BRS | బీఆరెస్ ఘర్ వాపసీ … కాంగ్రెస్ నుంచి మళ్లీ బీఆరెస్‌లోకి నలుగురు ఎమ్మెల్యేలు
బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నలుగురు బీఆరెస్ ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి చేరుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్‌రెడ్డి బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను కలిసి తాను బీఆరెస్‌లోనే కొనసాగబోతున్నట్లుగా వెల్లడించారు.

తెరపైకి ఘర్‌వాపసీ!
కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యేలు బండ్ల, తెల్లం
బీఆరెస్‌లోనే కొనసాగుతారని వెల్లువెత్తిన ప్రచారం
జగిత్యాల, చేవెళ్ల ఎమ్మెల్యేలు సంజయ్, యాదయ్యలపై అదే ప్రచారం
సోషల్ మీడియాలో యథేచ్ఛగా వార్తలు
కొట్టిపారేసిన యాదయ్య.. టీ తాగడానికి వెళ్లానన్న తెల్లం
1వ తేదీకి ఫిరాయింపుల కేసు విచారణ వాయిదా
విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్‌లో చేరిన నలుగురు బీఆరెస్ ఎమ్మెల్యేలను తిరిగి సొంత గూటికి చేర్చుకునే ప్రయత్నంలో బీఆరెస్ ఘర్ వాపసీ ఆపరేషన్ చేపట్టిందన్న ప్రచారం రాష్ట్రంలో రాజకీయంగా ఆసక్తి రేపింది. ఇందుకు మంగళవారం అసెంబ్లీ హాల్‌లో బీఆరెస్‌ఎల్పీ కార్యాలయంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలవడం ఆజ్యం పోసింది. ఈ సందర్భంగా బండ్ల అధికారికంగా పార్టీ మార్పునకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ కేటీఆర్‌ను కలిసిన సందర్భంలో తాను ఇప్పటికీ బీఆరెస్ సభ్యుడినేనని, తిరిగి బీఆరెస్‌లోనే కొనసాగుతానని చెప్పినట్లు వార్తలు గుప్పుమన్నాయి. కాంగ్రెస్‌లో తాను ఇమడలేనని, తనలాగే బీఆరెస్ నుంచి చేరిన పలువురు ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారని, బీఆరెస్‌లో కొనసాగే విషయమై కేసీఆర్‌ను కలిసి పూర్తి సమాచారాన్ని వెల్లడిస్తానని బండ్ల పేర్కొన్నట్టు ప్రచారం సాగింది. జూలై 6న బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. తిరిగి బండ్ల బీఆరెస్‌లో కొనసాగుతారన్న ప్రచారంపై ఆయన అధికారికంగా ప్రకటన చేస్తేగానీ ఈ వ్యవహారంలో నెలకొన్న గందరగోళం తొలగిపోదు. కాగా బండ్ల కేటీఆర్‌ను కలిసిన అనంతరం భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి కేటీఆర్‌ను కలిశారు. తాను కూడా బీఆరెస్‌లోనే కొనసాగుతానని కేటీఆర్‌కు తెల్లం చెప్పినట్లుగా ప్రచారం సాగింది. ఇదే దారిలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కూడా తిరిగి బీఆరెస్‌లోనే కొనసాగేందుకు నిర్ణయించుకుని, ఈ మేరకు కేటీఆర్‌కు సమాచారం అందించారని ప్రచారం జోరందుకుంది. తమ నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ వారితో ఇమడలేకపోతున్నామన్న బాధతో పాటు, అనర్హత భయంతో ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారన్న చర్చ మొదలైంది. అందుకే పార్టీ మార్పుపై వారు యూటర్న్ తీసుకుని ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే వారిని తిరిగి బీఆరెస్‌లోకి వెళ్లకుండా కాంగ్రెస్ నాయకత్వం నిలవరించే ప్రయత్నం చేస్తుండటం ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరం అంశంగా కనిపిస్తున్నది. మరోవైపు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఎన్నికకు సంబంధించి డీకే అరుణ, సరితలు కోర్టులో వేసిన పిటిషన్‌లపై బండ్ల పక్షాన ఇప్పటి వరకు బీఆరెస్ పార్టీనే లాయర్‌ను పెట్టి కోర్టులో వాదించింది. ఇటీవల బీఆరెస్ ఆ లాయర్‌ను తొలగించిందని సమాచారం. ఎల్లుండి కోర్టులో వాయిదా ఉన్న నేపథ్యంలో బండ్ల కేటీఆర్‌ను కలిసినట్లుగా తెలుస్తున్నది.
బీఆరెస్‌లోకి ప్రచారాన్ని ఖండించిన ఎమ్మెల్యేలు తెల్లం, యాదయ్య
తిరిగి తాము బీఆరెస్‌లో కొనసాగుతామంటూ రేగిన ప్రచారంపై ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కాలె యాదయ్య స్పందించారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్పందిస్తూ తాను బీఆరెస్ ఎమ్మెల్యేలతో ఉన్న అనుబంధంతో అసెంబ్లీ లాబీల్లో వారిని కలిసిన సందర్భంలో కూర్చుని వారితో టీ తాగానన్నారు. ఆ ఫోటోలను వైరల్ చేసి మళ్లీ బీఆరెస్‌లోకి వెళుతున్నానంటూ దుష్ప్రచారం చేయడం సరికాదంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యదయ్య సైతం పార్టీ మార్పు ప్రచారాన్ని ఖండించారు. తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని చెప్పారు. మళ్లీ బీఆరెస్‌లో చేరుతున్నట్లు తప్పుడు ప్రచారం జరుగుతున్నదని చెబుతూ.. వాటిని ఖండించారు.
1వ తేదీకి ఫిరాయింపుల కేసు విచారణ
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టులో కొనసాగుతున్న కేసు విచారణ ఆగస్టు1వ తేదీకి వాయిదా పడింది. పార్టీ ఫిరాయించిన బీఆరెస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై వేటు వేయాలంటూ బీఆరెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో పిటిషనర్ల తరఫున కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు కేసు విచారణను ఆగస్టు 1వ తేదీకి వాయిదా వేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయమై స్పీకర్‌కు నిర్ధిష్ట సమయంతో కూడిన ఆదేశాలివ్వాలని బీఆరెస్ కోరుతున్నది. అయితే అలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం లేకపోవడంతో ఈ కేసు ఆసక్తికరంగా మారింది. హైకోర్టులో ఈ కేసు విచారణ కొనసాగుతున్న క్రమంలోనే కాంగ్రెస్‌లో చేరిన 10మంది ఎమ్మెల్యేల్లో నలుగురు ఎమ్మెల్యేలు తిరిగి బీఆరెస్ గూటికి చేరుతారన్న ప్రచారం చోటుచేసుకోవడం ఫిరాయింపుల పర్వాన్ని ఆసక్తికర మలుపు తిప్పినట్లయ్యింది.