కన్నడ మంత్రంతోనే కాంగ్రెస్‌పై ఎదురుదాడి

కన్నడ మంత్రంతోనే కాంగ్రెస్‌పై ఎదురుదాడి
  • ఆరు హామీలపై బీఆరెస్‌ ప్రచార వార్‌


విధాత : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయంతో తెలంగాణలో ఆ పార్టీ గ్రాఫ్‌ ఒక్కసారిగా పెరిగింది. అక్కడ ఐదు గ్యారెంటీల జనాకర్షక మంత్రంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల హామీలతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది. ఆరు నూరయ్యేనంటూ ఆరు గ్యారంటీలతో నూరు సీట్లకు గాలం వేసింది. కాంగ్రెస్‌ ఆరుగ్యారంటీల దెబ్బకు సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం దిగొచ్చి పోటీగా ఆ పార్టీ మ్యానిఫెస్టోలో పలు వరాలు కురిపించింది.


ఇదంతా ఒక భాగమైతే అసలు కాంగ్రెస్‌ కర్ణాటక ఎన్నికల్లో ఇచ్చిన ఐదు గ్యారంటీల అమలులో వెలుగుచూస్తున్న లోటుపాట్లనే అస్త్రంగా మలుచుకుంటూ కాంగ్రెస్‌పై ఆ పార్టీ హామీలతోనే బీఆరెస్‌ ఎదురుదాడి చేస్తుంది. ఈ దాడిలో సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే యువనేత, మంత్రి కేటీఆర్‌ ముందున్నారు. ఆయన తాజాగా కర్ణాటకలో ఓ సబ్‌ స్టేషన్‌ వద్ద రైతులు మొసలితో ధర్నా చేయడం, మరోచోట పురుగుమందు డబ్బాతో నిరసనకు దిగడం వంటి వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తను ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని ప్రచారం సాగిస్తున్నారు.


దీనిపై పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కౌంటర్‌ వేస్తూ దోచుకున్న సొమ్ముతో ఫేక్‌ ప్రచారంలో దిట్టగా మారావంటూ కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. మొత్తంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల హామీల రూపకల్పన, ప్రచార పర్వం ప్రధానంగా కాంగ్రెస్‌, బీఆరెస్‌ల మధ్య కర్ణాటక కాంగ్రెస్‌ ఎన్నికల హామీల చుట్టే సాగుతుండటం ఈ సందర్భంగా గమనార్హం. ఒకరకంగా కాంగ్రెస్‌ ఆరుగ్యారంటీలు, డిక్లరేషన్లకు ముందుగా బీఆరెస్‌ ప్రభుత్వం తమ పదేళ్ల పాలన కాలంలో అమలు చేసిన పథకాలను గొప్పగా ప్రచారం చేసుకుంది.


తెలంగాణ ఆచరిస్తుంది…దేశం అనుసరిస్తుందంటూ తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శమంటూ ప్రచారం సాగించింది. కాంగ్రెస్‌ ఆరుగ్యారంటీలు, డిక్లరేషన్లకు ప్రజల నుంచి వచ్చిన స్పందనను అంచనా వేసిన గులాబీ బాస్‌ కేసీఆర్‌ గృహలక్ష్మి, మైనార్టీ బంధు, బీసీ బంధు, ఆరోగ్య శ్రీ పెంపుతో పాటు ఎన్నికల మ్యానిఫెస్టోలో సౌభాగ్యలక్ష్మి, 400సిలిండర్‌, 15లక్షల ఆరోగ్య శ్రీ, పేద మహిళలకు 3వేల భృతి, రైతుబంధు, ఆసరా పించన్ల పెంపు వంటి కొత్త పథకాలు ప్రకటించాల్చివచ్చింది.