తీన్మార్‌ ప్రచారం.. మూడు రోజుల్లో మైకులు బంద్‌

తెలంగాణలో ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడింది. సరిగ్గా ఐదు రోజుల్లో పోలింగ్‌ జరుగనుండగా.. ప్రచారానికి మూడు రోజులే మిగిలాయి

తీన్మార్‌ ప్రచారం..  మూడు రోజుల్లో మైకులు బంద్‌

– ప్రచారాల జోరు పెంచిన నేతలు

– రాజస్థాన్‌లో ముగిసిన ఎన్నికలు

– రాహుల్‌, మోదీ సహా అంతా రాష్ట్రంలో

– ఒకే ఒక్కడై అన్ని సెగ్మెంట్లకు కేసీఆర్‌

– కాంగ్రెస్‌ నుంచి ప్రియాంక, ఖర్గే, డీకే

– తెలంగాణలో అమిత్‌షా, నడ్డా మకాం

– రాష్ట్రమంతటా జాతీయ నేతల టూర్లు

– మెజార్టీకి ఐదారు స్థానాలు తగ్గినా

బీఆరెస్‌కే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం

– కాంగ్రెస్‌ సర్కార్‌ రావాలంటే 70 దాటాలి!

విధాత ప్రత్యేకం: తెలంగాణలో ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడింది. సరిగ్గా ఐదు రోజుల్లో పోలింగ్‌ జరుగనుండగా.. ప్రచారానికి మూడు రోజులే మిగిలాయి. ఇప్పటిదాకా ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న జాతీయ స్థాయి నాయకులు.. ఇక రాజస్థాన్‌లో పోలింగ్‌కూడా ముగియడంతో తెలంగాణపై దృష్టి కేంద్రీకరించారు. ఎటు చూసినా జాతీయ నాయకత్వమే కనిపిస్తున్నది. బీజేపీ తరఫున ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ తదితరులు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ కీలక నేత ప్రియాంక గాంధీతోపాటు.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, ఆ రాష్ట్ర మంత్రి మునియప్ప వంటివారు రాష్ట్రం నలుమూలలా పర్యటిస్తూ సభల్లో పాల్గొంటున్నారు. ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మొత్తం ప్రచార కార్యక్రమాలను సమన్వయం చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రచార భారాన్ని మోస్తున్నారు. ఆయనతోపాటు.. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క సైతం ఇతర నియోజకవర్గాలకూ ప్రచారానికి వెళుతున్నారు. మిగిలిన మూడు రోజుల్లో సోనియాగాంధీ పాల్గొనేలా ఒక సభకు కాంగ్రెస్‌ నేతలు ప్లాన్‌ చేస్తున్నారని తెలిసింది. తెలంగాణ ఇచ్చిన సెంటిమెంట్‌ను బలంగా తీసుకువెళ్లటంతోపాటు.. ఆరు గ్యారెంటీలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

ఒకే ఒక్కడై కేసీఆర్‌

బీఆరెస్‌ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వందకుపైగా నియోజకవర్గాల్లో సభల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే 80కి పైగా సభల్లో పాల్గొన్న కేసీఆర్.. ఈ మూడు రోజుల్లో మిగిలిన నియోజకవర్గాల్లో సభలకు ప్లాన్‌ చేస్తున్నారు. శనివారం కేసీఆర్‌ హైదరాబాద్‌లో ప్రచారం చేస్తారని భావించినా.. రద్దు చేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రెస్‌మీట్‌ పెడతారని వార్తలు వచ్చినా.. అది కూడా అవలేదు. ఇక బీఆరెస్‌ తరఫున మంత్రి కేటీఆర్‌.. పెద్ద ఎత్తున రోడ్‌షోలలో పాల్గొంటున్నారు. మరో మంత్రి హరీశ్‌రావు సైతం కీలక నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు బాధ్యతను భుజానికెత్తుకున్నారు.

పోటీ ఇద్దరి మధ్యే

రంగంలో చాలా పార్టీలు ఉన్నా, బీఆరెస్‌, కాంగ్రెస్‌ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని ప్రచార సరళిని బట్టి అర్థమవుతున్నది. బీసీ సీఎం, ఎస్సీ వర్గీకరణకు మద్దతు అంశాలతో బీజేపీ బరిలో ఉన్నా.. కొన్ని చోట్ల మాత్రమే ఆ పార్టీ గట్టి ప్రత్యర్థిగా ఉంటుందని అంటున్నారు. చాలా స్థానాల్లో కాంగ్రెస్, బిఆర్ఎస్‌ల మ‌ధ్య‌నే ద్విముఖ పోరు జ‌రుగుతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే.. త్రిముఖ పోరు జ‌రుగుతున్న స్థానాలు కాంగ్రెస్‌, బీఆరెస్‌ విజయావకాశాలపై ప్రభావం చూపొచ్చని అంచనా వేస్తున్నారు. 60 సీట్ల మ్యాజిక్ సంఖ్య‌ను చేరుకోవ‌డంలో ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల మాటెలా ఉన్నా, ఈ ముక్కోణ‌పు పోటీ జ‌రుగుతున్న స్థానాలు కీలక పాత్ర పోషిస్తాయి.

ఎవరికి ఎన్ని సీట్లు వస్తే?

ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆరెస్‌ మధ్య హోరాహోరీ పోరు సాగుతుందనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నది. 60 సీట్లు గెలుచుకునే పార్టీకి రాష్ట్రంలో అధికారం దక్కుతుందనేది అందరికీ తెలిసిందే. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీకి మెజార్టీ దక్కే అవకాశాలు లేవనే చర్చ కూడా నడుస్తున్నది. అదే వాస్తవరూపం దాల్చితే అటు బీఆరెస్‌ ఇటు కాంగ్రెస్‌కు ఏదో ఒక పార్టీ మద్దతు ఇస్తేనే ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం. అయితే.. బీఆరెస్‌కు ఐదారు సీట్లు తగ్గినా.. ఎంఐఎం మద్దతుతో సులభంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అంతకంటే తగ్గినా బీజేపీ మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు. అయితే.. కాంగ్రెస్‌ మాత్రం 70కి తగ్గకుండా గెల్చుకుంటే తప్ప ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉంటుందని అంటున్నారు. అయితే.. అంత పరిస్థితి ఉండబోదని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ హవా ఉన్నదని, బలమైన ప్రభుత్వాన్ని తమ పార్టీ ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్‌ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో బీఆరెస్‌ సైతం 95 నుంచి 100 సీట్ల మధ్య గెలువబోతున్నామని ఇప్పటికే ప్రకటించింది. మరి ఓటరు మదిలో ఏమున్నదో.. మూడో తేదీన కానీ తేలదు!