వారసులు వస్తున్నారు!

- అన్ని పార్టీల్లోనూ వారసత్వ రాజకీయాలు
- కుటుంబ పార్టీలన్న విమర్శలు ఇతరులకే…
- కొడుకులు, కూతుళ్ల కోసం ప్రయత్నాలు
- వారసుల కోసం శ్రమిస్తున్న నాయకులు
- రాజకీయాల్లోకి డీకే అరుణ కూతురు
- చిట్టెం నర్సిరెడ్డి మనవరాలి అరంగేట్రం
- ఈ ఎన్నికల్లో 30 మందికి పైగా వారసులు
- కంటోన్మెంట్‌లో సాయన్న కుమార్తె లాస్య
- కాంగ్రెస్ నుంచి గద్దర్ కుమార్తె వెన్నెల
నెహ్రూగారి కుమార్తె ఇందిరాగాంధీ కుమారుడు రాజీవ్‌గాంధీ భార్య సోనియాగాంధీ కుమారుడైన రాహుల్‌గాంధీ కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడటమా? అని మంత్రి కేటీఆర్ నిలదీస్తారు! బీఆరెస్‌లో కేసీఆర్ కుటుంబం రాజకీయ పదవులు అనుభవిస్తున్నారని రాహుల్ మండిపడతారు! ఈ రెండు పార్టీలూ కుటుంబ పార్టీలే అనే బీజేపీలో సీనియర్ నేతల పిల్లలు రాజకీయాల్లో, ముఖ్యమైన పదవుల్లో ఉన్నారు. కానీ.. మీది కుటుంబ పార్టీ అంటే.. కాదు మీదే కుటుంబ పార్టీ అని అన్ని పార్టీలూ దుమ్మెత్తి పోసుకుంటాయి. మరోవైపు ఆయా పార్టీల్లో వారసత్వ రాజకీయాలు గొప్పగా వర్ధిల్లుతుంటాయి. తెలంగాణలో ఈ ఎన్నికల్లోనూ వారసత్వ రాజకీయాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ కుటుంబంలో ఆయనతోపాటు కేటీఆర్, హరీశ్‌రావు బరిలో నిలుస్తున్నారు. కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్.. ఎన్నికల అనంతరం ఆ సీటును తన కుమార్తెకు ఇస్తారన్న ప్రచారం జరుగుతున్నది. మొత్తంగా దాదాపు 30 మంది వారసులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
విధాత ప్రతినిధి, హైదరాబాద్ : వారసత్వ రాజకీయాలు! దీని చుట్టూ చాలా చర్చలే నడుస్తుంటాయి. ఎన్నికల సమయంలో మరికొంత గట్టిగానే వినిపిస్తుంటాయి. ఎదుటి పార్టీలను కుటుంబ పార్టీలని విమర్శించే పార్టీల్లోని నేతలు.. తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకు వచ్చేందుకు తమ వంతు ప్రయత్నాల్లో ఉంటారు. వారసత్వ రాజకీయాలపై విమర్శలు ఎదుటివారిని ఉద్దేశించేందుకే తప్ప తమకు వర్తించవన్న భావనలో ఉంటారు. రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలతోపాటు, ఎంఐఎంలోనూ తదుపరి తరాన్ని రంగంలోకి దించే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలేనని, వాటి వల్ల అభివృద్ధికి విఘాతం కలుగుతున్నదని ప్రధాని మోదీ తరుచూ విమర్శలు చేస్తుంటారు. కానీ బీజేపీ కూడా వారసత్వ రాజకీయాలకు భిన్నమైంది కాదని మరోసారి రుజువైంది. తాజాగా మహబూబ్‌నగర్ నియోజక వర్గానికి మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత జితేందర్‌రెడ్డి తన కుమారుడు మిథున్ రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు. తన రాజకీయ వారసుడిగా ప్రకటించుకున్నారు. ఇలా ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడిన పార్టీలన్నీఆ దారిలోనే నడుస్తున్నాయి. ఇందులో ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. అన్ని పార్టీలు ఒకే తాను ముక్కలే.