కేసీఆర్ పాపం పండింది: రేవంత్ రెడ్డి
కేసీఆర్ పాపం పండింది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం నేలకూలాల్సిందే. శిశుపాలుడి వంద తప్పులు పూర్తయ్యాక శిరచ్ఛేదనం జరిగింది. పాపాల భైరవుడు కేసీఆర్ వంద తప్పులు పూర్తయ్యాయి.ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ శిరచ్ఛేదనం జరగాల్సిందేనని, ఇందిరమ్మ రాజ్యం రావాల్సిందేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు

- బీఆర్ఎస్ ప్రభుత్వం నేలకూలాల్సిందే
- కేసీఆర్ వంద తప్పులు పూర్తయ్యాయి
- తాగుడులో రాష్ట్రం నెంబర్ వన్ అయ్యింది
- నిరుద్యోగులు అడవిబాట పట్టే స్థితి వస్తుంది
- సొంత కుటుంబానికి ఉద్యోగాలు
- వర్ధన్నపేట, స్టేషన్గన్పూర్ బహిరంగ సభల్లో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కేసీఆర్ పాపం పండింది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం నేలకూలాల్సిందే. శిశుపాలుడి వంద తప్పులు పూర్తయ్యాక శిరచ్ఛేదనం జరిగింది. పాపాల భైరవుడు కేసీఆర్ వంద తప్పులు పూర్తయ్యాయి.ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ శిరచ్ఛేదనం జరగాల్సిందేనని, ఇందిరమ్మ రాజ్యం రావాల్సిందేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టేషన్ ఘనపూర్, వర్ధన్నపేటలో మంగళవారం జరిగిన విజయభేరి బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు.
నిరుద్యోగులు అడవిబాట పట్టే పరిస్థితి వస్తుంది
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి నిరుద్యోగుల సమస్య పరిష్కరించకుంటే వారంతా అడవిబాట పట్టే పరిస్థితి ఉందని రేవంత్ అన్నారు. 30లక్షల మంది నిరుద్యోగులు అడవిబాట పడితే ఈ ప్రభుత్వంలో ఒక్కరు కూడా మిగులరని హెచ్చరించారు. నిరుద్యోగులు అడవికి పోవడానికో, అన్నలు కావడానికో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇవ్వలేదన్నారు. ఉద్యోగాల కోసం హైదరాబాద్లో ఏండ్ల తరబడి కోచింగ్ తీసుకుని పరీక్షలు రద్దు కావడంతో ప్రవళిక లాంటి అమ్మాయి ఆత్మహత్యచేసుకుంటే ఆమె పై అబండాలు వేసి నిందలు మోపారని విమర్శించారు.
కేసీఆర్, కెటిఆర్ నీ బిడ్డైతే ఈ విధంగా మాట్లాడేవారా? అంటూ ప్రశ్నించారు. ఆంధ్రాలో నష్టంవాటిల్లుతోందని తెలిసి సోనియా తెలంగాణ ఇస్తే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో దోపిడి దొంగలుగా మారారని, దంబు పాళ్యం ముఠాగా మారిన వీరిని ఊరిపొలిమేరలకు రాకుండా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. పదేండ్లు ఏం చేయనందున్నే మొండికత్తితో పొడిచే పరిస్థితి దాపురించిందన్నారు. కాళేశ్వరం పేరుతో అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. మేడిగడ్డ కుంగిపోయిందని, సుందిళ్ళ, అన్నారం పరిస్ధితి అధ్వాన్నంగా తయారైందన్నారు. బస్సులు పెట్టి తీసుకపోయిన కేసీఆర్ ఇప్పుడెందుకు స్పందించడం లేదని మండిపడ్డారు.
తాగుడులో తెలంగాణ నెంబర్ వన్
పదేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం తాగుడులో నెంబర్ వన్ అయ్యిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అభివృద్ధిలో చేశావా? రైతుల ఆత్మహత్యలు లేకుండా చేశావా? అత్యాచారాలు జరుగకుండా చేశావా? నిరుద్యోగం లేకుండా చేశావా? తాగుబోతులను తయారు చేయడంలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేశావని విమర్శించారు.
18వేల వైన్ షాపులు తెరిచావు, 3వేల బార్లు ప్రారంభించావు. 62వేల బెల్ట్ షాపులు తెరిచి 36వేల కోట్ల ప్రజల సొమ్ము ఆదాయంగా మార్చుకున్నావని విమర్శించారు. బడికిపోయే బిడ్డల చేతుల్లో బీరుసీసాలు, గులాబీ జెండా పెడుతున్నారని విమర్శించారు. బిల్లులు రాక సర్పంచ్ లు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ దద్దమ్మ దయాకర్ రావు ఖాళీ సీసాలమ్ముకోవాలంటున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ బీరు సీసాలు అమ్ముకోవాలంటున్నారని మండిపడ్డారు.
