55 మందితో కాంగ్రెస్ జాబితా

ఎప్పుడెప్పుడా అని కాంగ్రెస్ ఆశావ‌హుల‌ను ఊరిస్తూ వ‌చ్చిన కాంగ్రెస్‌.. త‌న తొలి జాబితాను ఆ పార్టీ అధిష్ఠానం ఎట్ట‌కేల‌కు విడుద‌ల చేసింది.

55 మందితో కాంగ్రెస్ జాబితా
  • ఎట్ట‌కేల‌కు తొలి విడుత విడుద‌ల‌
  • ఓసీల‌కు 26, బీసీ, ఎస్సీల‌కు 12 చొప్పున‌
  • ఎస్టీల‌కు 2, మైనార్టీల‌కు 3 కేటాయింపు
  • వ‌ల‌స నేత‌లు 12 మందికి టికెట్‌లు
  • మైన‌ప‌ల్లి, ఉత్త‌మ్ కుటుంబాల‌కు రెండేసి

విధాత : ఎప్పుడెప్పుడా అని కాంగ్రెస్ ఆశావ‌హుల‌ను ఊరిస్తూ వ‌చ్చిన కాంగ్రెస్‌.. త‌న తొలి జాబితాను ఆ పార్టీ అధిష్ఠానం ఎట్ట‌కేల‌కు విడుద‌ల చేసింది. ఆదివారం ఉద‌యం 55 మంది పేర్ల‌తో తొలి జాబితాను ఏఐసీసీ విడుద‌ల చేసింది. తొలి జాబితాలో ప్ర‌క‌టించిన పేర్ల‌లో 17 మంది రెడ్డి సామాజిక‌వ‌ర్గం స‌హా 26 మంది అగ్ర‌వ‌ర్ణాల వారు ఉన్నారు. బీసీలు, ఎస్సీలు 12 మంది చొప్పున ఉన్నారు. ఇద్ద‌రు ఎస్టీలు, ముగ్గురు మైనార్టీల‌కు టికెట్లు ల‌భించాయి. చాలా వ‌ర‌కూ పేర్లు ముందుగా ఊహించిన విధంగానే ఉన్నాయి. ఇత‌ర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన 12 మందికి కూడా టికెట్లు ల‌భించాయి. ఒక కుటుంబం నుంచి ఇద్ద‌రికి టికెట్లు ఇవ్వ‌కూడ‌ద‌న్న‌ ఉద‌య్‌పూర్ డిక్ల‌రేష‌న్ ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు కుటుంబానికి, ఉత్త‌మ్‌రెడ్డి కుటుంబానికి రెండేసి టికెట్ల చొప్పున ల‌భించాయి. మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు త‌న కుమారుడు రోహిత్‌రావుకు టికెట్ హామీపైనే కాంగ్రెస్‌లో చేరిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు ఇద్ద‌రికీ టికెట్లు ల‌భించాయి. హ‌న్మంత్ రావు మ‌ల్కాజ్‌గిరి, రోహిత్ రావు మెద‌క్ నుంచి పోటీ చేయ‌నున్నారు.

మ‌రోవైపు టీపీసీసీ మాజీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డికి, ఆయ‌న భార్య ప‌ద్మావ‌తికి అవ‌కాశం క‌ల్పించారు. ఉత్త‌మ్ హుజుర్‌న‌గ‌ర్ నుంచి, ప‌ద్మావ‌తి కోదాడ నుంచి బ‌రిలో దిగ‌నున్నారు. పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి త‌న కొడంగ‌ల్ స్థానం నుంచే పోటీ చేయ‌నున్నారు. కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి న‌ల్ల‌గొండ నుంచి పోటీ చేయ‌నున్నారు. నాగార్జున సాగ‌ర్‌లో జానారెడ్డి స్థానంలో ఆయ‌న కుమారుడు జ‌య‌వీర్‌కు అవ‌కాశం ఇచ్చారు. నాగం జ‌నార్ధ‌న్ రెడ్డి ఆశించిన నాగ‌ర్‌క‌ర్నూల్ టికెట్‌ను కూచుకుళ్ల రాజేశ్ రెడ్డికి కేటాయించారు. కొల్లాపూర్ టికెట్‌ను జూప‌ల్లి కృష్ణారావు.. చింత‌ల‌ప‌ల్లి జ‌గ‌దీశ్వ‌ర్ రావును కాద‌ని ద‌క్కించుకున్నారు.

ప‌లువురికి నిరాశ‌

తొలి జాబితా ప్ర‌క‌ట‌న‌లో వివిధ జిల్లాల్లో టికెట్ ఆశించిన నేత‌లు నిరాశ‌కు గుర‌య్యారు. గజ్వేల్ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి, మంత్రిగా ఉమ్మడి మెదక్ జిల్లాపై చెరగని ముద్ర వేసుకున్న గీతా రెడ్డికి తొలిజాబితాలో చోటు దక్కలేదు. గతంలో గీతా రెడ్డి ప్రాతినిధ్యం వహించిన జహీరాబాద్ నుంచి అనూహ్యంగా వికారాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్‌కు టికెట్ కేటాయించారు. ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఇంత కాలం కాంగ్రెస్ కు సేవలు అందించినా టికెట్ దక్కకపోవడంతో నిరాశలో ఉన్నారు.

కొల్లాపూర్ టికెట్‌.. ఇటీవ‌ల పార్టీలో చేరిన జూప‌ల్లి కృష్ణారావుకు ద‌క్క‌డంతో ఇంత కాలం ఇక్క‌డ పార్టీనే న‌మ్ముకుని ఉన్న జగదీశ్వర్ రావుకు నిరాశే మిగిలింది. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్‌లో మహబూబాబాద్ టికెట్ ఆశిస్తున్న మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరామ్ నాయక్, వరంగల్ తూర్పు టికెట్ తమదేననే ధీమాతో ఉన్న కొండా సురేఖ, పశ్చిమ ఈసారి తనకే అంటున్న హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, పాలకుర్తి నుంచి ఝాన్సీరెడ్డికి అవ‌కాశం ల‌భించ‌లేదు. ఈ స్థానాల్లో వివిధ కారణాల రీత్యా తొలి జాబితాలో అవకాశం కల్పించలేదని చెబుతున్నారు.