ఆస్తులు తేలాకే అంత్యక్రియలు.. రెండు రోజులుగా ఇంట్లోనే భౌతిక కాయం
ఆస్తులు పంపకాలపై..అంత్యక్రియల ఖర్చులపై పేచిలతో నవమాసాలు మోసి..కని పెంచిన తల్లి అంత్యక్రియలు చేయకుండా కొడుకులు, కూతుళ్లు చేసిన నిర్వాకం క్షీణిస్తున్న మానవ సంబంధాలకు నిదర్శనంగా నిలిచింది.

విధాత : ఆస్తులు పంపకాలపై..అంత్యక్రియల ఖర్చులపై పేచిలతో నవమాసాలు మోసి..కని పెంచిన తల్లి అంత్యక్రియలు చేయకుండా కొడుకులు, కూతుళ్లు చేసిన నిర్వాకం క్షీణిస్తున్న మానవ సంబంధాలకు నిదర్శనంగా నిలిచింది. సూర్యాపేట జిల్లా నేరడుచర్ల మండలం కందులవారి గూడెంలో ఆస్తి వివాదాలు ఓ కొలిక్కి రాకపోవడంతో కన్నతల్లి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి ఆమె బిడ్డలు మొండికేయడంతో రెండు రోజులుగా ఆమె భౌతికాయాన్ని ఇంట్లోనే ఉంచేశారు. గ్రామానికి చెందిన వేము లక్ష్మమ్మ (80) అనే వృద్ధురాలు అనారోగ్యంతో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది.
కాగా.. ఆమెకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఆమె వద్ద రూ.20 లక్షల నగదు, 20 తులాల బంగారు నగలు ఉన్నాయి. ఒక కుమారుడు ఇదివరకే మరణించాడు. తల్లి మరణవార్త తెలుసుకున్న కుమార్తెలు, కోడలు, మరో కుమారుడు కందులవారి గూడెం చేరుకున్నారు. అంత్యక్రియల విషయం ఆలోచించకుండా ఆస్తి కోసం గొడవ పడ్డారు. గ్రామ పెద్దల దగ్గర పంచాయితీ పెట్టుకున్నారు. లక్షమ్మ వద్ద ఉన్న 20లక్షలలో 6 లక్షలు తల్లి వైద్య ఖర్చుల కింద చిన్న కూతురుకి ఇచ్చారు. మిగిలిన 15 లక్షలు కొడుకు తీసుకున్నాడు. 20 తులాల బంగారం ముగ్గురు కూతుళ్లకు పంచారు.
ఇక పంచాయతీ తెగిందనుకుంటే కొడుకు అడ్డం తిరిగి తాను అమ్మ అంత్యక్రియలు భరించలేనని, డబ్బులిస్తేనే తలకొరివి పెడుతానంటూ భీష్మించాడు. దీంతో రెండ్రోజులుగా ఈ తంతు కొనసాగుతూనే ఉంది తప్ప ఓ కొలిక్కి రాలేదు. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించకుండా మృతదేహాన్ని ఇంట్లోనే ప్రీజ్‌లో ఉంచేశారు. కన్నబిడ్డలే దహనసంస్కారాలు చేయకుండా తాత్సారం చేయడంపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు శుక్రవారం ఉదయం గ్రామపెద్దలు సమావేశమై లక్ష్మమ్మ కొడుకుకు మరో 2లక్షలు ఇప్పించారు. దీంతో శాంతించిన కొడుకు తల్లి అంత్యక్రియలు పూర్తి చేశాడు.