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం అన్నిపార్టీల నేతలు తమ రాజకీయ వారసులను చాలా రోజుల కిందటే తెరమీదికి తీసుకువచ్చాయి. కేసీఆర్ కుటుంబంలో కేటీఆర్, కవిత, హరీశ్‌రావు, సంతోష్ ఇలా అందరికీ దాదాపు పదవులు దక్కాయి. ఎంఐఎంలో సలావుద్దీన్ ఒవైసీ తర్వాత ఆయన వారసులు అసదుద్దీన్ హైదరాబాద్ ఎంపీగా, అక్బరుద్దీన్ చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యేగా ఉన్నారు. తాజాగా మూడోతరం వారసుడిని రంగంలోకి దించే ప్రయత్నాల్లో ఉన్నారు. జిల్లాల వారీగా చూస్తే దాదాపు 30 మంది దాకా వారసులు ఈసారి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తన వారసుడు భాస్కర్‌రెడ్డిని ఈసారి ఎన్నికల్లో నిలుపాలని భావించారు. ప్రస్తుతం భాస్కర్‌రెడ్డి డీసీసీబీ చైర్మన్. ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి లైన్ క్లియర్ చేసుకునే పనిలో ఉండగానే నిజామాబాద్ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్.. శ్రీనివాసరెడ్డినే పోటీ చేయాలని కోరారు. ఆ మేరకు ఆయనకే టికెట్ ఖరారు చేశారు. అయితే.. ఇక్కడ పోచారం రాజకీయ వారసుడు సహజంగా భాస్కర్‌రెడ్డే. ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కుమారుడు జగన్‌మోహన్ ప్రస్తుతం జడ్పీటీసీగా ఉన్నారు. బాజిరెడ్డి తన కుమారుడిని ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయించాలనుకున్నా వీలుకాలేదు. ఉమ్మడి నల్లొండ జిల్లాలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్‌రెడ్డిని మునుగోడు నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలనుకున్నారు. పార్టీ అధిష్ఠానం కూడా ఆయనను అక్కడ పనిచేసుకోమని చెప్పినట్టు తెలిసింది. అయితే సిటింగ్‌లకే టికెట్లు అన్న మాటకు కట్టుబడి కేసీఆర్ కూసుకుంట్లకే టికెట్ ఖరారు చేశారు. అన్నికుదిరితే అమిత్‌రెడ్డి నల్లగొండ లోక్‌సభ స్థానానికి పోటీ చేయవచ్చని తెలుస్తున్నది.
ఇక ఇదే జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ రాజకీయాల్లో ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో వెంకట్‌రెడ్డి నల్లగొండ నుంచి పోటీ చేయనుండగా ఇటీవలే బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్‌లో చేరిన రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి పోటీ చేస్తున్నారు. జానారెడ్డి కుమారులిద్దరినీ పోటీ చేయించాలకున్నారు. అయితే మొదటి లిస్టులో చిన్న కొడుకు జైవీర్ రెడ్డికి ఆ పార్టీ అధిష్ఠానం నాగార్జునసాగర్ టికెట్ ఇచ్చింది. పెద్ద కుమారుడు రఘువీర్‌రెడ్డిని కూడా రాజకీయాల్లోకి తీసుకురావడానికి జానారెడ్డి గట్టి ప్రయత్నాల్లోనే ఉన్నరు.
