్యాంగ ఫలాలు దక్కేలా చూస్తామని హామీ ఇచ్చారు.

చక్కెర ఫ్యాక్ట‌రీలు తెరిపిస్తాం

రైతాంగాన్ని ఆదుకోవడంతోపాటు చెరుకు రైతులను ప్రోత్సహిస్తామ‌ని రాహుల్ గాంధీ ప్ర‌క‌టించారు. ప్రభుత్వ విధానాల కార‌ణంగా మూతపడ్డ ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మరో రెండు చక్కర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని హామీ ఇచ్చారు. పసుపు బోర్డు హామీపై ప్రధాని మోదీ మాట తప్పారన్నారు. ఆర్మూర్ నిజామాబాద్ లలో పసుపు పంటను ఎక్కువ సాగు చేస్తారని, పసుపు రైతులకు క్వింటాల్‌కు 12నుంచి 15వేలు ఇస్తామన్నారు. ఈ ప్రాంతంతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధం రాజకీయ సంబంధమైనది కాదని నెహ్రూ, ఇందిర, రాజీవ్ గాంధీతో ముడిపడి ఉన్నదని అన్నారు. సోదరి ప్రియాంక గాంధీని తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి రమ్మని కోరినప్పుడు తెలంగాణతో తన అనుబంధం ఇప్పటిది కాదని, ఈ యాత్ర కొనసాగింపుగా ప్రచారానికి వస్తానని చెప్పార‌ని వెల్ల‌డించారు.

కుట్ర‌పూరితంగా నా స‌భ్య‌త్వ ర‌ద్దు

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన పార్లమెంటు సభ్యత్వాన్ని కుట్ర పూర్వకంగా రద్దు చేసిందని రాహుల్‌గాంధీ తెలిపారు. పార్లమెంట్ సభ్యుడిగా తనకు కేటాయించిన ఇంటి నుండి కూడా బలవంతంగా వెళ్లగొట్టారని చెప్పారు. అయితే ఇల్లు లేదని తాను ఎలాంటి దిగులు చెందలేద‌న్న రాహుల్‌.. ఈ దేశ‌మే త‌న ఇల్లు అని, మ‌రోవైపు ప్ర‌జ‌ల గుండెల్లో చోటు ఉండ‌టంతో త‌న‌కు ఇల్లెందుక‌ని అనుకున్నాన‌ని తెలిపారు. దేశ‌వ్యాప్తంగా బీజేపీతో తాము సైద్ధాంతిక యుద్ధం చేస్తున్నామ‌ని అన్నారు. ఈ క్ర‌మంలో ఇప్పటివరకు త‌న‌పై 24 కేసులు అక్రమంగా బనాయించార‌ని చెప్పారు.