Revanth Reddy Vote For Note Case | సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు పిటిషన్ విచారణ వాయిదా
సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు అక్టోబర్ 14కి వాయిదా వేసింది. కేసు 2015 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినది.

విధాత : ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు ఆక్టోబర్ 14కి వాయిదా వేసింది. ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదంటూ సుప్రీంలో సీఎం రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అటు ఈ కేసుకి తనకి ఎలాంటి సంబంధం లేదని రెండేళ్ల తర్వాత తనని ఉద్దేశపూర్వకంగా ఇరికించారని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్ లను విచారించిన న్యాయమూర్తి జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబర్ 14కి వాయిదా వేసింది.
2015 ఫిబ్రవరి 27న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు వ్యవహారం బయటికొచ్చింది. అప్పటి టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో ఇద్దరు సహచరులతో కలిసి నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్‌కు రూ.50 లక్షలు ఇచ్చి ఓటు తీసుకోవడానికి ప్రయత్నించినట్టు వీడియో ఫుటేజ్ బయటపడింది. ఈ ఘటన అప్పట్లో పెద్ద సంచలనం రేపింది. దీనిపై కేసు పెట్టిన అప్పటి ప్రభుత్వం రేవంత్ రెడ్డిని ఏ-1గా, రాజేందర్ ను ఏ-2గా, సంతోష్ ను ఏ-3గా చేర్చింది. అలాగే జెరూసలెం మత్తయ్యను ఏ-4గా నమోదు చేసింది. కేసు ఏసీబీకి బదిలీ అయిన తర్వాత 2016లో తన పేరును కేసు నుంచి తొలగించాలంటూ మత్తయ్య తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు అతని పిటిషన్‌ను అంగీకరించి, ఎఫ్‌ఐఆర్, చార్జ్‌షీట్‌లో అతని పేరును క్వాష్ చేసింది. దీనిని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం, ఎల్విస్ స్టెఫెన్సన్ 2016లోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో హైకోర్టు తీర్పును శుక్రవారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ బీఆర్. గవాయ్ ధర్మాసనం సమర్థించింది. ప్రభుత్వ పిటిషన్ ను కొట్టివేసింది.