కరీంనగర్ జిల్లాలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తన కుమారుడు డాక్టర్ సంజీవ్‌ను తెరపైకి తెచ్చారు. పార్టీ అధిష్ఠానం ఆయనకే టికెట్ కేటాయించడం గమనార్హం. అదే స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ ఖరారు చేసిన జువ్వాడి నర్సింగరావు మాజీ మంత్రి రత్నాకర్‌రావు కుమారుడే. మంథనిలో శ్రీపాదరావు వారసుడిగా శ్రీధర్‌బాబు అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ వికాస్ రావు కూడా బీజేపీలో చేరారు. ఆయన ఈసారి కోరుట్ల నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నది. ఇదే జిల్లాలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ తండ్రి సీహెచ్ రాజేశ్వరరావు సీపీఐలో కీలక నేతగా ఉన్న సంగతి తెలిసిందే. తర్వాత కాలంలో ఆయన టీడీపీలో చేరారు. ఆయన వారసుడిగా రమేశ్ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ కురువృద్ధుడు గడ్డం వెంకటస్వామి వారుసులుగా వివేక్, వినోద్ ఇద్దరూ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. వినోద్ కాంగ్రెస్ తరఫున బెల్లంపల్లి బరిలో ఉండగా, వివేక్ బీజేపీలో ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మాజీ మంత్రి జోగు రామన్న కుమారుడు ప్రేమేందర్, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కుమారుడు గౌతమ్‌రెడ్డి కూడా రాజకీయాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాజీ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి తనయుడు ప్రశాంత్ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కూతురు కావ్య కూడా స్టేషన్ ఘన్‌పూర్ నుంచి పోటీ చేయాలని భావించి, అక్కడ చాలారోజులుగా పనిచేస్తున్నారు. మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి రాజకీయాల్లో ఉన్నారు. వారి కుమార్తె సుస్మిత పటేల్‌ను రాజకీయాల్లోకి తీసుకు రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ మంత్రి అజ్మీరా చందులాల్ తనయుడు కూడా ములుగు టికెట్ ఆశించారు. కానీ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా జడ్పీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి పేరు ప్రకటించడంతో ఆయన బీజేపీలో చేరారు. ఆ పార్టీ టికెట్ ఇస్తే ఆయన అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో మాజీ మంత్రి డీకే అరుణ.. తండ్రి చిట్టెం నర్సిరెడ్డి రాజకీయ వారుసురాలే. అరుణ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా పదవిలో ఉన్నారు. రాష్ట్రంలో ఆ పార్టీ కీలకనేతల్లో ఒకరిగా బిజీగా ఉండటంతో గద్వాల జిల్లాతో పాటు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను కుమార్తె స్నిగ్ధారెడ్డి చూసుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ఆమె బీజేపీ తరపున గద్వాల నుంచి పోటీ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కాగా డీకే అరుణ మేన కోడలు, చిట్టెంనర్సింరెడ్డి మనుమరాలు పర్ణిక రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణ పేట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డికి బీజేపీ మహబూబ్‌నగర్ టికెట్ ఇచ్చింది. మైనంపల్లి హన్మంతరావు తన కుమారుడికి రాజకీయాల్లోకి తీసుకు రావడం కోసమే బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యారు. మల్కాజిగిరి నుంచి ఆయన పోటీ చేస్తూ, కొడుకు రోహిత్‌కు మెదక్ సీటు సాధించుకున్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ పార్టీల నేతలు తమ వారసులను ఇప్పటికే పోటీ చేయించగా మరికొంతమందికి వేరే పదవులు ఇప్పించారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ కేంద్రమంత్రి, మొదటి దశ తెలంగాణ ఉద్యమ నాయకులలో ఒకడైన దివంగత మల్లికార్జున్ సోదరుడి కుమారుడు జగదీశ్వర్ గౌడ్ శేరిలింగం పల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆరెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందిత పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రజాగాయకుడు గద్దర్ కూతురు వెన్నెల పోటీ చేస్తున్నారు. మంత్రి మహేందర్‌రెడ్డి సతీమణి సునీతా మహేందర్‌రెడ్డి జడ్పీ చైర్‌పర్సన్‌గా ఉండగా, ఆయన తమ్ముడు నరేందర్‌రెడ్డి ప్రస్తుతం కొడంగల్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ మరోసారి అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్ 2019 ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మిని తన వారసురాలిగా ముషీరాబాద్ నుంచి పోటీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే స్థానంలో గతంలో ప్రాతినిధ్యం వహించిన నాయిని నర్సింహారెడ్డి వారసుడిగా ఆయన అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నా సిట్టింగ్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ నే పార్టీ అధిష్ఠానం బరిలోకి దించింది. పీజేఆర్ వారసులు మాజీ ఎమ్మల్యే విష్ణువర్ధన్‌రెడ్డి, కార్పొరేటర్ విజయారెడ్డి ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విజయారెడ్డికి ఖైరతాబాద్ టికెట్ ఇచ్చింది. ఇలా అన్నిపార్టీల్లో రాజకీయ వారసులు ఈసారి ఎన్నికల బరిలో ఉన్నారు. వారిలో ఎంతమందిని ప్రజలు ఆదరిస్తారు అన్నది డిసెంబర్ 3న తేలుతుంది.