సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌కు ఐదు నెలల జైలు.. పది లక్షల జరిమానా

23 ఏళ్ల నాటి నష్టపరిహారం కేసులో ప్రముఖ సామాజిక కార్యకర్త మేధాపాట్కర్‌కు ఢిల్లీలోని మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఐదు నెలల సాధారణ కారాగారాన్ని విధించింది. పది లక్షల జరిమానా కట్టాలని ఆదేశించింది.

  • Publish Date - July 1, 2024 / 06:25 PM IST

న్యూఢిల్లీ : 23 ఏళ్ల నాటి నష్టపరిహారం కేసులో ప్రముఖ సామాజిక కార్యకర్త మేధాపాట్కర్‌కు ఢిల్లీలోని మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఐదు నెలల సాధారణ కారాగారాన్ని విధించింది. పది లక్షల జరిమానా కట్టాలని ఆదేశించింది. ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా గుజరాత్‌లోని ఒక ఎన్జీవోను నడుపుతున్న సమయంలో ఆమెపై 23 ఏళ్ల క్రితం ఈ కేసు వేశారు. ఈ కేసులో సాక్ష్యాలు ఉన్నాయని చెబుతూ.. ఈ కేసు విచారణకు రెండు దశాబ్దాల సుదీర్ఘ విచారణ జరిగిన విషయాన్ని మేజిస్ట్రేట్‌ రాఘవ్‌ శర్మ ప్రస్తావించారు. అయితే.. శిక్షను నెలపాటు నిలిపివేస్తూ.. పైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ప్రొబేషన్‌ షరతులపై తనను విడుదల చేయాలన్న మేధాపాట్కర్‌ విజ్ఞప్తిని మేజిస్ట్రేట్‌ తిరస్కరించారు. నష్టాలు, ఆమె వయసు, అనారోగ్యం తదితర వాస్తవాలను పరిగణనలోకి తీసుకుంటూ గరిష్ఠ శిక్ష విధించడం లేదని తెలిపారు. ఈ నేరంపై గరిష్ఠంగా రెండేళ్ల వరకూ జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉంటుంది.
సక్సేనాను ‘పిరికిపంద’ అని అభివర్ణించడమే కాకుండా హవాలా లావాదేవీల్లో ఆయన భాగస్వామ్యం ఉన్నదని ఆరోపించడం ద్వారా ఆయన పరువుకు భంగం కలిగించడమే కాకుండా ఆయన గురించి వ్యతిరేక భావనలను సృష్టించే ప్రయత్నం చేశారని మే 24న విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. శిక్ష పరిమాణంపై మే 30న వాదనలు జరిగాయి. జూన్‌ 7వ తేదీన తీర్పు రిజర్వ్‌ చేశారు. 2000 సంవత్సరం నుంచి పాట్కర్‌, సక్సేనా న్యాయపోరాటంలో ఉన్నారు. నర్మదా బచావో ఆందోళన్‌పై, తనపై వాణిజ్య ప్రకటనలు ప్రచురించడాన్ని సవాలు చేస్తూ సక్సేనాపై మేధా పాట్కర్‌ కేసు వేశారు. తనపై మేధాపాట్కర్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ అప్పట్లో కౌన్సిల్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహించిన సక్సేనా కేసు వేశారు.

Latest News