నేడో రేపో కాంగ్రెస్ మలి జాబితా

రెండో జాబితాను ఫైనల్ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం కీలక కసరత్తు సాగించింది. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ ఇంట్లో శనివారం పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది

నేడో రేపో కాంగ్రెస్ మలి జాబితా
  • స్క్రీనింగ్ కమిటీ కసరత్తు
  • ఆశావహుల చివరి ప్రయత్నాలు

విధాత : తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాను ఫైనల్ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం కీలక కసరత్తు సాగించింది. ఢిల్లీలోని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఇంట్లో శనివారం సాయంత్రం పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణ, రెండో జాబితాపై తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ అధ్యక్షులు, ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ మురళీ ధరన్ తో మానిక్ రావ్ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కమిటీ సభ్యులు ఎన్ . ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లు కీలక చర్చలు జరిపారు.


భేటీలో వామపక్షాల సీట్ల ఖరారు, టీజేఎసీ కోరిన సీట్లపై కూడా చర్చించారు. మరోవైపు పార్టీ టికెట్లు ఆశిస్తున్న ఆశావహులు ఢిల్లీకి వెళ్లి తమ చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏఐసీసీ, సీడబ్ల్యుసీ నేతలతో పాటు స్క్రీనింగ్ కమిటీ సభ్యుల చుట్టు తిరుగుతు టికెట్ల కోసం ఆఖరి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆశావహుల ప్రయత్నాలు..పైరవీలు కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు ప్రక్రియపై మరింత ఆసక్తి పెంచాయి. అంతిమంగా టికెట్ ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ పెరిగింది. నేడు ఉదయం కాంగ్రెస్‌ మిగతా అభ్యర్థులను, లెఫ్ట్ సీట్లను ఏఐసీసీ అధిష్ఠానం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మొదటి విడతలో 55 మంది అభ్యర్థుల పేర్లను ఏఐసీసీ విడుదల చేసింది.