Medigadda | మేడిగడ్డపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యారేజీ మరమ్మతుల పర్యవేక్షణకు నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటుకు నీటి పారుదల శాఖ సిద్ధమైంది

మరమ్మతుల పర్యవేక్షణకు కమిటీ
విధాత: మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యారేజీ మరమ్మతుల పర్యవేక్షణకు నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటుకు నీటి పారుదల శాఖ సిద్ధమైంది. ఈఎన్సీ(జనరల్) అనిల్‌కుమార్, ఈఎన్సీ(ఓఆండ్‌ఎం) నాగేంద్రరావు, సీఈ(సీడీవో) మోహన్‌కుమార్, రామగుండం సీఈ సుధాకర్‌రెడ్డిలు కమిటీలో ఉండనున్నారు. ఇటీవల నేషనల్ డ్యాం సేఫ్టీ ఆథార్టీ సమర్పించిన మధ్యంతర నివేదికలో వానకాలం వరదలొచ్చేలోగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. అటు నిర్మాణ సంస్థ ఎల్‌ఆండ్‌టీ కూడా మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులకు ముందుకు వచ్చింది. మరమ్మతులకు 300కోట్లు అవసరమవుతాయన్న అంచనాల నేపథ్యంలో ఆ ఖర్చు నిర్మాణ సంస్థ పెట్టుకోవాలా లేక ప్రభుత్వం నిధులు మంజూరీ చేస్తుందా అన్నదానిపై సందిగ్థత కొనసాగుతుంది.
ఈ అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సివుంది. అలాగే మేడిగడ్డలో కుండిన ఏడో బ్లాక్‌లోని 15నుంచి 22గేట్లలో 20,21గేట్లను పూర్తిగా తొలగించాలని ఎన్డీఎస్‌ఏ మధ్యంతర నివేదికలో సూచించింది. మిగిలిన ఆరు గేట్లను కూడా పైకెత్తి సమస్యలున్న గేట్లను కూడా తొలగించాలని సూచించింది. బ్యారేజీకి ఉన్న 86గేట్లలో కుంగుబాటుకు గురైన వాటిలో 15వ నెంబర్ గేటు ఎత్తారు. మిగతా వాటిని కూడా ఎత్తి వాటి పరిస్థితిని పరిశీలించనున్నారు. బ్యారేజీ వద్ధ జియోఫిజికల్ టెస్టులు కూడా చేయించి మరమ్మతులపై ప్రభుత్వం ముందుకెళ్లాలని భావిస్తుంది. ఇక మేడిగడ్డ నిర్మాణ లోపాలపై న్యాయవిచారణకు సంబంధించి జస్టిసి పీసీ ఘోష్ కమిటీ జూన్ మొదటి వారంలో మరోసారి విచారణ చేపట్టనుంది.