కార్పొరేట్లకు వ్యవసాయ రంగం తాకట్టు: కిసాన్ మోర్చా

- కేంద్ర ప్రభుత్వం కుట్ర
- 3 నల్ల చట్టాలను సంపూర్ణంగా రద్దు చేయాలి
- జాతీయ విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలి
- సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టే కేంద్ర ప్రభుత్వ కుట్రలను తీవ్రంగా వ్యతిరేకించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేయం) నాయకులు డిమాండ్ చేశారు. ఎస్కేఎం ఆధ్వర్యంలో రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల వరంగల్ జిల్లా సదస్సు శివనగర్ కుసుమ రఘునాథ్ భవనంలో మంగళవారం జరిగింది.
ఈ సదస్సులో రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, ఏఐకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, ఏఐకెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల బిక్షపతి, రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ మాట్లాడారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, జాతీయ విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్ శక్తుల నుంచి కాపాడుకోవడం కోసం రైతులు పండించిన పంటలకు కనీస మద్దతుధరల గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని కోరారు.
దేశవ్యాప్తంగా ఎస్కేయం ఆధ్వర్యంలో కార్పొరేట్ శక్తుల నుండి వ్యవసాయ రంగాన్ని కాపాడేందుకు 2020 నుంచి పెద్ద ఎత్తున రైతాంగ ఉద్యమం కొనసాగిందని, ఉద్యమ ఒత్తిడికి లొంగి నరేంద్ర మోడీ ప్రభుత్వం రాతపూర్వక హామీతో ఢిల్లీ పోరాటం తాత్కాలిక విరమణ జరిగిందని వారన్నారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర చట్టాన్ని చేయడం కోసం రైతు సంఘాల నుండి ప్రతినిధులుగా ఎంపిక చేసి, కేంద్రం చర్చించి రైతాంగానికి న్యాయం చేస్తుందని హామీనిచ్చి ప్రధాని మోడీ మెగా మోసానికి పాల్పడుతున్నాడని దుయ్యబట్టారు.
బీజేపీ పాసిస్టు పాలన
మధ్యప్రదేశ్ రాష్ట్రం మందసౌర్ మార్కెట్లో రైతులని కాల్చి చంపిన బీజేపీ పాసిస్టు పాలనను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతాంగం ఏఐకేఎస్ సీసీ గా, ఎస్కేయంగా ఏర్పడి 500 పైగా రైతు, కార్మిక సంఘాలు 14 నెలలపాటు రోడ్డుపై బైఠాయించిన చారిత్రాత్మక రైతాంగ ఉద్యమమని వారు కీర్తించారు. ఈ మహత్తర రైతాంగ ఉద్యమం ప్రపంచ చరిత్రలోనే నిలిచిపోతుందని, అనేక పోరాటాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని వారు అన్నారు.
బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు చట్టాలతో పాటు, విద్యుత్ బిల్లు వల్ల దేశంలో ప్రత్యక్ష భాగస్వాములైన రైతాంగం 14 కోట్లకు పైగా, వ్యవసాయ కార్మిక వర్గం 15 కోట్లకు పైగా, వీరితో పాటు పరోక్షంగా 30 కోట్లకు పైగా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్న అందరి బతుకులు రోడ్డున పడేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ నల్ల చట్టాలను తీసుకువచ్చిందని విమర్శించారు.
నరేంద్ర మోడీ మోసపూరిత విధానాలను ఎండగడుతూ ఢిల్లీ కేంద్రంగా 2023 నవంబర్ 26, 27, 28 తేదీల్లో మరో రైతాంగ పోరాటానికి శ్రీకారం చుట్టాలని ఎస్కేయం నిర్ణయించిందని వారన్నారు. రైతాంగ పోరాటంలో ప్రజలందరూ పాల్గొని నరేంద్ర మోడీ మెడలు వంచాలని వారు పిలుపునిచ్చారు. సమావేశానికి ముందు హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కు నివాళులర్పించారు.
ఎస్కేఎం జిల్లా కన్వీనర్ల ఎంపిక
రైతు సంఘాల జిల్లా సదస్సులో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) వరంగల్ జిల్లా కన్వీనర్లుగా ఈసంపల్లి బాబు, కుసుంబా బాబురావు, వీరగోని శంకరయ్య, రాచర్ల బాలరాజు, ఓదెల రాజన్న, భూక్య సమ్మయ్య, మంద రవిలతోపాటు మరికొన్ని సంఘాల బాధ్యులను కలుపుకొని కమిటీని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో ఎస్కేయూ రాష్ట్ర నాయకులు మూడు శోభన్ నాయక్, జిల్లా నాయకులు నాగెల్లి కొమురయ్య, నెట్టెం నారాయణ, కోరబోయిన కుమారస్వామి, సింగతి మల్లికార్జున్, ఊరటి అంశాల రెడ్డి, పీరయ్య, సారంగపాణి, ఐతం నాగేష్, ప్రేమలత, గోవర్ధన్, రైతు సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.