సామాజిక కేంద్రమైన బడి సజీవంగా ఉండాలె
బడిని సామాజిక కేంద్రంగా చూడాలి. కమ్యూనిటీ ఎడ్యుకేషన్‌ను కూడా బడి ద్వారా అందిచవచ్చు. బడి అనేక సామాజిక అంశాలకు కేంద్రంగా ఉంటుంది

బడిని సామాజిక కేంద్రంగా చూడాలి. కమ్యూనిటీ ఎడ్యుకేషన్‌ను కూడా బడి ద్వారా అందిచవచ్చు. బడి అనేక సామాజిక అంశాలకు కేంద్రంగా ఉంటుంది. పాఠశాల అనేది ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైనటువంటి ఎన్నికల ప్రక్రియకు పోలింగ్ బూత్‌గా పనిచేస్తుంది. ఇట్లా బడి అంటే కేవలం విద్యార్థులకు విద్యను అందించడమే కాకుండా సమాజానికి అనేక సేవలు అందిస్తుంది. అలాంటి ప్రభుత్వ పాఠశాలలను విద్యార్థులు లేరన్న నెపంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మూసివేసింది. విద్య, వైద్య రంగాలను తొమ్మిదిన్నరేళ్ల కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ముఖ్యంగా విద్యా శాఖపై మొదటి నుంచి అలసత్వమే. అందుకే విద్యారంగ అభివృద్ధిలో అట్టడుగు స్థానానికే పరిమితమైంది. విద్యాభివృద్ధి కోసం కృషి చేయకుండా, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయకుండా, పిల్లలు తక్కువగా ఉన్నారన్న కారణంతో వందలాది స్కూళ్లను మూసివేసింది.
గత ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్ల కాలంలో సర్వీస్ కమిషన్ ద్వారా ఒక్కసారి మాత్రమే టీఆర్‌టీ నిర్వహించింది. 13 వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న ఎన్నికలకు ముందు 5 వేలకుపైగా పోస్టులకు మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి చేతులు దులుపుకున్నది. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు సకాలంలో పూర్తి చేసి ఉంటే మరిన్ని పోస్టులు పెరిగేవి. కానీ విద్యా రంగం అన్నది గత ప్రభుత్వానికి ప్రాధాన్య అంశం కాదు. టీచర్ పోస్టుల భర్తీ సంగతి పక్కనపెడితే ఏటా టెట్ ను కూడా నిర్వహించలేని దుస్థితిలో నాటి ప్రభుత్వ విధానాలుండేవి. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకపోడంతో విద్యావాలంటీర్లతోనే కాలం వెళ్లదీసింది. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య దొరకకుండా పోయింది. తమ పిల్లలను బాగా చదివించుకోవాలని, పోటీ ప్రపంచంలో వాళ్లు రాణించాలంటే వాళ్లకు ఫౌండేషన్ గట్టిగా ఉండాలని తల్లిదండ్రులు అప్పుజేసి అయినా ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకునే పరిస్థితిని గత ప్రభుత్వం కల్పించింది.
