Shabbir Ali | ఎందుకీ దొంగ ప్రేమ కేటీఆర్
మైనార్టీ షబ్బీర్ అలీకి మంత్రి పదవి ఇవ్వడం లేదని కేటీఆర్ మైనార్టీలపై దొంగ ప్రేమ ఒలకపోస్తున్నారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్ట్రాంగ్ కౌంటర్ వేశారు

- కేటీఆర్ విమర్శలపై షబ్బీర్ అలీ కౌంటర్
- మైనార్టీలకు బీఆరెస్ చేసిందేమి లేదు
- తెలంగాణను సొంత ఆస్తిలాగా వాడుకున్న కేటీఆర్
Shabbir Ali | విధాత : మైనార్టీ షబ్బీర్ అలీకి మంత్రి పదవి ఇవ్వడం లేదని కేటీఆర్ మైనార్టీలపై దొంగ ప్రేమ ఒలకపోస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. మంగళవారం షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ మీరు అధికారంలో వున్నప్పుడు మైనార్టీలకు ఏమి చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. మైనార్టీనైనా నేను పోటీ చేస్తే నా కామారెడ్డికి వచ్చి మీ అయ్యా ఎందుకు పోటీ చేసిండని నిలదీశారు. ఒక్క అమాయకుణ్ణి ఓడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారని విమర్శించారు. కేసీఆర్ అధికారంలో వున్నప్పుడు మైనార్టీలకు చేసిందేమి లేదని, నాకు కాంగ్రెస్ సర్కార్ సలహాదారులుగా నియమించిందన్నారు.
గతంలో మంత్రిని కూడా చేసిందన్నారు. కాంగ్రెస్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన మైనార్టీ నేతలు ఓడిపోవడంతో మంత్రివర్గంలో అవకాశం లేకుండా పోయిందన్నారు. అయినప్పటికి కాంగ్రెస్ మైనార్టీలకు అవకాశాలు ఇస్తుందన్నారు. ఇప్పటి వరకు వేసిన టీఎస్‌పీఎస్సీలో అవకాశమివ్వడంతో పాటు సుప్రీమ్ కోర్టులో ఏజీగా మైనార్టీకి అవకాశం ఇచ్చిందని, భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు ఇవ్వబోతుందన్నారు.
రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ప్రజలు ఆనందంగా ఉన్నారని, కేసీఆర్ నియంత పాలనను అంతమొందించిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు చెప్పారు.
కేసీఆర్‌ను ఓడించేందుకు ఎంతోమంది నాయకులు ప్రయత్నించారని, రేవంత్ చాలా ఈజీగా కేసీఆర్‌ను గద్దె దించారరన్నారు. రేవంత్ నాయకత్వాన్ని చూసి బీఆరెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు క్యూ కడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ తల దించుకోవాలి.. కేటీఆర్ దగ్గర ఎవరూ మిగలరని చెప్పారు. బీఆరెస్‌లో చాలా మంది డబ్బుల కోసమే బతుకుతారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ రేవంత్ కాలి గోటికి కూడా సరిపోరన్నారు. ఎన్నికల తర్వాత బీఆరెస్ కనిపించదన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఏ కారణం వల్ల ఓడిపోయారో చెప్పే దమ్ము, ధైర్యం కేసీఆర్, కేటీఆర్‌లకు ఉందా? అని ప్రశ్నించారు. సోనియా ఇచ్చిన తెలంగాణని తానే తెచ్చానని కేసీఆర్ డబ్బా కొట్టుకున్నాడని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ సిగ్గు శరం వదిలి ప్రజలని దోచుకున్నారని ఆరోపించారు. అందుకే ఇప్పుడు బయటకు రావడానికి కూడా జంకుతున్నాడని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ప్రభుత్వాన్ని సొంత ఆస్తి లాగా వాడుకున్నాడని తెలిపారు. రెడీగా ఉన్న పార్టీలో చేరి.. తండ్రి పేరు చెప్పుకొని పదవులు అనుభవించిన కేటీఆర్ త్యాగాలు చేసి అలిసిపోయినట్లు మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు. అమరవీరుల రక్తం తాగి వేలాది కొట్లు సంపాదించుకున్నారని అన్నారు. ఓడిపోయిన తెల్లారి నుండే బయటకి వచ్చి ఓటమిని జీర్ణించుకోలేక ఇష్టమొచ్చినట్టు కేటీఆర్ మాట్లాడుతున్నారని తెలిపారు. విలువల్లేని మనుషులు కేసీఆర్ కుటుంబ సభ్యులని ఘాటు వ్యాఖ్యలు చేశారు.