హైదరాబాదులో ఫోరెన్సిక్ సెంటర్
హైదరాబాద్‌లో ఫోరెన్సిక్ సెంటర్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ను డిజిటల్ ఫోరెన్సిక్ మరియు డేటా రికవరీలో దిగ్గజం అయిన జూమ్ టెక్నాలజీస్‌తో కలిసి ఏర్పాటు

- జూమ్ టెక్నాలజీ తో కలిపి..
- ఏర్పాటుకు ముందుకు వచ్చిన ఏసిఈ ల్యాబ్
- మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయిన సంస్థ ప్రతినిధులు
- అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ
విధాత: హైదరాబాద్‌లో ఫోరెన్సిక్ సెంటర్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ను డిజిటల్ ఫోరెన్సిక్ మరియు డేటా రికవరీలో దిగ్గజం అయిన జూమ్ టెక్నాలజీస్‌తో కలిసి ఏర్పాటు చేయాలని రష్యా కు చెందిన ఏఈసి ల్యాబ్ సంస్థ నిర్ణయించింది. మంగళవారం హైదరాబాద్‌లో ఏసీఈ లాబ్ సీఓఓ మ్యాక్స్ పుతివ్ సేవ్, జూమ్ టెక్నాలజీస్ సీఓఓ, ఆ సంస్థల ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖామంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తో భేటీ అయి తాము ఏర్పాటు చేయబోతున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రతిపాదనలను వివరించారు. ప్రభుత్వపరంగా కావాల్సిన సహాయ సహకారాల గురించి వారు చర్చించారు. 129 దేశాల్లో తమ సంస్థ కార్యకలాపాలు ఉన్నాయని చెప్పారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో ఆయా దేశాల దర్యాప్తు సంస్థలతో కలిసి పనిచేస్తున్న అనుభవం తమకు ఉందని వివరించారు. డేటా లాస్, డిజిటల్ ఇన్వెస్టిగేషన్ సవాళ్లను అధిగమించడానికి భారతీయ వ్యాపారాలు, బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు, దర్యాప్తు సంస్థలకు తాము సహకరిస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేకమైన సాంకేతికతతో ఉన్నత స్థాయి నైపుణ్యాలు కలిగిన సాంకేతిక నిపుణులతో ఆయా సంస్థలకు తాము వృత్తిపరమైన శిక్షణ ఇవ్వడంలో నిష్ణార్ధులమని తెలిపారు. తెలంగాణలో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం పట్ల మంత్రి శ్రీధర్ బాబు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున కావాల్సిన తోడ్పాటును అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు వారికి హామీ ఇచ్చారు.