ఉమ్మడి వరంగల్ లో ఆరు స్థానాలు అగ్రకులాలకు

ఉమ్మడి వరంగల్ లో ఆరు స్థానాలు అగ్రకులాలకు

– బీసీలకు ఓకే స్థానం

– ఐదు స్థానాలు రిజర్వుడు

– 11 స్థానాల్లో నాలుగు మహిళలకు

– ఆశావహుల్లో అసంతృప్తి

– నాలుగు కొత్త వారికి అవకాశం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 స్థానాలకు గాను మొదటి విడత నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ రెండో విడత ఏడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక డోర్నకల్ స్థానం ఒకటి పెండింగ్లో పెట్టారు. శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన రెండవ జాబితాలో కొమ్మూరి ప్రతాపరెడ్డి (జనగామ), నాయిని రాజేందర్ రెడ్డి (వరంగల్ పశ్చిమ), కొండా సురేఖ (వరంగల్ తూర్పు), కే ఆర్ నాగరాజు (వర్ధన్నపేట), యశస్విని (పాలకుర్తి), డాక్టర్ మురళి నాయక్ (మహబూబాబాద్), రేవూరి ప్రకాష్ రెడ్డి (పరకాల) స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించారు. తొలివిడత స్టేషన్గన్పూర్, ములుగు, భూపాలపల్లి, నర్సంపేట నియోజకవర్గాలకు అభ్యర్థులుగా సింగపురం ఇందిర, ధనసరి సీతక్క, గండ్ర సత్యనారాయణ రావు, దొంతి మాధవరెడ్డి లకు అవకాశం కల్పించారు. తాజాగా ఏడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి డోర్నకల్ స్థానాన్ని పెండింగ్లో పెట్టారు. గత ఎన్నికల్లో పరకాల నుంచి పోటీ చేసిన కొండా సురేఖ ఈసారి తూర్పు టికెట్ దక్కించుకుంది.

ఆరు స్థానాలు అగ్రవర్ణాలకు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఏడు స్థానాలు జనరల్ కాగా, రెండు స్థానాలు ఎస్సీ రిజర్వుడు, మూడు స్థానాలు ఎస్టీ రిజర్వుడుగా ఉన్నాయి. ప్రస్తుతం రెండు విడతలుగా 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఎస్టీ రిజర్వుడు డోర్నకల్ స్థానాన్ని పెండింగ్లో పెట్టారు. ఏడు జనరల్ స్థానాల్లో ఆరు స్థానాలను అగ్రవర్ణాలకు, అందులో ఆరు ఐదు స్థానాలు రెడ్డి సామాజిక వర్గానికి, ఒక స్థానాన్ని వెలమ సామాజిక వర్గానికి కేటాయించగా, ఒక స్థానం వరంగల్ తూర్పును బీసీ కి కేటాయించారు. సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

నాలుగు స్థానాలు మహిళలకు

11 స్థానాల్లో నాలుగింటిని మహిళలకు కేటాయించారు. మహిళల్లో ఒకటి రెడ్డికి, ఒకటి బీసీ, ఒకటి ఎస్సీ, ఒకటి ఎస్టీకి కేటాయించారు. రెండో విడత ప్రకటించిన ఏడు స్థానాల్లో నలుగురు యశస్విని, కే ఆర్ నాగరాజు, డాక్టర్ మురళి నాయక్, నాయిని రాజేందర్ రెడ్డి కొత్తవారు కాగా, ముగ్గురు కొమ్మూరు ప్రతాపరెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, కొండా సురేఖ పాతవారు ఉన్నారు.

ఆశావహుల్లో అసంతృప్తి

వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ, మానుకోట, పరకాల స్థానాల్లో టికెట్ ఆశించిన నమిండ్ల శ్రీనివాస్, జంగా రాఘవరెడ్డి, బలరాం నాయక్, బెల్లయ్య నాయక్, ఇనుగాల వెంకటరామిరెడ్డి తదితరులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అసంతృప్తులు ఏ నిర్ణయం తీసుకుంటారనేది తర్వాత తేలనుంది. ఇటీవల పార్టీలో చేరిన వారిలో కె ఆర్ నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, యశస్విని రెడ్డి లకు టికెట్ దక్కింది.