అవినీతి కేసులో ముగ్గురు పోలీసు అధికారులపై సస్పెన్షన్‌ వేటు

అవినీతి కేసులో ముగ్గురు పోలీసు అధికారులపై సస్పెన్షన్‌ వేటు
  • గంజాయి స్మగ్లర్ల నుంచి డబ్బు వసూళ్లు


విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గంజాయి స్మగ్లర్ల నుండి డబ్బులు వసూళ్లకు పాల్పడినందుకు కేయూసీ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ కే వాసు, ఇద్దరు హోంగార్డులు బీ అనిల్, జీ అనిల్ ను సస్పెండ్ చేశారు. ఈమేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా నాలుగు కిలోల గంజాయిని కారులో రెండు వేర్వేరు ప్రదేశాల్లో రహస్యంగా తరలిస్తుండగా, కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డేపల్లి ప్రాంతంలో పట్టుబడ్డారు. బీట్ డ్యూటీ నిర్వహిస్తున్న సస్పెండ్ అయిన కానిస్టేబుల్, ఇద్దరు హోం గార్డులు వాహన తనిఖీ సమయంలో గంజాయి స్మగ్లర్లను గుర్తించారు. బెదిరించి వారి నుండి డబ్బులు వసూలు చేశారు.


దీంతో పాటు వారి నుండి కొద్ది మొత్తం మాత్రమే గంజాయిని స్వాధీనం చేసుకొని, పోలీసులు నిందితులను వదలివేశారు. ఇదే స్మగ్లర్లు తమ వద్ద పోలీసులకు చిక్కని గంజాయిని నర్సంపేట వద్ద విక్రయస్తుండగా స్మగ్లర్లు నర్సంపేట పోలీసులకు చిక్కారు. దీంతో ఈ అవినీతి పోలీసుల వ్యవహారం వెలుగు చూసింది. అక్రమంగా గంజాయి రవాణా జరుగుతున్నట్లుగా అధికారులకు సమాచారాన్ని ఇవ్వకపోగా, స్మగ్లర్లను బెదిరించి వారి నుండి డబ్బులు వసూళ్లు చేసినట్లుగా పోలీస్ అధికారుల చేపట్టిన విచారణలో తేలింది. అవినీతికి పాల్పడిన ఒక కానిస్టేబుల్, ఇద్దరు హోంగార్డ్స్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.