మాణిక్యాలను ప్రపంచానికి అందిస్తున్న ‘శ్రీగురుకులం’: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
విద్యలో అమ్మాయిల ముందంజ గురుకులాలకు ప్రభుత్వం పెద్ద పీట విధాత, వరంగల్: శ్రీ గురుకుల పాఠశాలలో చదివిన విద్యార్థులు ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ ఒకే తాటిపై నిలబడటం ఎంతో గొప్ప విషయమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం మహేశ్వరం శ్రీ గురుకుల విద్యాలయంలో శనివారం రాత్రి జరిగిన స్వర్ణోత్సవ సంబురాలలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన […]

- విద్యలో అమ్మాయిల ముందంజ
- గురుకులాలకు ప్రభుత్వం పెద్ద పీట
విధాత, వరంగల్: శ్రీ గురుకుల పాఠశాలలో చదివిన విద్యార్థులు ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ ఒకే తాటిపై నిలబడటం ఎంతో గొప్ప విషయమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం మహేశ్వరం శ్రీ గురుకుల విద్యాలయంలో శనివారం రాత్రి జరిగిన స్వర్ణోత్సవ సంబురాలలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సమ్మిరెడ్డి, అధిక సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీగురుకులం ప్రతిభ ప్రపంచాన్ని చుట్టి రావడం గర్వంగా ఉందన్నారు. ఈ పాఠశాలలో చదివి దేశ, విదేశాల్లో, మన దేశంలో వివిధ రాష్ట్రాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న అందరిని మంత్రి అభినందించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా పాఠశాల పేరును నిలబెడుతూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు పెట్టమని చెబుతుంటారని మంత్రి గుర్తు చేసారు.సేవా దృక్పథంతో 50 ఏళ్ళ కిందట మహేశ్వరం గ్రామంలో శ్రీ గురుకులం స్థాపించి, మట్టిలో మాణిక్యాలను ప్రపంచానికి అందించటం ఎంతో గొప్ప విషయం అని కొనియాడారు.
అమ్మాయిల ముందంజ
గతంలో అమ్మాయిల శాతం చాలా తక్కువగా ఉండేదని, నేడు యూనివర్సిటీలు, గురుకులాలు ఎక్కడా చూసినా అమ్మాయిలే కనిపించడం శుభపరిణాం అని మంత్రి సబిత తెలిపారు. కేవలం 5 గురితో ఆరంభించి నేడు వేలాది మందికి దారి చూపడంతో పాటు, దేశం నలుమూలలా శ్రీ గురుకులం విద్యార్థులే ఉండటం హర్షణీయమని అన్నారు.
తెలంగాణ విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడకు వెళ్లిన ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అని అన్నారు. ఏర్పాటు చేస్తున్న గురుకులాలు, ఇతర విద్యా సంస్థలు అందుకు నిదర్శనమన్నారు. రానున్న కాలంలో అన్ని దేశాల్లో, అన్నిరంగాల్లో తెలంగాణ విద్యార్థులే కనిపిస్తారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
సంకల్పం గట్టిగా ఉంటే ఫలితం అదే వస్తుందని, కేవలం ఒక విద్యాలయంతోనే ఎక్కడ చూసినా శ్రీ గురుకులం విద్యార్థులే కనిపిస్తున్నారు అంటే దాని వెనుక దాగి ఉన్న కృషిని గుర్తించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సాధించి, సాధించిన తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నారని అన్నారు.
రాష్ట్రంలో వేయికి పై చిలుకు గురుకులాలు స్థాపించి, అందులో ఎస్ సి, బీసీ, మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యా అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా 1150 జూనియర్ గురుకుల కళాశాలలు, 85 డిగ్రీ , పీజీ, లా కళాశాలలు స్థాపించారన్నారు. ఈ సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్థులు రూపొందించిన పుస్తకాన్ని మంత్రి, ఎమ్మెల్యే ఆవిష్కరించారు.