సింగరేణి ఎన్నికలపై సందిగ్ధత.. ప్రభుత్వం అయోమయ పరిస్థితి

- కార్మికుల తీర్పుపై ఆందోళన
- ఓటమి పాలైతే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం?
- ఆ తర్వాత నిర్వహణకు మొగ్గు?
- ఇది వరకే జారీ చేసిన నోటిఫికేషన్ పై మల్లగుల్లాలు
- – స్టే కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించే యోచన?
విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు ఎట్టకేలకు నోటిఫికేషన్ జారీ చేసినా, కార్మికుల్లో సందిగ్ధత కొనసాగుతోంది. నాలుగేళ్లుగా యాజమాన్యం దోబూచులాడుతూ జాప్యం చేస్తూ వచ్చింది. రెండేళ్ల కాల పరిమితితో చివరిసారిగా 2017 సెప్టెంబర్ లో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. అప్పట్లో గెలిచిన టీజీబీకేఎస్ యూనియన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
నాలుగేళ్ల పాటు కాల పరిమితిని పొడిగించాలని కోరింది. ఈ నేపథ్యంలో 2021కి ఆ నాలుగేళ్ల కాల పరిమితి కూడా పూర్తయి, రెండేళ్లవుతోంది. మొదటిసారి గుర్తింపు సంఘం ఎన్నికలు సెప్టెంబర్ 98లో నిర్వహించినప్పుడు కార్మికుల సంఖ్య 1,08,212 మంది ఉండేది. దశలవారీగా నేటికి 42 వేల మంది కార్మికులు మాత్రమే ఉన్నారు. పర్మనెంట్ కార్మికుల సంఖ్య కుదిస్తూ, కాంట్రాక్టు కార్మికుల సంఖ్య పెంచుకుంటూ వచ్చారు.
ఇప్పటికీ 6 సార్లు సింగరేణి ఎన్నికలు
1998 సెప్టెంబరు 9న మొదటిసారి జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ గెలిచింది.
2001 ఫిబ్రవరి 19న రెండోసారి ఎన్నికల్లోనూ ఏఐటీయూసీ విజయం సాధించింది.
2003 మే 14న మూడోసారి ఎన్నికలు నిర్వహించగా, కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ జెండా ఎగరేసింది.
2007 ఆగస్టు 9న నాలుగోసారి ఏఐటీయూసీ మళ్లీ స్థానాన్ని నిలబెట్టుకుంది.
2012 జూన్ 28న జరిగిన ఐదో దఫా ఎన్నకల్లో టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచింది
2017 అక్టోబరు 5న ఆరోసారి టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచింది.
7వ ధపా ఎన్నికలకు ఆటంకాలు ఏర్పడ్డాయి.
కోర్టు తీర్పుతో దిగివచ్చిన యాజమాన్యం
ఎన్నికలు నిర్వహణకు రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం జోక్యంతో సింగరేణి యాజమాన్యం రకరకాల కారణాలతో వెనుకడుగు వేసింది. 18 నెలల పాటు కాలయాపన చేసిందనే ఆరోపణన్నాయి. 2021 నుంచి కరోనా, ఉత్పత్తి ఉత్పాదకత అంశాలను తెరపైకి తెచ్చి, యాజమాన్యం వాయిదా వేస్తూ వచ్చింది. చివరిసారి ఎన్నికలు జరిగి నేటికీ ఆరేళ్లు గడుస్తున్నా, యజమాన్యం ఎన్నికలు నిర్వహించడంలో నిర్లక్ష్యంగా ఉందని కార్మిక సంఘాలు మండి పడ్డాయి. గత ఏడాది నవంబర్ లో మరో సింగరేణి ట్రేడ్ యూనియన్ హైకోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం సింగరేణి యజమాన్యానికి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ఫిబ్రవరిలో సాధ్యం కాదని, సంస్థకు ఉత్పత్తికి విఘాతం కలుగుతుందని కోర్టుకు తెలియజేసి, ఆగస్టు కు వాయిదా పడింది. మళ్లీ కోర్టు ద్వారా అక్టోబర్ వరకు ఎన్నికలు నిర్వహించడానికి గడువు కోరింది. సెప్టెంబర్ 11న సెంట్రల్ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ 14 కార్మిక సంఘాలు, యజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేసి సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించడానికి విధివిధానాలు సిద్ధం చేసి, షెడ్యూల్డ్ నోటిఫికేషన్ విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రకటించడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో వేజ్ బోర్డు ఏరియర్స్ బకాయిలు చెల్లింపులు అడ్డంకిగా చూపింది. మళ్ళీ కోర్టును ఆశ్రయించి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మరికొంత గడువు కావాలని కోరడంతో న్యాయస్థానం అందుకు నిరాకరించింది. ఈ క్రమంలో గత బుధవారం అక్టోబర్ 28న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ లేబర్ కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేశారు.
యాజమాన్యం ఎన్నికలు నిర్వహించేనా ?
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు సింగరేణి యాజమాన్యం నిర్వహించేందుకు సిద్ధంగా లేదన్న చర్చ కార్మిక వర్గంలో నెలకుంది. ఇందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల ముందు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నిక నిర్వహిస్తే, సింగరేణి కార్మికులు బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ కు వ్యతిరేకంగా ఓట్లు వేసినట్లయితే దాని ప్రభావం తెలంగాణ వ్యాప్తంగా ఉండే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదన్న ప్రచారం కొనసాగుతోంది. 2017 గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేస్ గెలిచినప్పటికీ, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ సింగరేణి పరిధిలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడింటిని మాత్రమే గెలుచుకోగలిగింది.
అందులో మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాలు ఉన్నాయి. మిగతా పది చోట్ల పార్టీ గెలువ లేకపోయింది. టీబీజీకేస్ గెలిచినప్పటికీ సింగరేణి ప్రాంతాల్లో టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా తీర్పు రాలేదు. అలాంటిది ఇప్పుడు సింగరేణి ఎన్నికలు నిర్వహిస్తే ఒకవేళ టీబీజీకేఎస్ ఓటమిపాలైతే దాని ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందనే విషయాన్ని గమనంలోకి తీసుకొని సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించటానికి ప్రభుత్వం సుముఖంగా లేదని పలువురు భావిస్తున్నారు. మరోవైపు కేంద్ర లేబర్ కమిషన్ సమావేశానికి హాజరుకాని మిగతా 12 కార్మిక సంఘాలు సింగరేణి యజమాన్యం ఎన్నికలను వాయిదా వేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
స్టే కోసం యాజమాన్యం పాట్లు?
సింగరేణి యాజమాన్యం అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లి సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను వాయిదా వేయించడానికి కసరత్తు చేస్తున్నట్టు ప్రచారం కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల అంశంతో పాటు అసెంబ్లీ ఎన్నికలు తదితర అంశాలను అత్యున్నత న్యాయస్థానం ముందు ఉంచి సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను వాయిదా వేయించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. అత్యున్నత న్యాయస్థానం కనుక సింగరేణి ఎన్నికల గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణపై స్టే ఇచ్చినట్లయితే, సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికల అనంతరమే జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ న్యాయస్థానం ససేమిరా ఆదేశాలు పాటించాలని చెప్పినట్లయితే అక్టోబర్ 28న సింగరేణి ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిలిపివేత? నిర్వహణ? అనేది మరో వారం రోజుల్లో తేలనుంది.