అలాగే ఎవరూ కోరకున్నా ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచి నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసింది.పని చేయగలిగే సామర్థ్యం 15 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకే ఉంటుందని అర్ధశాస్త్రం చెబుతున్నది. దీన్నికూడా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. దీంతో వయసు మీద పడిన ఉపాధ్యాయులు ప్రయాణం చేయడానికే అలసిపోతున్నారు. వాళ్ల పిల్లలకు పాఠాలు చెప్పగలిగే ఓపిక ఉండదు. అందుకే ప్రభుత్వ నిర్ణయాన్ని నిరుద్యోగులే కాదు, ఉద్యోగ, ఉపాధ్యాయులు తప్పుపట్టారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విద్యాశాఖలో రిటైర్మెంట్‌లే గాని రిక్రూట్‌మెంట్ లు లేవంటే అతిశయోక్తి కాదు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో బడి లేని పంచాయతీ ఉండొద్దని స్పష్టం చేసింది. సచివాలయంలో జరిగిన విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ రాష్ట్రంలో ఎంత చిన్న గ్రామమైనా, మారుమూల తండా అయినా తప్పకుండా ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాలి. ఏ ఒక్క విద్యార్థి అయినా చదువుకోసం ఇతర గ్రామాలకు, పట్టణాలకు వెళ్లే పరిస్థితి ఉండొద్దు. విద్యార్థులు లేరనే నెపంతో మూసివేసిన అన్ని పాఠశాలలను తెరిపించాలి. ఎంతమంది పిల్లలు ఉన్నా ప్రభుత్వ పాఠశాలను నడుపాల్సిందే. దీనికోసం వెంటనే మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల భర్తీకి చర్యలను తీసుకోవాలని’ అధికారులను ఆదేశించారు. విద్యాభివృద్ధి కోసం సీఎం తీసుకున్న స్పష్టమైన నిర్ణయాల పట్ల విద్యావేత్తలు, ప్రజాస్వామికవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యామ్నాయ ఆలోచనలతో పని చేయించొచ్చు
విద్యార్థులతో మా ప్రమేయం లేకుండా బడి సజీవంగా ఉండాలి. ఉపాధ్యాయులను కూర్చోబెట్టి జీతం ఇవ్వలేము. కాబట్టి ప్రజాధనం వృథా కాకుండా దానికి ప్రత్యామ్నాయంగా ఆలోచనలతోనే దానిని పని చేయించాలి. దానికి ప్రత్యామ్నాయ ఆలోచనలు ఏవిధంగా ఉండాలి? బడిని ఏ విధంగా నడుపాలన్నదానిపై నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)లో అనేక మార్గదర్శకాలున్నాయి. స్కూల్ కాంప్లెక్స్‌కు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నది. దీనివల్ల రకరకాల శిక్షణా కార్యక్రమాలకు దీన్ని అందుబాటులో ఉంచవచ్చు. ప్రదర్శనలకు వినియోగించవచ్చు. ఎక్కడైతే మౌలిక సదుపాయాలు తక్కువగా ఉండాయో ఈ బడిని వాటికి వాడుకోవచ్చు. ఇలా బడి అనేది అనేకరకాలుగా ఉపయోగపడుతుంది. అలాంటి బడిని విద్యార్థులు లేరన్న కారణంతో మూసివేస్తే తిరిగి పునఃప్రారంభించేంత గొప్ప మనసు ప్రస్తుతం ఉన్నప్రభుత్వాలకు ఉండదు. ప్రైవేటీకరణ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం మూసివేసిన ప్రభుత్వ పాఠశాలను తిరిగి తెరిపించడానికి ముందుకు రావడం ముదావహం.
విభిన్న ఆలోచనలతో వినియోగించుకోవచ్చు ఇలా
ప్రస్తుత పాఠశాలలన్నీప్రభుత్వాలేవీ పెట్టించలేదు. రకరకాల ప్రాజెక్టుల కింద అవి ప్రారంభమయ్యాయి. 1993 తర్వాత వచ్చిన ప్రతి పాఠశాల యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్టుల కింద వచ్చాయి. ప్రతి కిలోమీటర్‌కు బడి అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో. ప్రవేశాల సంఖ్య పెంచాలి, బడీడు ఉన్న ప్రతి పిల్లవాడు బడిలో ఉండాలన్నప్పుడు పాఠశాల లేదా ప్రత్యామ్నాయ పాఠశాల (బడి ఉంటే అక్కడ పక్కన ఒక షెడ్ వేసి అయినా) ఈ ఉద్యమంలో భాగంగా 1993-2010 వరకు నిడిచిన సర్వశిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్, డీపీఈపీ, సమగ్ర శిక్ష ఇలా రకరకాల ప్రాజెక్టు ద్వారా ఏర్పడినాయి. వీటి ద్వారా పెట్టుకున్న లక్ష్యాల సాధనల్లో ప్రవేశాలు జరిగాయి.
