యువ డాక్ట‌ర్ల‌కు టీ స‌ర్కార్ ఆహ్వానం

విధాత‌(హైద‌రాబాద్‌): కరోనా వైరస్‌ సుదీర్ఘ కాలం పాటు ఉంటుందని అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా పనిచేస్తున్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గించాలని, వారికి కొంత వెసులుబాటు కలిగించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన వేలమంది యువ వైద్యుల సేవలను వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో కరోనా చికిత్సలపై ముఖ్యమంత్రి ఆదివారం 4 గంటలపాటు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో దాదాపు 50 వేల మంది ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన వైద్యులున్నారు. ప్రభుత్వ […]

యువ డాక్ట‌ర్ల‌కు టీ స‌ర్కార్ ఆహ్వానం

విధాత‌(హైద‌రాబాద్‌): కరోనా వైరస్‌ సుదీర్ఘ కాలం పాటు ఉంటుందని అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా పనిచేస్తున్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గించాలని, వారికి కొంత వెసులుబాటు కలిగించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన వేలమంది యువ వైద్యుల సేవలను వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో కరోనా చికిత్సలపై ముఖ్యమంత్రి ఆదివారం 4 గంటలపాటు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో దాదాపు 50 వేల మంది ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన వైద్యులున్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో సేవలందించేందుకు వీరిలో అర్హులైన, ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించబోతున్నారు. అంతేకాదు పారామెడికల్‌ శిక్షణ పూర్తి చేసుకున్న నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లను కూడా ప్రభుత్వ దవాఖానల్లో సేవల కోసం నియోగించనున్నారు.

వచ్చే రెండు, మూడు నెలల కాలానికి పనిచేసేలా డాక్టర్లు, నర్సులు, లాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్‌ సిబ్బందిని తక్షణమే నియమించుకోవాలని, కరోనా వైద్యంలో వారి సేవలను వినియోగించుకోవాలని వైద్యాధికారులను కేసీఆర్‌ ఆదేశించారు. ఇలా సేవలందించడానికి ముందుకు వచ్చే వారికి గౌరవ ప్రదమైన రీతిలో జీతాలు అందించాలని అన్నారు. అంతేకాకుండా కరోనా వంటి సంక్షోభ సమయంలో రాష్ట్రం కోసం పని చేసేందుకు ముందుకు వచ్చే వారికి సరైన గుర్తింపునివ్వాలని ఆయన సూచించారు.

భవిష్యత్తులో ప్రభుత్వం జరిపే ఉద్యోగ నియామకాల్లో వారికి వెయిటేజీ మారులను కలపాలని ఆదేశించారు. యువ వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, కష్టకాలంలో మన ప్రజలకు సేవచేయడానికి ముందుకు రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి ఆసక్తి వున్నవాళ్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సీఎం తెలిపారు.

ప్రభుత్వ దవాఖానాల్లో పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నవారు https://odls. telangana. gov.in/ medicalrecruitment/Home.aspx.. వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డాక్టర్లతో పాటు రాష్ట్రంలో అర్హతవున్న నర్సులు, లాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్‌ సిబ్బందికి భవిష్యత్తులో ప్రభుత్వం తగు ప్రాధాన్యం ఇస్తుందనీ, అందువల్ల కరోనా సమయంలో పని చేయడానికి ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. కరోనా తీవ్రత నేపథ్యంలో రాష్ట్రంలో వైద్యారోగ్యశాఖ ఇప్పటికే పలు పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది.

వరంగల్‌, ఆదిలాబాద్‌లో సూపర్‌ స్పెషాలిటీ దవాఖానలు
వరంగల్‌, అదిలాబాద్‌ జిల్లాల్లో సూపర్‌ స్పెషాలిటీ దవాఖానలను తక్షణమే ప్రారంభించాలని, వైద్య సిబ్బందిని నియమించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కాకతీయ మెడికల్‌ కాలేజీ ఆవరణలో నిర్మించిన, ఎంజీఎంకు చెందిన 250 పడకల సూపర్‌ స్పెషాలిటీ దవాఖానను, అదిలాబాద్‌ జిల్లా రిమ్స్‌లోని మరో 250 పడకల సూపర్‌ స్పెషాలిటీ దవాఖానను తక్షణమే ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.

పీఎంఎస్‌ఎస్‌వై కింద ఎంజీఎంలో నిర్మిస్తున్నసూపర్‌ స్పెషాలిటీ నిర్మాణానికి ప్రభుత్వ వాటాకింద అందచేయాల్సిన 8 కోట్ల రూపాయలను, రిమ్స్‌లో నిర్మిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ దవాఖానకు ప్రభుత్వ వాటాకింద 20 కోట్ల రూపాయలను, మొత్తం 28 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావుకు సీఎం సూచించారు. వరంగల్‌ దవాఖాన కోసం 363 వైద్య సిబ్బందిని, అదిలాబాద్‌ రిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ కోసం 366 మంది వైద్యసిబ్బందిని, మెత్తం 729 సిబ్బంది నియామకానికి వెంటనే చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు ఉత్తర్వులు జారీచేశారు.

సమీక్షా సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు , ఎర్రబెల్లి దయాకర్‌ రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌ , ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి , రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ , వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి , కొవిడ్‌-19పై సీఎంవో ప్రత్యేక అధికారి రాజశేఖర్‌రెడ్డి , హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, డీఎంఈ కే రమేశ్‌రెడ్డి, కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి, టీఎస్‌ఎంఎస్‌ ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, టెక్నికల్‌ అడ్వైజర్‌ గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు, బెడ్లు, ఇతర కరోనా సౌకర్యాల పరిస్థితి గురించి ఈ సందర్భంగా సీఎం అధికారులను అడిగి తెలుసుకొన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేదని వారు వివరించారు. రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు కూడా లక్ష దాకా నిల్వ ఉన్నాయని తెలిపారు. వీటితో పాటు కరోనా చికిత్సకు వాడే అత్యవసర మందులన్నింటినీ సిద్ధంగా ఉంచామని వైద్యారోగ్యశాఖ అధికారులు వివరించారు.

ప్రభుత్వ దవాఖానల్లో బెడ్లకు కూడా ఎలాంటి కొరత లేదని చెప్పారు. మొత్తం 7,393 సాధారణ బెడ్లు, 2,470 ఆక్సిజన్‌ బెడ్లు, 600 వెంటిలేటర్‌ బెడ్లు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. మందులతోపాటు, వైద్య బృందాలు ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్నాయని వివరించారు. కాగా ప్రైవేటు దవాఖానాల్లో రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను మరింతగా అందుబాటులోకి తెచ్చేందుకు వెంటనే ఏర్పాట్లు చేయాలని సీఎం వారికి సూచించారు.