చీలిక ఓట్లతో లాభం ఎవరికి.. ?
అసెంబ్లీ ఎన్నిక పోరు పతాక సన్నివేశానికి చేరువవుతోంది. కాంగ్రెస్, బీఆరెస్, బీజేపీ పార్టీల అగ్ర నేతలు తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు

- ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆరెస్‌ల మధ్యే
- 118 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ కూటమి
- బీఎస్పీ, సీపీఎం, స్వతంత్రులూ బరిలో..
- వీరికి పడే ఓట్లతో ఏ పార్టీకి నష్టమో…!
- గెలుపుకు ప్రాతిపదిక 3%-5% ఓట్లలోపే
- ప్రధాన పార్టీ నేతల్లో టెన్షన్ టెన్షన్
విధాత, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నిక పోరు పతాక సన్నివేశానికి చేరువవుతోంది. కాంగ్రెస్, బీఆరెస్, బీజేపీ పార్టీల అగ్ర నేతలు తెలంగాణలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. విమర్శల తీవ్రత కూడా పెరిగింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, వరుస హామీలతో నేతల ఉపన్యాలు నిండి పోయాయి. బీఆరెస్ నేతలు 95 నుంచి 100 స్థానాల్లో గెలుస్తామని చెబుతుంటే.. తమకు 70కి తగ్గకుండా వస్తాయని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పైకి గంభీరంగా ప్రకటనలు చేసుకుంటున్నా.. ఆయా పార్టీలు తీవ్ర అంతర్మధనంలో పడిపోయాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆరెస్ మధ్యనే ఉంది. 30కి పైగా నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ కొనసాగుతున్నదని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య ఓట్ల శాతంలో అతి కొద్ది తేడా మాత్రమే ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టఫ్ ఫైట్ నడిచే నియోజకవర్గాలలో ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
ప్రధాన పార్టీలకు చీలిక ఓట్ల ముప్పు
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆరెస్‌లను పక్కనపెడితే.. బీజేపీ-జనసేన కూటమి 118 సీట్లలో, బీఎస్పీ 111 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాయి. సీపీఎం 17 స్థానాల్లో పోటీకి నిలువగా, ఇండిపెండెంట్లు దాదాపు అన్ని నియోజకవర్గాలలో బహుళ సంఖ్యలో రంగంలో ఉన్నారు. బీజేపీ పది నియోజకవర్గాలలో గట్టి పోటీ ఇస్తుందనే అంచనాలు ఉన్నాయి. బీఎస్పీ రెండు, మూడు నియోజకవర్గాలలో పోటీ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. సీపీఎం పార్టీ ఎక్కడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం లేకున్నా పోటీ చేసిన స్థానాల్లో 5నుంచి 10 వేల మధ్య ఓట్లు చీల్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతున్నది. పైగా ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన వారిలో ఆయా పార్టీల నుంచి టికెట్లు లభించక స్వతంత్రులుగానో, లేక ఏదైనా పార్టీ నుంచో పోటీలో ఉన్నారు. ఇలా పోటీలో ఉన్న వారిలో కొత్తగూడెం నుంచి పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే జలగం ప్రసాదరావు ప్రధాన పార్టీ అభ్యర్థులకు గట్టి పోటీ ఇస్తున్నారని క్షేత్రస్థాయి పరిశీలనల్లో తెలుస్తున్నది. మిగిలిన స్థానాల్లో వీరి పోటీ అంతా నామమాత్రమేనని అంటున్నారు. కాగా కొల్లాపూర్‌లో పోటీ చేసిన బర్రెలక్క అలియాస్ శిరీషకు సోషల్ మీడియాలో బాగా ప్రచారం వచ్చింది. దీంతో ఆమె ఎన్ని ఓట్లు చీలుస్తారోనన్న గుబులు ప్రధాన పార్టీ అభ్యర్థులకు పట్టుకున్నది.
మెజార్టీలు గణనీయంగా పడిపోయే చాన్స్
బీజేపీ, బీఎస్పీ, సీపీఎం, స్వతంత్ర అభ్యర్థులు ఏ మేరకు ఓట్లు చీలుస్తారు? దీని వల్ల జరిగే నష్టం ఏమిటి? దీంతో లాభం ఎవరికి వస్తుందన్న చర్చలు సర్వత్రా సాగుతున్నాయి. ముఖ్యంగా స్వతంత్రులు, ఇతర పార్టీల అభ్యర్థులు ప్రతి నియోజక వర్గంలో 5 వేల ఓట్ల మధ్యన చీల్చుకునే అవకాశం ఉందని అంచనా. అనేక నియోజకవర్గాలలో గెలిచే పార్టీకి వచ్చే మెజార్టీ కంటే చీలిపోయే ఓట్ల సంఖ్యే ఎక్కువగా ఉండొచ్చని అంటున్నారు. ఇలా చీలి పోయే ఓట్లు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నవి ఉంటాయా? లేక ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఉంటాయా? అన్న దానిపైనే గెలుపు ప్రభావం ఉంటుందన్న చర్చ జరుగుతోంది.
ఆ పార్టీలు చీల్చేది వ్యతిరేక ఓటునే!
బీజేపీ, బీఎస్పీ ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌కు 80 శాతం ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న మాదిగల ఓట్లను తనవైపుకు తిప్పుకొనే యత్నాలు బీజేపీ చేసిందన్న వాదన వినిపిస్తున్నది. ఇందులో భాగంగానే ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మోదీ సమక్షంలో తెరపైకి తెచ్చారని అంటున్నారు. మాదిగల సభలో వేదికపై మంద కృష్ణ ఆలింగనం ఈ క్రమంలో ఉద్దేశించిందేనని అభిప్రాయపడుతున్నారు. దళితులు కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. వారిని దళితబంధు పేరుతో అమాంతం తనవైపు తిప్పుకొనేందుకు బీఆరెస్ ప్రయత్నించింది. అయితే.. ఈ పథకం అమలులో తీవ్ర జాప్యం, లబ్దిదారులందరికీ పథకం అమలు కాక పోవడం అనేక విమర్శలకు తావిచ్చింది. ఈ పథకాన్ని బీఆరెస్ కార్యకర్తల పథకంగా మార్చారన్న విమర్శలు కూడా వెలువడుతున్నాయి. ఇది నిజానికి మెజార్టీ దళితులను బీఆరెస్‌కు వ్యతిరేకంగా మార్చిందని అంటున్నారు. దళిత, బహుజనుల ఓటు బ్యాంకును తమ వైపుకు తిప్పుకోవడం ద్వారా రాష్ట్రంలో గణనీయమైన ఓటు బ్యాంకును సంపాదించుకోవాలని చూసిన బీఎస్పీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఈ పార్టీలకు పడే ఓట్లు ఏ పార్టీకి నష్టం చేస్తుంది? ఏ పార్టీకి లాభం చేస్తుందన్న చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా జరుగుతోంది.