పిల్లలు బడి మానివేయకుండా నిరోధించబడింది. తర్వాత కాలంలో జనాభా పెరుగుదలో తగ్గుదల, వలసలు ఇతర కారణాల వల్ల చిన్న చిన్న గ్రామాల్లో కొన్నిచోట్ల బడుల్లో పిల్లలు లేకుండాపోయారు. అప్పుడు బడులు లేవనే సమస్య తలెత్తింది. అయితే ఒక ఊరిలో(ఎస్సీ, బీసీ, ఇతర వాడలకు) మూడు నాలుగు బడులుంటాయి. వాటిలో ఏ బడి ని ఉంచాలి, ఏ బడిని మూయాలి అన్నది ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఇలా కాకుండా ఒక ఊరిలో ఒక బడి మాత్రమే ఉంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మూసివేయవద్దు. ఒకవేళ పిల్లలు లేకపోతే పిల్లలు వచ్చేవరకు దాన్నిమూసివేయకుండా ఆ బడిని గ్రంథాలయంగా వాడుకోవాలి. లేదా ఇతర పాఠశాలలు అక్కడ అనుకూలంగా ఒక ల్యాబ్ పెట్టుకోవచ్చు. క్లస్టర్ ఆఫ్ స్కూల్స్ నిబంధనల్లో ఇవన్నీ ఉన్నాయి. స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని బడులు రెండుమూడు కిలోమీటర్ల పరిధిలోనే ఉంటాయి. కాబట్టి పిల్లలు ఈ వసతులు వాడుకునేలా మన సౌకర్యాలు కల్పించాలి. ఎన్‌ఈపీలో వర్క్‌షాప్ ఉండాలని పేర్కొన్నది. అప్పుడు ఆ వర్క్ షాప్ ఎక్కడ పెట్టాలి? అన్న ప్రశ్న తలెత్తినప్పుడు ఈ ఖాళీగా ఉన్న బడిలో పెట్టాలి. ఒక లైబ్రరీని ఏర్పాటు చేయాలని ఉన్నది. ఈ స్థలంలో దాన్ని పెట్టవచ్చు. పిల్లలు ఆడుకోవడానికి కూడా వాటిని వినియోగించుకోవచ్చు. ఇవన్నీ రెండుమూడు కాలోమీటర్ల పరిధిలో ఉంటాయి కాబ్టటి ఇలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి బడిని కాపాడాలి. బడి అంటే పిల్లలకు పాఠాలు చెప్పడమే అనే భావనకు దూరంగా విభిన్నమైన ఆలోచనల ద్వారా సామాజిక కేంద్రం, ప్రజాస్వామ్యానికి తొలిమెట్టు అయిన బడిని మూసివేయవద్దు.
బడి మూసివేస్తే ఆ స్థలం కబ్జాలకు గురవుతుంది. చిన్న, పెద్ద బడి అయినా వాటికింద 1000 గజాల జాగా ఉంటుంది. అది పోతే తిరిగి మళ్లీ సేకరించడం సాధ్యం కాదు. ఇట్లా బడి మూసివేస్తే అనేక సమస్యలుంటాయి. గత ప్రభుత్వం ఈ విషయాలనేమీ పరిగణనలోకి తీసుకున్నట్టు లేదు. బడి అనేది ఒక సామాజిక వికాస కేంద్రం. గ్రామంలో అనేక ప్రజా ప్రయోజనాల కోసం బడిని వాడుకోవచ్చు. ప్రస్తుత ప్రభుత్వం మూసివేసిన బడులపై ఒక నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఒకరిద్దరు ఉంటే వారితోనే లేదా పక్కన ఉన్న గ్రామాల నుంచి కొంతమంది పిల్లలను తీసుకొచ్చి అయినా బడిని నడిపించాలి. భావి తరాల భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే బడులను కాపాడాలి. పిల్లల భవితకు బాటలు వేసేలా వాటిని తీర్చిదిద్దాలి.