సొంత కుటుంబానికి ఉద్యోగాలు
నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో నిర్లక్ష్యం చేసిన కేసీఆర్ తనకు, తన కొడుక్కు, అల్లుడు, షడ్డకుని కొడుక్కు, బిడ్డకు, ఆఖరికి దద్దమ్మ దయాకర్ రావుకు మంత్రి పదవులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు చేశావని రేవంత్ విమర్శించారు. పదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. బీఆరెస్ ఆరుగురు మహిళలకు టికెట్లు ఇస్తే.. కాంగ్రెస్ 12 మంది మహిళలకు టికెట్లు ఇచ్చిందని, పదేళ్లలో ప్రజలకు కేసీఆర్ చేసిందేం లేదన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డలు ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి కేసీఆర్ పాలనలో దాపురించిందన్నారు. కేసీఆర్ మంత్రివర్గంలో మొదటిదఫా మహిళలకే స్థానం కల్పించలేదని, ఇప్పుడు మాదిగలకు స్థానమేలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నలుగురు మహిళలకు స్థానం కల్పిస్తామన్నారు. ఆడబిడ్డల చేతిలో పెత్తనం ఉంటే కుటుంబం మంచిగుంటదన్నారు.
కడియం, రాజయ్య, అరూరి తీరే వేరే
ఒక ఆడబిడ్డ సింగాపురం ఇందిర ఇక్కడ పోటీ చేస్తుంటే రాజయ్య, శ్రీహరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. శ్రీహరి సంగతి రాజయ్య చెప్పిండు… రాజయ్య సంగతి శ్రీహరి చెప్పిండు. ఎన్ కౌంటర్ల కడియం అని ఆయన కృష్ణలీలు ఒకరివని విమర్శించుకున్నారని అన్నారు. ఇద్దరూ ఉప ముఖ్యమంత్రిగా పని చేసి ఉద్యోగం ఊడగొట్టుకున్నోల్లే.ఇద్దరి జాతకాలు తెలుసు కాబట్టే ఉద్యోగం ఇచ్చి మధ్యలోనే ఊడగొట్టిండన్నారు.
కేసీఆర్ కే వీళ్లపై నమ్మకం లేదు.. అలాంటిది ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. చెప్పులు కూడా లేకుండా రాజకీయాల్లోకి వచ్చి వర్ధన్నపేట ఎమ్మెల్యే అయిన అరూరి రమేష్ ఇవ్వాల కోట్లకు పడగెత్తారని విమర్శించారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల భూములను లాక్కొనేందుకు కుట్ర చేస్తే తిప్పికొట్టారని వివరించారు. ఇంకా ఆ జీవో రైతుల మెడపై వేలాడుతోందని అన్నారు. ఈ నాయకులకు బుద్ది చెప్పాలని పిలుపు నిచ్చారు.
సంక్షేమం, అభివృద్ధి కాంగ్రెస్ లక్ష్యం
స్టేషన్ ఘనపూర్ కు వందపడలకల ఆసుపత్రి, డిగ్రీ కాలేజీ తెచ్చే బాధ్యత నాదని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ప్రతీ నెలా రూ.2500 అందిస్తామని, రూ.500లకే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తాం, రైతులకు, కౌలు రైతులకు ప్రతీ ఏటా ఎకరాకు రూ.15వేలు అందిస్తాం,రైతు కూలీలకు ప్రతీ ఏటా రూ.12వేలు అందిస్తాం. ఆనాడు 9గంటలు ఉచిత కరెంటు ఇచ్చింది కాంగ్రెస్.ఇప్పుడు 24గంటల నాణ్యమైన ఉచిత కరెంటు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ దని వివరించారు.
పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాం.చేయూత పథకం ద్వారా రూ.4వేలు పెన్షన్ అందిస్తాం..ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు ఉచిత వైద్యం అందిచే బాధ్యత కాంగ్రెస్ దన్నారు. మార్పు జరగాలి, కాంగ్రెస్ రావాలని కోరారు. స్టేషన్ ఘనపూర్ లో ఇందిరమ్మను, వర్ధన్నపేటలో నాగరాజును, వరంగల్ పశ్చిమలో నాయిని రాజేందర్ రెడ్డిని, నర్సంపేటలో దొంతి మాధవరెడ్డిని గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు. సభలకు పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారు.